కాన్పు కోసం వెళితే నరకం చూపారు

8 Sep, 2018 13:33 IST|Sakshi
మాట్లాడుతున్న హర్షిణి

బాలింత ఆరోపణ  

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, నాయుడుపేటటౌన్‌: కాన్పుకోసం వైద్యశాలకు వెళితే నరకం చూపించారని ఓ బాలింత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. పట్టణంలో ఎన్‌.హర్షిణి అనే మహిళ శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించింది. ఖమ్మం జిల్లా సారపాక గ్రామానికి చెందిన హర్షిణి భరత్తో కలిసి పట్టణంలోని రాజగోపాలపురం 3వ వీధిలో ఐదేళ్లుగా ఉంటోంది. రెండో కాన్పుకోసం స్థానిక పీవీఎస్‌ వైద్యశాలలో చేరింది. ఆగస్ట్‌ 3వ తేదీన ఆపరేషన్‌ చేయగా హర్షిణి మగశిశువుకు జన్మనిచ్చింది. ఐదురోజుల తర్వాత ఆమె ఇంటికి వచ్చింది. వారం తిరగకముందే హర్షిణికి తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యులు వైద్యశాలకు తీసుకెళ్లారు. ఈ సమయంలో డాక్టర్‌ రక్తస్రావం కాకుండా తెల్లటి గుడ్డపెట్టి కుట్లు వేసినట్లు హర్షిణి చెబుతోంది.

అయితే రక్తస్రావం ఆగకుండా ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో కార్పొరేట్‌ వైద్యశాలకు తీసుకువెళ్లాలని డాక్టర్‌ సూచించినట్లు తెలిపింది. దీంతో హర్షిణిని అంబులెన్స్‌లో 19వ తేదీన చెన్నైకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి రక్తస్రావం అవుతున్న చోట కుట్లు వేయడమే కాకుండా తెల్లగుడ్డ పెట్టి ఉన్నట్లు చెప్పారు. నాయుడుపేట వైద్యశాలలో డాక్టర్‌ నిర్లక్ష్యంగా ఆపరేషన్‌ చేయడంతో గర్భసంచి ఇన్ఫెక్షన్‌ అయిందని వారు చెప్పారని బాధితురాలు వాపోయింది. అక్కడ ఆపరేషన్‌ చేయించుకుని ఇంటికి వచ్చిన తర్వాత హర్షిణికి 26వ తేదీన అధికంగా రక్తస్రావం కావడంతో నెల్లూరులోని ప్రైవేట్‌ వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. వైద్యుల నిర్లక్ష్యంపై పోలీసులతోపాటు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలు తెలిపింది. కాగా దీనిపై పీవీఎస్‌ వైద్యశాలకు చెందిన డాక్టర్‌ వెంగయ్య మాట్లాడుతూ హర్షిణికి ఆపరేషన్‌ను సక్రమంగానే చేశామన్నారు. ఆమెకు యుటరెస్‌ సమస్య వల్ల అధిక రక్తస్రావమైందని వైద్యురాలి నిర్లక్ష్యం కాదని చెప్పారు.

మరిన్ని వార్తలు