ఏసుపై విశ్వాసముంటే పాపాల నుంచి రక్షణ

15 Sep, 2013 02:02 IST|Sakshi
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : ‘ఏసునందు విశ్వాసం ఉంచిన వారు పాపాల నుంచి రక్షించబడతార’ని అంతర్జాతీయ సువార్తీకులు బ్రదర్ అనిల్‌కుమార్ దైవ సందేశాన్నిచ్చారు. అమలాపురం మన్నా సిల్వర్ జూబ్లీ చర్చి 47వ వార్షిక ఏసుక్రీస్తు మహోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఆయన  క్రైస్తవ సోదరులను ఉద్దేశించి ప్రసంగించారు. మన్నా మినిస్ట్రీస్ అధినేత కార్ల్‌డేవిడ్ కొమనాపల్లి (లాల్), షారోన్‌ల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు కోనసీమలోని  క్రైస్తవమతవిశ్వాసులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సుమారు రెండు గంటలసేపు బ్రదర్ అనిల్ ఉపదేశాన్ని మంత్రముగ్ధులై ఆలకించారు.  ‘క్రీస్తు పాపుల కొరకై చనిపోయారు.. నా కొరకు, నీ కొరకు మాత్రమే ఆయన ప్రాణాలర్పించారు.
 
లోకరక్షకునిగా ఆయన ఎప్పుడూ జీవాత్మలో జీవించి ఉంటారు‘ అని బ్రదర్ అనిల్‌కుమార్ అన్నారు. ధర్మశాస్త్రంలో మరణకారణమగు పరిచర్య రాళ్లపై చెక్కి ఉంటుందన్నారు. అయితే ఈ అక్షరాలు ఆత్మసంబంధమైన పరిచర్య ముందు ఎంతో పవిత్రమైనవన్నారు. ప్రభువు మొత్తం లోకరక్షకునిగానే కాకుండా ప్రతీ మనిషి రక్షణ బాధ్యతలను భుజాన వేసుకుంటారన్నారు.  ప్రపంచంలో అత్యంత శక్తి వంతమైన దేవుడు ఏసు ప్రభువు ఒక్కడేనని, ఈ ఏసు నందు ప్రతీ ఒక్కరూ రక్షించబడతారన్నారు. సువార్త అంటే మంచి శుభకరమైన వార్త అని,
 
ఏసుక్రీస్తు పాపుల కోసం ఏమి చేశారో అదే మంచి సువార్త అని బ్రదర్ అనిల్ చెప్పారు. సర్వశక్తువంతుడైన ఏసును నమ్మిన ప్రతీ ఒక్కరూ పరిశుద్ధాత్మను పొంద గలరన్నారు. బ్రదర్ అనిల్ ఆంగ్లోపన్యాసాన్ని సువార్త రాజు తెలుగులోకి అనువదించారు. భీమవరం మన్నా చర్చి పాస్టర్ రెవరెండ్ ఎం. దేవదాస్ కూడా ప్రసంగించారు. మన్నా మినిస్ట్రీస్ అధినేత కార్ల్ డేవిడ్ కొమానపల్లి మాట్లాడుతూ ఏసుక్రీస్తు పాపులను రక్షించే దైవదూత అన్నారు. మహోత్సవాల్లో గాయనీగాయకులు ప్రత్యేక గీతాలు ఆలపించారు. బ్రదర్ అనిల్  రోగుల స్వస్థత కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 
 
నేడు బ్రదర్ అనిల్ ప్రసంగాలు  
మన్నా సిల్వర్ జూబ్లీ చర్చిలో ఆదివారం కూడా అంతర్జాతీయ సువార్తీకులు బ్రదర్ అనిల్‌కుమార్ ప్రసంగాలు ఉంటాయని కార్ల్ డేవిడ్ కొమానపల్లి తెలిపారు. కోనసీమ వ్యాప్తంగా క్రైస్తవులు రెండవ రోజు కూడా ఆయన దైవసందేశాన్ని విని ఆత్మ పరిశుద్ధం చేసుకోవాలని కోరారు. ఈనెల 11న ప్రారంభమైన ఈ మహోత్సవాలు ఆదివారంతో ముగుస్తాయన్నారు.
 
నేడు క్రైస్తవులచే మానవహారం  
అమలాపురం మన్నా జూబ్లి చర్చి ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక నల్లవంతెన వద్ద చర్చి సభ్యులందరూ ఆదివారం మధ్యాహ్నం 12.30గంటలకు మానవహారంగా ఏర్పడి సంఘీభావం తెలియజేస్తున్నట్టు చర్చి అధినేత కార్ల్ డేవిడ్ కొమానపల్లి తెలిపారు.
 
మరిన్ని వార్తలు