పీడిస్తున్న జీడి కాలుష్యం

13 Jul, 2017 04:47 IST|Sakshi

జీడి పరిశ్రమ.. పలాస–కాశీబుగ్గ పట్టణంలో ప్రధాన ఆదాయ వనరు. ఈ పరిశ్రమలపైనే వేలాది మంది జీవనాధారం ఆధారపడి ఉంది. అదే సమయంలో కొందరు వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమల్లో రోస్టింగ్‌ విధానం అమలు చేస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. పరిశ్రమల నుంచి వస్తున్న విపరీతమైన పొగతో పలాస పట్టణ, పరిసర ప్రజలు శ్వాసకోస సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. మరోవైపు పలు హోటళ్లలో సైతం యథేచ్ఛగా జీడితొక్కను వంటచెరకుగా వినియోగిస్తూ కాలుష్యానికి కారకులవుతున్నారు. ఇంత జరుగుతున్నా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు గానీ, మున్సిపల్‌ సిబ్బంది గానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

కాశీబుగ్గ: పలాస పట్టణంలోని పలు జీడి పరిశ్రమలు, జీడి తొక్కను వంట చెరకుగా వినియోగించే హోటళ్లు కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. రోస్టింగ్‌ విధానాన్ని నిర్మూలించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోకుండా ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. చాపకింద నీరులా విజృంభిస్తున్న జీడి కాలుష్యం కారణంగా పలాస పట్టణంలోని మొగిలిపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో సుమారు 150 మంది విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పలువురు శ్వాసకోస సంబంధిత సమస్యలతో ఆస్పత్రులను ఆశ్రయించారు. పట్టణంలో గతంలో జనావాసాల్లో ఉన్న జీడి పరిశ్రమలు మూసివేశారు.

అయితే తెలుగుదేశం ప్రభుత్వం అండదండలతో కొన్ని జీడి పరిశ్రమలను తిరిగి తెరిచి గుట్టుచప్పుడు కాకుండా జీడి పిక్కల రోస్టింగ్‌ చేయిస్తున్నారు. ముఖ్యంగా బాయిలింగ్‌ కాకుండా రోస్టింగ్‌కు వ్యాపారులు ప్రాధాన్యమిస్తుండటంతో కాలుష్యంగా రోజురోజుకూ పెరిగిపోతోంది. పలాస మండల పరిధిలోని బ్రాహ్మణతర్లా, పూర్ణభద్ర, కేదారిపురం, దానగోర, సిరిపురం, హిమగిరి, లొత్తూరు, మహదేవుపురం, మర్రిపాడు, తాళభద్ర తదితర గ్రామాల్లో రోస్టింగ్‌ విధానాన్ని తిరిగి ప్రారంభించారు. దీనికి సంబంధించి కాలుష్య నివారణ అధికారులు చేతివాటాన్ని ప్రదర్శించడం, కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు అధికారులు వీరికి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

హోటళ్లలో జీడితొక్క వినియోగం
పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 100 హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, టిఫిన్‌ షాపులు, దాబాలు ఉన్నాయి. వీటిలో చాలాచోట్ల జీడి తొక్కనే వంటచెరకుగా వినియోగిస్తున్నారు. ఇక్కడి నుంచి విడుదలయ్యే పొగతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అధికారులకు పట్టదా..?
పలాస–కాశీబుగ్గ పట్టణంలో సుమారు 75 వేల మంది నివాసముంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది పట్టణానికి తరలివస్తుంటారు. వీరందరిపైనా కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినా కాలుష్య నివారణ కమిటీ గానీ, ఇటు మున్సిపల్‌ అధికారులు గానీ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పలాస, కాశీబుగ్గ, శాసనాం, పారిశ్రామికవాడ, సూదికొండ, తిలక్‌నగర్, రోటరీనగర్, శివాజీనగర్, ఎంపీడీఓ కార్యాలయం రోడ్డు, లేబరుకాలనీ, కేటీ రోడ్డు తదితర ప్రాంతాల్లో చాలా పరిశ్రమలు అనుమతి లేకుండా నడుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాలుష్యాన్ని అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు