వైభవంగా స్వర్ణముఖి పుష్కరం | Sakshi
Sakshi News home page

వైభవంగా స్వర్ణముఖి పుష్కరం

Published Sat, Feb 15 2014 3:34 AM

Exposition at a Pushkaram

శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో స్వర్ణముఖినది పుష్కరం శుక్రవారం కన్నుల పండువగా సాగింది. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు. అయితే స్వర్ణముఖినదికి ప్రతిఏటా పుష్కరం నిర్వహించడం ఆనవాయితీ. ఈ పుష్కరాన్ని ఏటి ఉత్సవం, త్రిశూలస్నానం అని కూడా అంటారు. పుష్కరం సందర్భంగా శుక్రవారం శాస్త్రోక్తంగా సద్యోముక్తి వ్రతం, చక్రస్నానం, త్రిశూల స్నానం పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

పంచమూర్తులకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరిగాయి. స్వామి, అమ్మవారు, వినాయకస్వామి, సుబ్రమణ్యంస్వామి, చండికేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు స్వర్ణముఖినదిలో ఘనంగా పుష్కర పూజలు నిర్వహించారు. పూజల కోసం నదిలో ప్రత్యేకంగా తవ్వించిన గుంత వద్ద వేదపండితులు పంచమూర్తులకు శాస్త్రోక్తంగా సద్యోముక్తి వ్రతం చేశారు. ప్రత్యేక పూజలు అనంతరం చక్రాలకు, త్రిశూలానికి నదిలో స్నానం చేయించారు. మాఘస్నానం నది పుష్కర విశేషాలను భక్తులకు అర్చకులు వివరించారు.

ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు నదిలో పవిత్ర పుణ్యస్నానాలు చేశారు. అనంతరం పట్టణంలో ఉత్సవమూర్తుల ఊరేగింపు జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వరాలయ ట్రస్ట్‌బోర్డు మాజీ చైర్మన్ శాంతారామ్‌జేపవార్, ఇన్‌చార్జి ఈవో పూర్ణచంద్రరావు, ఈఈ రామిరెడ్డి, పర్యవేక్షకుడు శ్రీనివాసులురెడ్డి, ఆలయాధికారులు హరిబాబుయాదవ్, సుదర్శన్‌నాయుడు, వెంకటేశ్వరరాజు, మణి, సాయి, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
 
వెండి వాహనాలపై ఊరేగింపు

 స్వర్ణముఖినదిలో పంచమూర్తులకు సద్యోముక్తి వ్రతాన్ని నిర్వహించిన తర్వాత   పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. స్వామివారు నందివాహనం, అమ్మవారు సింహవాహనం, సుబ్రమణ్య స్వామి నెమలి వాహనం, వినాయకుడు మూషిక వాహనంపై ఊరేగారు.
 
మురుగునీటితో తప్పని అవస్థలు

 నదిలో పుష్కర పూజల కోసం ప్రత్యేకంగా తవ్వించిన గుంత సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో భక్తులకు అవస్థలు తప్పలేదు. అధికారుల తీరుపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పూజలు జరుగుతున్న చోటే నదిలో కొందరు బట్టలు ఉతుకుతుండడం కనిపించింది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement