కట్టుదిట్టంగా జీవీఎంసీ ఎన్నికలు: కలెక్టర్‌ 

10 Mar, 2020 12:27 IST|Sakshi

రేపటి నుంచి జీవీఎంసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

 1712 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు

సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ ఎన్నికలను పారదర్శకంగా, కట్టుదిట్టంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని విశాఖ కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 13 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందన్నారు. 14న నామినేషన్ల పరిశీలన.. 16వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకి గడువు ఉంటుందని వెల్లడించారు. ఈ నెల 23న పోలింగ్‌..27న కౌంటింగ్‌ జరుపుతామని పేర్కొన్నారు. జీవీఎంసీ ఎన్నికలకు మొత్తం 1712 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ నిర్వహణకి 2200 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశామని చెప్పారు. (ఏపీలో మోగిన పుర భేరీ)

10,600 మంది పోలింగ్ సిబ్బంది
గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఎన్నికలకి 10,600 మందిని పోలింగ్ సిబ్బందిని నియమించామన్నారు. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించామన్నారు. ప్రిసైడింగ్ అధికారులకి సైతం ఎన్నికల నిర్వహణపై మూడు రౌండ్ల శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థుల తుది జాబితాకు అనుగుణంగా పూర్తి పోలీస్ రక్షణ మధ్య బ్యాలెట్ పేపర్ల ముద్రణ చేపడుతున్నామన్నారు. జీవీఎంసీ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,52,927... కాగా, 8,80,481 పురుషు ఓటర్లు, 8,73,320 మహిళా ఓటర్లు ఉన్నారని కలెక్టర్‌ వివరించారు. (ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్‌ల నియామకం)


కట్టుదిట్టమైన చర్యలు
ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు విశాఖ కమిషనర్‌ ఆర్‌కే మీనా, డిసీపీ రంగారెడ్డి తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు.  పోలీస్, రెవెన్యుతో జాయింట్ తనిఖీ బృందాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. నూతన చట్టం ప్రకారం డబ్బు,మద్యం పంపిణీ చేస్తే ఎన్నికైనా తర్వాతైనా అనర్హత వేటు పడుతుందని స్పష్టం చేశారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్‌ షీట్‌ ఉన్నవారిని బైండోవర్‌ చేయబోతున్నామని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు