ఆల్‌ ఇన్‌ వన్‌..! | Sakshi
Sakshi News home page

ఆల్‌ ఇన్‌ వన్‌..!

Published Thu, Jul 13 2017 4:47 AM

ఆల్‌ ఇన్‌ వన్‌..! - Sakshi

జిల్లాలో బీసీ గురుకులాల పరిస్థితి దయనీయం
అద్దెభవనాల్లోని ఇరుకు గదుల్లో విద్యార్థుల అవస్థలు
ఒకే తరగతి గదిలో రెండు సెక్షన్లు, అవే గదుల్లో వసతి
480 మందికి ఆరే తరగతి గదులు..
ఆరు పీరియడ్లు చెప్పాల్సిన టీచర్లు మూడింటికే పరిమితం
అతిథులుగానే వచ్చి వెళుతున్న ‘గెస్ట్‌ ఫ్యాకల్టీ’

నల్లగొండ : జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే వెనకబడిన తరగతుల గురుకులాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఈ విద్యాసంవత్సరం నుంచి బీసీ విద్యార్థులకు ప్రభుత్వం గురుకుల విద్యను ప్రవేశపెట్టింది. నియోజక వర్గానికి ఒకటి చొప్పున ఆరు బీసీ గురుకులాలను మంజూరు చేసింది. ఈ ఏడాది 5,6,7 తరగతులను ప్రారంభించారు.

ఒక్కో తరగతిలో రెండు సెక్షన్లు ఉన్నాయి. సెక్షన్‌కు 40 సీట్ల చొప్పున తరగతికి 80 సీట్లు కేటాయించారు. అత్యంత ఆర్భాటంగా ప్రారంభించిన బీసీ గురుకులాలకు ఆది నుంచి సమస్యలే ఎదురవుతున్నాయి. గురుకులాలు మంజూరు చేసిన నియోజకవర్గాల్లో అద్దెభవనాలు దొరక్క వాటిని నల్లగొండ, మిర్యాలగూడకు తరలించారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ నియోజకవర్గ గురుకులాలను మిర్యాలగూడలో ఏర్పాటు చేశారు. దేవరకొండ, మునుగోడు, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో భవనాల్లేక వాటిని నల్లగొండలో ఏర్పాటు చేయడం జరిగింది.

నల్లగొండ, మిర్యాలగూడలో కూడా అన్ని రకాల వసతులు కలిగిన భవనాలు లేనందున రెండేసి చొప్పున గురుకులాలను ఒకే భవనంలో సర్దుబాటు చేశారు. నల్లగొండ, దేవరకొండ గురుకులాలకు నల్లగొండలోని వైష్టవి భవన్‌లోనూ, మునుగోడు, నకిరేకల్‌ గురుకులాలు రెడ్డి హాస్టల్‌లో, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌ గురుకులాలను కలిపి మిర్యాలగూడెంలోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీ భవనంలో నిర్వహిస్తున్నారు. ఒకే అద్దె భవనంలో రెండేసి గురుకులాలు సర్దుబాటు చేసి వందలాది మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించడం వల్ల వాటిల్లో విద్యాబోధన అస్తవ్యస్తంగా మారింది.   

సీట్లు ఫుల్‌...
బీసీ గురుకులాల్లో చేరేందుకు విద్యార్థుల నుంచి పోటీ తీవ్రంగానే ఉంది. దీంతో మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే కేటాయించిన సీట్లన్నీ భర్తీ అయ్యా యి. వివిధ కారణాల దృష్ట్యా ఖాళీ అయిన సీట్లు కూడా వెంటనే భర్తీ చేస్తున్నారు. తరగతి 80 మంది విద్యార్థుల చొప్పున 5, 6,7 తరగతులకు కలిపి మొత్తం 240 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిం చారు. ఒక్కో తరగతిని ఏ,బీ రెండు సెక్షన్లుగా విభజించారు. ఒక్కో సెక్షన్‌లో 40 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులు ఉంటాయి. సబ్జెక్టు ఒక టీచర్‌ చొప్పున ఆరుగురు గెస్ట్‌ టీచర్లను నియమించారు. వీరితో పాటు ప్రిన్సిపల్, వార్డెన్‌ కూడా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో గురుకులాలను పరిశీలిస్తే మాత్రం అక్కడి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి.

