నేడు, రేపు భారీ వర్ష సూచన

11 May, 2018 07:29 IST|Sakshi

సాక్షి, అమరావతి/విశాఖసిటీ : ఒడిషా చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏర్పడిన ద్రోణి ప్రభావం ఉత్తర కోస్తాపై పడనుంది. ఈ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో మెరుపులు, ఉరుములు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది.

శుక్ర, శనివారాల్లో ఉత్తరకోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అటు రాయలసీమలోనూ పలు ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి. దీంతో పాటు కొన్నిచోట్ల ఈదురుగాలులు ప్రభావంతో పాటు పిడుగులు పడే ప్రమాదముందని హెచ్చరించింది. అకాల వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

మరిన్ని వార్తలు