టీసీ కావాలంటే అ'ధనం' ఇవ్వాల్సిందే..!

20 Jun, 2019 10:08 IST|Sakshi

రూ.1000 ఇవ్వాలంటున్న ప్రైవేటు యాజమాన్యాలు

ప్రదక్షిణలు చేస్తున్న తల్లిదండ్రులు

సాక్షి, చీరాల (ప్రకాశం): ‘మా పిల్లలను వేరే పాఠశాలలో చేర్పిస్తున్నాము టీసీ కావాలంటూ ఓ విద్యార్థి తండ్రి ప్రైవేటు పాఠశాలకు వెళ్ళాడు. టీసీ ఎందుకు..? మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తాము. టీసీ కావాలి’ అని అడిగాడు. టీసీ కావాలంటే అ‘ధనం’ ఇవ్వాలంటూ ఆ స్కూల్‌ యాజమాన్యం బదులిచ్చింది. ఫీజు బకాయిలు చెల్లించాము గదా, అదనపు డబ్బులు ఎందుకు అని ప్రశ్నించినా సమాధానం లేదు. టీసీ ఇవ్వాలంటే రూ.1000లు ఇవ్వాలంటూ ఆ స్కూల్‌ యాజమాన్యం బదులిచ్చింది. అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో తిప్పించుకుంటున్నారు. ఇదే సంఘటనలు చీరాల మండలంలో కనిపిస్తున్నాయి. టీసీలు కావాలని అడుగుతున్నా ప్రైవేటు యాజమాన్యాలు ఇవ్వడం లేదు. మండలంలోని పలు ప్రైవేటు పాఠశాలలు ఇదే విధంగా వ్యవహరిస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు.

ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలున్నాయి. అలానే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు. రాజన్న బడిబాట, అమ్మ ఒడి పథకం వంటివి నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపిస్తే రూ.15వేలు తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. ప్రైవేటు పాఠశాలలు ఈ విధంగా టీసీలు ఇవ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రులను ప్రదక్షిణలు చేయిస్తున్నాయి. వెయ్యి రూపాయలు ఇస్తేనే టీసీ ఇస్తామని అంటున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ సంఘటనలపై విద్యాశాఖాధికారులు కూడా స్పందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు