సీబీఐ కేసును కొట్టివేయండి: రత్నప్రభ

23 Nov, 2013 04:45 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ హైకోర్టును ఆశ్రయించారు.  క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించకుండా సీబీఐ తన పరిధిని దాటి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని అభ్యర్థిస్తూ ఆమె శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఇందూ టెక్ జోన్ కంపెనీకి తాను అనుచిత లబ్ధి చేకూర్చాననే ఆరోపణలతో సీబీఐ తనను నిందితురాలిగా పేర్కొందని, ఇది ఎంతమాత్రం సరికాదని నివేదించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్నామని, వాటిని అమలుచేయడం తన బాధ్యతని పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలో ఇతర ఉన్నతాధికారులను విడిచిపెట్టి తనను మాత్రమే నిందితురాలిగా పేర్కొందని, దీనివెనుక దురుద్దేశాలు ఉన్నట్లు అర్థమవుతోందని ఆ పిటిషన్‌లో రత్నప్రభ నివేదించారు.

మరిన్ని వార్తలు