ప్రొద్దుటూరులో రక్త దోపిడీ

30 May, 2014 01:31 IST|Sakshi

ప్రొద్దుటూరు క్రైం, న్యూస్‌లైన్ : ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు రోగులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. రోగులకు రక్తం ఎక్కించాల్సి పరిస్థితి వస్తే ముప్పుతిప్పలు పెడుతున్నాయి. పెద్దమొత్తంలో డబ్బు చెల్లించే స్తోమత తమకు లేదని, ప్రభుత్వాసుపత్రికి వెళ్తామని రోగులు చెబుతున్నా అక్కడ ఉన్న రక్తం సురక్షితం కాదంటూ పలు నర్సింగ్‌హోంలకు చెందిన సిబ్బంది రోగులను మభ్యపెడుతున్నారు.
 
 తప్పనిసరి పరిస్థితుల్లో రోగులు రూ.2000-2500 చెల్లించి ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే రక్తం ఎక్కించుకుంటున్నారు. ప్రొద్దుటూరులో 350 పడకల జిల్లా ఆస్పత్రి ఉంది. దానికి అనుబంధంగా బ్లడ్‌బ్యాంక్ నడుస్తోంది. దాతలు, స్వచ్ఛంద సేవాసంస్థల సహకారంతో రక్తం సేకరిస్తూ  నిల్వ చేస్తున్నారు. రోడ్డు ప్రమాద బాధితులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న గర్భిణిలకు రక్తాన్ని ఎక్కిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోని రోగులకు బ్లడ్‌బ్యాంక్‌లో ఉన్న రక్తం ఇవ్వాలంటే రూ.850 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడు నుంచి లెటర్ తీసుకొని రావాలి.
 
 రోగులను భయపెడుతున్న యాజమాన్యాలు
 రోగులు ఇక్కడే రక్తం ఎక్కించుకోవాలని కొన్ని నర్సింగ్ హోం ల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌లో ఉండే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉంటుందని డాక్టర్‌లు రోగులకు చెప్పడంతో వారు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే రక్తం ఎక్కించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. డాక్టర్ లెటర్ ఆధారంగా బ్లడ్‌బ్యాంక్ నుంచి రక్తం తీసుకొని రావాలంటే కేవలం రూ.850 మాత్రమే ఖర్చు అవుతుంది. అయితే నర్సింగ్‌హోంలలో మాత్రం రక్తపరీక్షల కోసమని రూ.2000-2500 దాకా వసూలు చేస్తున్నట్లు రోగుల బంధువు లు అంటున్నారు. ఎవరైనా రక్తమివ్వాలంటే ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్‌లకు వచ్చి రక్తం ఇవ్వాలి. రక్తం నిల్వ చేసే బ్యాగులను కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. వీటిని బయట మార్కెట్‌లో ఎక్కడా విక్రయించరాదు. అయితే ప్రొద్దుటూరులో మాత్రం పలు హోల్‌సేల్ దుకాణాలలో, మందుల షాపుల్లో విచ్చల విడిగా విక్రయిస్తున్నారు. అధికారులకు  తెలిసి కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.  
 
 రక్త పరీక్షల్లోనూ చాలా వ్యత్యాసం
 సాధారణంగా రక్తం ఇచ్చే వ్యక్తికి జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌లో హెచ్‌ఐవీ, హెపటైటిస్ బీ, హెపటైటీస్ సీ, వీడీఆర్‌ఎల్, మలేరియా లాంటి ఐదు రకాల పరీక్షలను నిర్వహిస్తారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాత్రం కేవలం హెచ్‌ఐవీ, హెపటైటిస్ బీ పరీక్షలను మాత్రమే  నిర్వహిస్తారు.
 
 రక్తం సేకరించడం నేరం
 జిల్లా ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్‌లో నిల్వ ఉన్న రక్తం చాలా సురక్షితమైంది. ఒకసారి దాత నుంచి రక్తం సేకరించాక అది 45 రోజుల వరకూ సురక్షితంగా ఉంటుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రక్తం సేకరించడం నేరం. రక్తం నిల్వ చేసే బ్యాగులను బయట విక్రయించరాదు.
 - డాక్టర్ విజయనిర్మల, బ్లడ్‌బ్యాంక్ వైద్యురాలు
 

మరిన్ని వార్తలు