వివాదాలకు వేదికగా..

3 Dec, 2018 12:00 IST|Sakshi
కాపు కార్తిక వన సమారాధనలో నినాదాలు చేస్తున్న వారిని వారిస్తున్న కాపు నాయకులు

గాడితప్పుతున్న కార్తిక వన సమారాధనలు

రాజకీయ వేదికగా కాపుల గార్డెన్‌ పార్టీ

తూర్పుగోదావరి, కాకినాడ:  రాజకీయాలకు అతీతంగా ఏటా జరిగే కార్తిక సమారాధనలు గాడి తప్పుతున్నాయి. పార్టీలతో ప్రమేయం లేకుండా సామాజిక వర్గం ఐక్యతే లక్ష్యంగా జరగాల్సిన గార్డెన్‌ పార్టీలను రాజకీయ ప్రయోజనాలకు వేదికగా వాడుకుంటున్నారు కొందరు. తాజాగా ఆదివారం జరిగిన కాపు కులస్తుల కార్తిక వన సమారాధనలో కొంత మంది జనసైనికులు చేసిన హంగామా ఉద్రిక్తతకు దారి తీసింది. రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది జనసేన పార్టీ నేతలు కొంత మంది కాపు యువతను రెచ్చగొట్టి వివాదాన్ని రేపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బయట జరిగే రాజకీయ విమర్శలు ఎత్తుగడలను సామాజిక వర్గ వేదికగా వివాదాస్పదం చేసిన తీరు కాపు వర్గీయులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

వారిస్తున్నా..
కాపు కల్యాణ మండపంలో జరుగుతున్న కాపు కార్తిక సమారాధనకు వైఎస్సార్‌ సీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తన అనుచరులతో తరలివెళ్లారు. ఆయనను చూడగానే పవర్‌ స్టార్‌ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ప్రారంభించారు. సామాజిక వర్గ వేదిక కావడంతో కన్నబాబుతో ఉన్న అనుచరులు జై కాపు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభా వేదిక నినాదాలతో హోరెత్తింది. కొద్ది రోజుల క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌ కన్నబాబుతోపాటు కొంతమంది వైఎస్సార్‌ సీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో కన్నబాబు ఘాటుగానే పవన్‌కు కౌంటర్‌ ఇచ్చారు. అప్పటి నుంచి కన్నబాబుపై గుర్రుగా ఉన్న జనసేన కార్యకర్తలు, నేతలు అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆయనపై మాటల యుద్ధానికి తెరతీస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కరపలో కన్నబాబుకు వ్యతిరేకంగా హడావుడి చేసిన వారు ఇప్పుడు కాకినాడ కాపుసమారాధన వేదికగా మరో సారి వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. కార్యకర్తలను సముదాయించాల్సిన ఒక జనసేన నాయకుడు తొడగొట్టి మరీ వారిని రెచ్చగొట్టి వివాదానికి మరింత ఆజ్యం పోయడంతో అక్కడ ఇరువర్గాల తోపులాటకు దారి తీసింది. సంయమనంతో వ్యవహరించాల్సిన నేతలు కొంత మంది కాపు యువతను రెచ్చగొట్టి మరీ వివాదాన్ని మరింత జటిలంచేయటంతోఅక్కడ ఉన్న కాపునేతలు ముక్కున వేలేసుకున్నారు. 

మరిన్ని వార్తలు