దొంగ.. దొంగా..

23 Nov, 2013 06:12 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్ :  జిల్లాలో వరుసగా జరుగుతున్న దొంగతనాలు ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. తాళం వేస్తే చాలు ఇల్లు గుల్లవుతోంది. నగరం, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా నిత్యం ఏదో ఒకచోట దొంగతనం జరుగుతూనే ఉంది. ఈ వరుస దొంగతనాలు ఇటు పోలీసులకూ సవాల్‌గా మారుతున్నాయి. గత నెల రోజులుగా నిజామాబాద్ నగరంతో పాటు, జిల్లాలో ఏదో ఒక చోట నిత్యం చోరీ జరుగుతూనే ఉంది. ఒకటీ రెండు ఘటనలు మినహా జిల్లాలో స్థానిక ముఠాలే ఎక్కువగా ఈ ఆగడాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
 
 ఆందోళనకరం..
 జిల్లాలో దొంగతనం కేసులు నమోదవుతున్న తీరు ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లావ్యాప్తం గా 42 పోలీసుస్టేషన్ల పరిధిలో ఈ ఏడాది అక్టోబర్ వరకు 386 చోరీ కేసులు నమోదయ్యాయంటే ఏ స్థాయిలో దొంగతనాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇందులో 338 కేసులు రాత్రి వేళల్లో ఇంటి తాళం పగులగొట్టి జరిగిన దొంగతనాలు కాగా, మరో 48 కేసులు పట్టపగలే జరిగినవి. ఈ లెక్కన వారానికి ఒకటై నా పట్టపగలే చోరీ జరుగుతోంది. గతేడాదితో పోల్చినా ఈ ఏడాది దొంగతనాల సంఖ్య బాగా పెరిగింది. శివారు ప్రాంతాలే కాకుండా, నగరం నడిబొడ్డున కూడా దొంగలు తెగబడుతున్నారు.
 
 పోలీసుల వైఫల్యం..
 దొంగతనాలను అరికట్టడంలో పోలీసుశాఖ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వీటిని అరికట్టడానికి పలు విభాగాలు ఉన్నప్పటికీ ఫలితం శూన్యం. స్థానికంగా ఉంటూ నేరాలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టి నేరస్తులను పట్టుకోవాల్సిన ఐడీ పార్టీ విభాగం పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. సబ్ డివిజన్, సర్కిల్ పరిధుల్లో ఈ ఐడీ పార్టీలు పనిచేస్తున్నాయి. గతంలో జరిగిన నేరాల తీరును పరిశీలించి, పాత నేరస్తులను విచారించడం, నేరాలకు పాల్పడుతున్న వారిని పట్టుకోవడం ఈ విభాగం ప్రధాన విధి. కానీ ఐడీ పార్టీలో పనిచేస్తున్న కొందరు అసలు విధులను పక్కన బెట్టి, ఆయా స్టేషన్ల పరిధిలోని పోలీసు అధికారులకు వసూళ్లు చేసిపెట్టే కలెక్షన్ కింగ్‌లుగా తయారయ్యారనే ఆరోపణలున్నాయి. దీంతో కొన్ని చోట్ల ఈ ఐడీ పార్టీలను రద్దు చేశారు. దొంగతనం జరిగిన చోట వేలిముద్రలు సేకరించి వాటి ద్వారా నేరస్తులను పట్టుకోవడంలో క్లూస్‌టీం (ఫింగర్ ప్రింట్స్) విభాగం సహకరిస్తుంది. భారీ దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా సీసీఎస్ విభాగం కూడా ఉంది. ఈ విభాగాలన్నీ ఉన్నప్పటికీ చోరీలు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి.
 
 అజాగ్రత్తలే అవకాశంగా..
 దొంగలు తెగబడటానికి ప్రజల అజాగ్రత్తలు కూడా ఓ కారణమని పోలీసులు అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా ఇంటికి తాళం వేసి వేళ్లే ముందు ఇంట్లో విలువైన వస్తువులు, అభరణాలు, నగదు ఉంచవద్దని పోలీసులు పేర్కొంటున్నారు. ఎవరో ఒకరు ఇంట్లో ఉంటే చాలా మట్టుకు దొంగతనాలు తగ్గుతాయంటున్నారు. కానీ ప్రజలు ఇవేవీ పట్టించుకోకుండా అజాగ్రత్తతో వ్యవహరించడంతో దొంగతనాలు జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
 ఫలితమివ్వని పెట్రోలింగ్

 నైట్ పెట్రోలింగ్‌లో పోలీసుల నిర్లక్ష్యం కారణంగా దొంగతనాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయనే విమర్శలున్నాయి. బీట్ డ్యూటీ లు సరిగ్గా చేయకపోవడం కూడా దొంగలకు అవకాశం ఇచ్చినట్లవుతోందనే అభిప్రాయం ఉంది. జిల్లాలో రోజూ నైట్ మానిటరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. డీఎస్‌పీ స్థాయి అధికారులు రోజుకొక్కరు చొప్పున రాత్రంతా నైట్ మానిటరింగ్ చేస్తున్నారు. సబ్ డివిజన్ స్థాయిలో సీఐలు, సర్కిల్ స్థాయిలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐలు నిత్యం నైట్ మానిటరింగ్‌ను పర్యవేక్షిస్తున్నట్లు రికార్డుల్లో పేర్కొంటున్నారు. కానీ పర్యవేక్షణ పెద్దగా ఫలితం ఇవ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
 పెట్రోలింగ్‌ను పటిష్టం చేస్తున్నాం
 -తరుణ్‌జోషి, ఎస్‌పీ

 జిల్లాలో దొంగతనాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా రాత్రి పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. దొంగతనాలు ఏ సమయంలో జరుగుతున్నాయి.. ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయి.. వంటి అంశాలపై దృష్టి సారించాం. ఎక్కువ దొంగతనాలు జరుగుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇంటికి తాళం వేసి వెళుతున్నప్పుడు సంబంధిత పోలీసు స్టేషన్‌లో సమాచారం అందిస్తే ఆ ఏరియాల్లో పెట్రోలింగ్ పెంచుతాం.

మరిన్ని వార్తలు