ఉమ్మడి బోధన....
నల్లగొండ, దేవరకొండ గురుకులాలు రెండింటినీ కలిపి నల్లగొండలోని వైష్ణవి భవన్‌లో నిర్వహిస్తున్నారు. ఒక్కో గురుకులంలో 240 మంది విద్యార్థులు చొప్పున రెండు గురుకులాలు కలిపి 480 మంది విద్యార్థులకు ఒకే భవనంలో వసతి కల్పించారు. ఒక్కో తరగతికి రెండేసి చొప్పున సెక్షన్లు అంటే మొత్తం 12 తరగతి గదులు ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం ఆరు తరగతి గదులే ఉన్నాయి. మూడు గదుల్లో నల్లగొండ గురుకులం విద్యార్థులు, మరొక మూడు గదుల్లో దేవరకొండ విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారు. వేర్వేరు సెక్షన్లు చేసినప్పటికీ గదులు సరిపడా లేకపోవడంతో రెండు సెక్షన్లు కలిపి ఒకటే గదిలో కూర్చోబెట్టారు. పాఠాలు చెప్పే గెస్ట్‌ టీచర్లది కూడా ఇదే పరిస్థితి. ఆరు పీరియడ్లు  చెప్పాల్సిన టీచర్లు మూడు íపీరయడ్లలోనే ముగిస్తున్నారు. సెక్షన్లు వేరుగా లేనందున ఒకరి తర్వాత మరొకరు వెళ్లి పాఠాలు బోధిస్తున్నారు.

తరగతి గదిలోనే అన్నీ...
ఈ భవనంలో విద్యార్థులు ఉండేందుకు ప్రత్యేకంగా వసతి గదుల్లేవు. దీంతో తరగతి గదులనే వసతి గదులుగా వినియోగించుకుంటున్నారు. అవే గదుల్లో విద్యార్థుల ట్రంకుపెట్టెలు, దుస్తులు, స్నానపు బక్కెట్లు ఉంచారు. క్లాసులు ప్రారంభం కాగానే వాటిన్నింటినీ పక్కక పెట్టి బల్లల పైన కూర్చుంటారు. రాత్రివేళల్లో బేంచీలను పక్కకు జరిపి నేలపైనే పడుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి యూనిఫాం, బెడ్‌షీట్లు రాకపోవడంతో నేలపైనే పడుకుంటున్నారు. ఉతికిన దుస్తులు కూడా తరగతి గదుల కిటీకిల పైనే ఆరబెట్టుకున్నారు. తాగేందుకు మంచి నీటి వసతి కూడా లేక బయటి నుంచి కొనుగోలు చేస్తున్నారు. బోరు నీటిని ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు.

కోచింగ్‌ సెంటర్ల బాట పట్టిన ఫ్యాకల్టీ...
గురుకులాల్లో వసతులు సరిగా లేనందున నియమించిన గెస్ట్‌ టీచర్లు సైతం కోచింగ్‌ల బాట పడుతున్నారు. దేవరకొండ గురుకులంలో సైన్స్‌ టీచరు పోస్టు ఖాళీ ఉండగా...మరో గురుకులానికి చెందిన టీచరు విధులకు రావడం లేదు. దీంతో 12 మంది పనిచేయాల్సిన చోట పది మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం గురుకులం మెయిన్స్, టెట్‌ ప్రవేశ పరీక్షల కాలం. గురుకులాల్లో చేరిన చాలా మంది టీచర్లు కోచింగ్‌ సెంటర్ల బాట పడుతున్నారు. వారం, పది రోజులోకోసారి అతిథులుగా వచ్చి వెళుతున్న గెస్ట్‌ ఫ్యాకల్టీలు కూడా గురుకులాల్లో ఉన్నారు. గురుకులాల్లో వాతావరణం అధ్వానంగా ఉన్నందునే టీచర్లు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని అధికారులు అంటున్నారు.

వసతులు సరిగా లేవు
మా అబ్బాయి పేరు అక్షిత్‌ రెడ్డి. ఇక్కడి గురుకులంలో ఏడో తరగతిలో చేర్పించాను. దీంట్లో చేరిన రెండు రోజులకే ఆహారం పడక వాంతులు చేసుకున్నాడు. దీంతో ఇంటికి తీసుకెళ్లాను .ఇక్కడ వసతులు సరిగా లేవు. విద్యార్థులు భయపడి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. రెండు గురుకులాలు కలిపి ఒకటే చోట ఉన్నందున విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదుల్లోనే వందల మంది విద్యార్థులను పడుకోపెట్టడం వల్ల రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.
శ్రీనివాస్‌ రెడ్డి, చిట్యాల

ఏర్పాట్లు చేస్తున్నాం
రెండు గురుకులాలు ఒకే చోట ఉండటం వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ సరిచేస్తున్నాం. సొంత భవనాలు అయ్యేంత వరకు తాత్కాలికంగా గదులు నిర్మిస్తున్నాం. అవి పూర్తికాగానే వేర్వేరు సెక్షన్లు ఏర్పాటు చేస్తాం. యూనిఫాం, బెడ్‌షీట్లు రావాల్సి ఉంది. మంచినీరు బయట నుంచే తెప్పించుకుంటున్నాం. ఇక్కడ సరైన వసతులు లేకపోవడం వల్ల స్థానికంగా ఉండేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోంది.
డి. లక్ష్మయ్య, ప్రిన్సిపల్‌

Advertisement
Advertisement