సామాన్య భక్తులకే ప్రాధాన్యం

15 Apr, 2018 00:58 IST|Sakshi

సాక్షి, తిరుమల: వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా సర్వదర్శనం క్యూ ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునే సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీల సిఫారసు టికెట్లను కుదించి ప్రొటోకాల్‌ ప్రముఖులకే కేటాయించనున్నారు. ఇంటర్నెట్‌లో జారీ చేసే రూ.300 టికెట్లు, గదులు తగ్గించి తిరుమలకు చేరుకున్న భక్తులకు ప్రాధాన్యం ఇవ్వ నున్నారు.

వేసవిలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు కావటంతో ఏప్రిల్‌ మూడోవారం నుంచి జూన్‌ మూడోవారం వరకు శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈసారీ భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు అంచనా వేసి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వీఐపీ టికెట్ల జారీలో ఎల్‌ 1 (హారతి, తీర్థం, శఠారి), ఎల్‌ 2 (హారతి) దర్శనాలు అమలు చేసి ఎల్‌ 3 రద్దు చేయనున్నారు. ఆన్‌లైన్‌ టికెట్లు, గదుల బుకింగ్‌ తగ్గింపు  

శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇంటర్నెట్‌ ద్వారా కేటా యించే రూ.300 టికెట్లను సుమారు 10 నుంచి 12 వేలకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌లో గదుల కోటాను 2 వేల నుంచి సుమారు వెయ్యికి తగ్గించనున్నారు. భక్తుల రద్దీని బట్టి అవసరం మేరకు కోటాను విడుదల చేయనున్నారు.   అలాగే రూ.50 ధరతో అదనంగా పొందేందుకు రోజుకు కనీసం 50 వేల నుంచి లక్ష వరకు లడ్డూలు అందుబాటులో ఉంచే చర్యలు చేపట్టారు.

సామాన్య భక్తులకు ఇబ్బందులు రానివ్వం
వేసవి సెలవుల్లో తిరుమలకు పోటెత్తే భక్తులకు అనుగుణంగా బస, స్వామి దర్శనంతోపాటు ఇతర ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే ఆయా విభాగాలు ముందస్తు చర్యలు తీసుకున్నాయి. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనంలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేస్తాం.   – జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు  

భక్తులకు అల్పాహారంలో కొబ్బరిచట్నీ
తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి భక్తులకు శనివారం ఉప్మా, పొంగలి, వర్మీసెల్లీ ఉప్మాతోపాటు కొబ్బరిచట్నీ వితరణ చేశారు. జేఈవో కేఎస్‌ శ్రీనివాసరాజు రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు వీటిని పంపిణీ చేశారు. ఇకపై నిత్యం 5 వేల ప్రసాదాల చొప్పున పంపిణీ చేయాలని అన్నప్రసాదం విభాగం ప్రత్యేకాధికారి వేణుగోపాల్, జీవీఎల్‌ఎన్‌ శాస్త్రిని ఆదేశించారు.

మరిన్ని వార్తలు