17 నుంచి విద్యుత్ ఉద్యోగుల మెరుపు సమ్మె

15 Feb, 2014 03:33 IST|Sakshi

సమైక్యాంధ్ర ప్రకటించాలని ‘సేవ్’ జేఏసీ డిమాండ్
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17వ తేదీ నుంచి సీమాంధ్రలోని విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగనున్నారు. ఇందుకోసం జెన్‌కో, ట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఉద్యోగులు సిద్ధం కావాలని సమైక్యాంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల (సేవ్) జేఏసీ చైర్మన్ సాయిబాబు, కన్వీనరు శ్రీనివాసులు పిలుపునిచ్చారు. విద్యుత్ సౌధలో భోజన విరామ సమయంలో జరిగిన నిరసన కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు.
 
 తెలుగుజాతిని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ ఆరాటపడుతోందని విమర్శించారు. సమ్మెకు సిద్ధమయ్యేందుకు 15న విజయవాడలో జెన్‌కో ఉద్యోగుల జేఏసీ, 16న గుంటూరులో ట్రాన్స్‌కో, డిస్కంల ఉద్యోగుల జేఏసీ సమావేశం కానున్నట్టు తెలిసింది. అనంతరం యాజమాన్యాలకు సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు తెలిసింది. మరోవైపు 17వ తేదీ నుంచి తాము సమ్మెకు సిద్ధమని హైదరాబాద్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ (హైజాక్) చైర్మన్ నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్, కన్వీనర్ అనురాధలు ప్రకటించారు.
 
 భారీ విద్యుత్ లైన్లే లక్ష్యం...!
 రాష్ట్రాన్ని అంధకారంగా మార్చడం ద్వారా తమ సత్తా చూపాలని సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు భావిస్తున్నట్టు సమాచారం. భారీ విద్యుత్ లైన్లను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ సరఫరా నిలిపివేయాలని భావిస్త్తున్నట్టు తెలిసింది. 400, 132, 33 కేవీ లైన్లపై దృష్టిసారించి విద్యుత్ సరఫరాను ఒకేసారి నిలిపివేయాలని భావిస్తున్నారు. జెన్‌కో ప్లాంట్లలోనూ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని యోచిస్తున్నారు. పగటి పూట మాత్రమే విద్యుత్‌ను నిలిపివేయడం కాకుండా పూర్తిస్థాయిలో సరఫరా ఆపాలని భావిస్తున్నారు.
 
 వేతన సవరణ కమిటీ ఏర్పాటు
 సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులందరికీ ఒకే వేతన సవరణ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ మేరకు ట్రాన్స్‌కో సీఎండీ సురేష్ చందా శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. మార్చి 31 నాటికి కమిటీ నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కాంట్రాక్టు సిబ్బంది వేతన సవరణపై కూడా మరో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ జూలై 31 నాటికి నివేదిక ఇవ్వనుంది. వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేసినందుకు యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ సుధాకరరావు, చైర్మన్ సీతారామరెడ్డి, కో-చైర్మన్ మోహన్‌రెడ్డి, విద్యుత్ సౌధ జేఏసీ కన్వీనర్ కళ్లెం శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. 

మరిన్ని వార్తలు