రామరాజ్యం ప్రారంభం: రమణదీక్షితులు

24 May, 2019 20:45 IST|Sakshi
టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు

తిరుమల: ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన అంతమైందని, రామరాజ్యం ప్రారంభమైందని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యాఖ్యానించారు. రమణ దీక్షితులు తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రం కరువు కాటకాలతో అల్లాడిపోయిందని అన్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితి రాదని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. వంశపారంపర్య హక్కును తెలుగుదేశం ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా కాలరాసిందని ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ బ్రాహ్మణులకు అండగా నిలిచారని, వంశపారంపర్యం కొనసాగిస్తామని మాట ఇచ్చారు..వైఎస్‌ జగన్‌ మాట తప్పరని ఆశిస్తున్నట్లు అన్నారు.

ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం వైఎస్‌ జగన్‌ కొనసాగుతారని జోస్యం చెప్పారు. టీటీడీలో తిష్ట వేసిన జేఈఓ శ్రీవారి కైంకర్యాలకు ఆటంకం కలిగించారు.. అలాంటి వారిని సాగనంపాలని కోరారు. బ్రాహ్మణులంటే గౌరవం ఉన్న అధికారులనే టీటీడీలో అధికారులుగా నియమించాలని కోరారు. ఏడాది కాలంగా శ్రీవారి కైంకర్యాలకు దూరం కావడం బాధకలిగించిందని తెలిపారు. తిరిగి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం కలిగించాలని నూతన సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కోరుతున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు