జయంతి వేడుకలకు పక్కా ఏర్పాట్లు

23 Mar, 2016 04:57 IST|Sakshi
జయంతి వేడుకలకు పక్కా ఏర్పాట్లు

జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ జయంతి పై కలెక్టర్ ఏర్పాట్లు చేయాలని ఆదేశం
 
కర్నూలు(అగ్రికల్చర్): మహనీయుల జయంతి వేడుకలను పండుగలా నిర్వహించాలని, ఇందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. బాబు జగ్జీవన్‌రామ్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సహకరించాలని దళిత సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్, 14న అంబేడ్కర్ జయంతి నేపథ్యంలో వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ .. కాన్పరెన్స్ హాల్‌లో దళిత, యువజన, ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. మహనీయల జయంతి ఉత్సవాలకు అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానించాలన్నారు. ఇందు కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సాంఘిక సంక్షేమశాఖ డీడీని ఆదేశించారు. 8,9,10 తరగతుల విద్యార్థులకు జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్ జీవిత చరిత్రపై వ్యాసరచన, వక్తృత్వపోటీలు నిర్వహించాలన్నారు.

ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్‌లో పరిష్కరించిన అంశాలపై విజయగాథలను సభకు తీసుకరావాలన్నారు. ప్రతి నాయకుడు కనీసం 5 మంది కార్యకర్తలను సమావేశానికి తీసుకరావాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ర్యాలీ నిర్వహించడం లేదని చెప్పిన కలెక్టర్.. సభను ఉదయం 9గంటలకే ప్రారంభిస్తామన్నారు. 8.45కే అందరూ సభ నిర్వహించే 5 రోడ్ల కూడలికి చేరకోవాలన్నారు.   12 గంటలకు ఉపన్యాసాలు ముగించిన తర్వాత బహుమతుల ప్రదానం ఉంటుందన్నారు. జేసీ, జేసీ-2 తో సమావేశమై జయంతి వేడుకల ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. వేదికపై ఎవరెవరు కూర్చోవాలో నిర్ణయించాలని, ఈ విషయంలో గత ఏడాది చోటుచేసుకున్న పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు.

బాబు జగ్జీవన్‌రామ్, అంబేద్కర్ దళితుల అభున్నతికి చేసిన కృషిని సమాజానికి తెలిసే విధంగా ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ఆహ్వాన పత్రికలు, కరపత్రాలు తదితరవాటిని ముద్రణలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జయంతి వేడుకలను నిర్వహ ణలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ సందర్భంగా పలువురు దళిత నేతలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఒక్కో అసోసియేషన్ నుంచి ఒకరిని మాత్రమే వేదిక పైకి పిలవాలన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ సభ్యుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టంచేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ హరికిరణ్, జేసీ-2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ ప్రసాద్‌రావు, ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, దళిత, ఉద్యోగ విద్యార్థి సంఘాల నేతలు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు