నిత్యావసరాల రవాణాలో రైల్వేదే అగ్రస్థానం

30 Mar, 2020 04:57 IST|Sakshi

దేశవ్యాప్తంగా లక్షన్నర వ్యాగన్ల  రవాణా

270 గూడ్స్‌ రైళ్లను నడిపి రికార్డు సాధించిన దక్షిణ మధ్య రైల్వే

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలకు నిత్యావసరాల ఇబ్బందులు తలెత్తకుండా రైల్వేశాఖ తగిన చర్యలు తీసుకుంటోంది. ప్యాసింజర్‌ రైళ్లు రద్దు చేసినప్పటి నుంచి నిత్యావసర సరుకుల రవాణా కోసం ప్రత్యేకంగా గూడ్స్‌ రైళ్లను తిప్పుతోంది. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ నిత్యావసరాల కొరత రాకుండా చూస్తోంది. గత ఐదు రోజుల్లో దేశ వ్యాప్తంగా లక్షన్నర వ్యాగన్ల నిత్యావసరాలు రవాణా చేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఇందులో బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలు, ఉల్లి, పండ్లు, కూరగాయలు, పాలు, వంట నూనె తదితర నిత్యావసరాలున్నాయి. వీటితో పాటు థర్మల్‌ పవర్‌ ప్లాంట్లకు బొగ్గు, వ్యవసాయ రంగానికి ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తులు మొదలైనవి రవాణా చేస్తోంది. కరోనాను జాతీయ విపత్తుగా భావించి సరుకు రవాణాలో డెమరేజ్, వార్‌ఫేజ్‌ ఛార్జీలను ఎత్తేసింది. అవసరాన్ని బట్టి మరిన్ని రాయితీలు కల్పిస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు. 

- ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేసినప్పటినుంచి దక్షిణ మధ్య రైల్వే అదనంగా 270 గూడ్స్‌ రైళ్లను నడిపి రికార్డు సాధించింది. 
- ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య పట్టణాల్లో ఉన్న ఎఫ్‌సీఐ గోడౌన్లకు రోజుకు సగటున 1.80 మిలియన్‌ టన్నుల చొప్పున నిత్యావసర సరుకులు సరఫరా చేస్తోంది.  
- ఒక్కో వ్యాగన్‌కు 60 టన్నుల వరకు సరుకును చేరవేసే సామర్థ్యం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు.
- రేణిగుంట నుంచి వ్యాగన్‌ ద్వారా ఢిల్లీకి పాలు సరఫరా చేసి అక్కడి ప్రజల అవసరాలు తీర్చింది. 
- రైల్వే ఉద్యోగులకు రొటేషన్‌ పద్ధతిలో ఎమర్జెన్సీ డ్యూటీల కింద సరుకు రవాణా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. 
- లాక్‌ డౌన్‌ ఎత్తేసేవరకు గూడ్స్‌ రవాణాలో అదనపు ఛార్జీలు (డెమరేజ్, వార్‌ఫేజ్‌ ) విధించకూడదని రైల్వేశాఖ నిర్ణయించింది. 
- కంటైనర్‌ టారిఫ్‌లో కూడా స్టేకింగ్, డిటెన్షన్‌ వంటి ఛార్జీలు విధించడం లేదు. 

మరిన్ని వార్తలు