అంతా మా ఇష్టం..

11 Mar, 2016 15:32 IST|Sakshi
 అధికారం మాది..ర్యాంపు వేసి తీరుతాం
 టీడీపీ నాయకుల ధీమా 
 కేసు పెట్టినా తగ్గని వైనం
 
 
ఉసులుమర్రు(పెరవలి) : అంతా మా ఇష్టం.. అధికారం మాది. మేం ఏదైనా చేస్తాం. ఎవరడ్డొచ్చినా  ఉసులుపర్రు వద్ద ర్యాంపు ఏర్పాటు చేసి తీరతాం అనే ధోరణిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకు సాగుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉసులుపర్రు వద్ద గోదావరి ఏటిగట్టును ధ్వంసం చేసి ఇసుక ర్యాంపునకు బాట వేసేందుకు పనిని మొదలుపెట్టిన వారు గోదావరి కన్వర్జన్సీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆగలేదు. 11 మందిపై కేసు పెట్టినా ర్యాంపునకు బాట వేసే పనిని ఆపలేదు. గత రెండురోజులుగా ఈ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇవి పూర్తయితే శుక్రవారం నుంచి లేదా శనివారం నుంచి ఇసుక ఎగుమతులకు టీడీపీ నాయకులు సన్నద్ధమవుతున్నారు. వీరికి స్థానిక ప్రజాప్రతినిధి అండదండలు ఉండడం వల్లే వారు జంకూగొంకూ లేకుండా పనులు చేసుకుపోతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఆ ప్రజాప్రతినిధి సిఫారసు వల్లే  ఏటిగట్టును ధ్వంసం చేసిన ఘటనలో చట్టప్రకారం నాన్‌బెయిలబుల్ కేసులు నమోదుచేయాల్సి ఉండగా, పోలీసులు సాదాసీదాగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఏటిగట్టును ధ్వంసం చేయడం వల్ల వరదలు వస్తే పెనుప్రమాదం సంభవిస్తుందని తెలిసినా.. నాయకులు స్వార్థంతో ర్యాంపు ఏర్పాటును ఆపడం లేదు. కలెక్టర్ భాస్కర్ బుధవారం జిల్లాలో 10 రీచ్‌లలో మాత్రమే ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు ఉన్నాయని స్పష్టం చేశారు. మిగతా చోట్ల ఇసుక తవ్వితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ హెచ్చరికలను కూడా స్థానిక టీడీపీ నాయకులు ఖాతరు చేయడం లేదు. కలెక్టర్ చెప్పిన ప్రకారం.. మండలంలోని కానూరు ర్యాంపునకు మాత్రమే అనుమతులు ఉన్నట్టు తెలుస్తోంది. తీపర్రు ర్యాంపునకు కూడా అనుమతులు లేవని, అలాంటిది ఉసులుమర్రు వద్ద ర్యాంపు ఏర్పాటు చేయడం ప్రమాదకరమని స్థానికులతోపాటు అధికారులూ చెబుతున్నారు. అయినా టీడీపీ నాయకులు ఏమాత్రం పట్టించుకోకుండా బాట పనులు చేయిస్తున్నారు. దీనిపై గోదావరి కన్వర్జన్సీ ఏఈ ఎన్.వి.సత్యనారాయణరాజును వివరణ కోరగా ముందు ఇచ్చిన ఫిర్యాదుతోపాటు పోలీసులకు తాజాగా మరో ఫిర్యాదు కూడా ఇచ్చామని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామని వెల్లడించారు.  
 
 
మరిన్ని వార్తలు