జాడలేని చినుకు కమ్ముకొస్తున్న కరువు

3 Aug, 2018 03:24 IST|Sakshi

ఖరీఫ్‌లో అడుగంటుతున్న రైతుల ఆశలు

దారుణంగా పడిపోయిన సాగు విస్తీర్ణం బీళ్లుగా మారుతున్న పొలాలు

తడిలేక ఎండిపోతున్న పంటలు

ఆరు జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వర్షపాతం లోటు

అత్యధికంగా వైఎస్సార్‌ జిల్లాలో 60 శాతానికిపైగా వర్షపాతం లోటు

ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని శాస్త్రవేత్తల సూచన

కడప నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మళ్లీ కరువు మేఘాలు కమ్ముకున్నాయి. గత ఏడాది ఖరీఫ్‌లో దుర్భిక్షంతో పంటలు పోగొట్టుకుని అప్పుల పాలైన అన్నదాతలు ఈ ఏడాది ఖరీఫ్‌లో పరిస్థితి బాగుంటుందని, పంటలు పండించుకుని నాలుగు రూకలు కళ్లజూద్దామని ఆశపడ్డారు. చినుకు జాడ లేకపోవడంతో అవన్నీ అడియాశలవుతున్నాయి.

వర్షాల్లేక సాగు విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. పచ్చని పంటలతో కళకళలాడాల్సిన పొలాలన్నీ బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. అరకొరగా అక్కడక్కడా విత్తిన పంటలు కూడా తడిలేక వాడిపోతున్నాయి. తమ బతుకులు బాగుపడేదెలా దేవుడా! అనుకుంటూ వరుణుడి కరుణ కోసం రైతన్నలు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బీడు భూములు దుర్భిక్షానికి అద్దం పడుతున్నాయి.

ఏడు జిల్లాల్లో తీవ్ర కరువు
రాయలసీమతోపాటు మొత్తం ఏడు జిల్లాల్లో దుర్భర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వర్షపాతం గణాంకాలే ఇందుకు నిదర్శనం. వైఎస్సార్‌ జిల్లాలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. జూన్‌ ఒకటో తేదీతో ఆరంభమైన ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటి వరకూ చిత్తూరు, అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో 20 నుంచి 59 శాతం వర్షపాతం లోటు నమోదైంది. వైఎస్సార్‌ జిల్లాలో 60 శాతానికిపైగా వర్షపాతం లోటు ఉంది. ఖరీఫ్‌ సీజన్‌ ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయింది. వేరుశనగ విత్తనం వేసే సీజన్‌ కూడా దాటిపోయింది. ఈ ఖరీఫ్‌లో 23.07 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా, ఆగస్టు రెండో తేదీ నాటికి 9.6 లక్షల ఎకరాల్లోనే విత్తనం పడింది.  

విత్తనాలు ఆమ్ముకుంటున్న రైతులు
వేరుశనగ విత్తడం కోసం రైతులు విత్తనకాయలు కొనుగోలు చేసిన వాటిని వలిచి విత్తనాలను సిద్ధం చేసుకున్నారు. సీజన్‌ దాటినా వర్షం జాడ లేకపోవడంతో వేరుశనగ పప్పును కిరాణా వ్యాపారులకు అమ్మేస్తున్నారు. ఇక వర్షం పడినా వేరుశనగ సాగుకు అనుకూలం కాదని, సీజన్‌ దాటిపోయినందున ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడమే ఉత్తమమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అధిక ధరలకు విత్తనకాయలు కొని చౌకగా పప్పులు అమ్ముకోవాల్సి రావడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.  

వర్షపాతం లోటు
రాష్ట్రంలో జూన్, జూలై నెలల్లో 247.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది ఈ నెలల్లో  215.5 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. 2016లో ఇదే కాలంలో 283.2 మిల్లీమీటర్లు, 2017లో 239.9 మిల్లీమీటర్ల వర్షం కురవగా, ఈఏడాది ఇంకా తక్కువ కురిసింది. జూన్‌లో ఒక శాతం లోటు నమోదైన వర్షపాతం జూలైలో ఏకంగా 20 శాతానికి చేరింది.  

అన్నదాతకు దెబ్బమీద దెబ్బ
రాష్ట్రంలో వరుస కరువులు అన్నదాతలను అప్పుల్లోకి నెట్టేస్తున్నాయి. 2016, 2017లో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. 2017లో ఖరీఫ్‌లో ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించకుండా రైతులకు తీరని అన్యాయం చేసింది. 2016లో అతి తక్కువ మండలాలను కరువు జాబితాలో చేర్చి మోసం చేసింది.

ఎండుతున్న పంటలు
రాయలసీమ జిల్లాల్లో చినుకు లేకపోవడంతో నామమాత్రంగా సాగైన పంటలు కూడా వాడిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో వేరుశనగ, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పత్తి మొక్కలు వాడిపోయాయి. జొన్న, పెసర తదితర పంటలు కూడా ఎండిపోతున్నాయి. చాలామంది రైతులు పొలాలను దున్ని పదును లేక విత్తనాలు వేయకుండా వదిలేశారు. రాయలసీమ జిల్లాల్లో వర్షాభావం వల్ల భూగర్భ జలమట్టం పాతాళంలోకి పడిపోయింది. బోర్లలో నీరు లేక పండ్ల తోటలు సైతం దెబ్బతినే పరిస్థితి కనిపిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.  

విత్తనాలు అమ్ముకుంటున్నాం
‘‘వాన కోసం రెండు నెలలుగా ఎదురు చూశాం. కానీ, ఇప్పటికి బలమైన పదును వానలు కురవలేదు. వేరుశనగ సాగు చేయడానికి సిద్ధమైనా వానలు కురవలేదు. ఇక సాగు చేయలేని పరిస్థితి నెలకొనడంతో విత్తనాలలు అమ్ముకుంటున్నాం. గతంలో విత్తనం వేయలేని దుర్భరస్థితి ఎప్పుడు రాలేదు’’   – నాగసుబ్బయ్య, రైతు, కత్తులూరు, వేంపల్లె మండలం, వైఎస్సార్‌ జిల్లా

నేడు ఉన్నతస్థాయి సమీక్ష
ఏడు జిల్లాల్లో ఖరీఫ్‌లో తీవ్ర దుర్భిక్షం నేపథ్యంలో ముఖ్యమైన పంటలు సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించేందుకు ఏడు జిల్లాల వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు, ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలతో వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మురళీధర్‌రెడ్డి శుక్రవారం కడపలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.

పడిపోయిన సాగు విస్తీర్ణం
అధికారిక గణాంకాల ప్రకారం చూసినా 2016తో పోల్చితే ఈ సంవత్సరం ఖరీఫ్‌ సాగు భారీగా పడిపోయింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 2016 జూన్, జూలై నెలల్లో 13,93,933 హెక్టార్లలో పంటలు సాగు కాగా, ఈ సంవత్సరం ఇదే కాలంలో సాగు 8,04,844 హెక్టార్లకు పడిపోయింది. 2016తో పోల్చితే 2018లో 5.89 లక్షల హెక్టార్లలో పంట సాగు పడిపోవడం కరువు తీవ్రతను చాటుతోంది. గత ఏడాదితో పోల్చినా సాగు తగ్గిపోయింది.

మరిన్ని వార్తలు