సూర్య గడియారం.. సమయం చూసేదెలా? 

8 Feb, 2020 08:22 IST|Sakshi

77 ఏళ్ల క్రితం నిర్మాణమైన అపురూప కట్టడం 

కచ్చితమైన సమయం తెలుస్తుందంటున్న సూచనల పట్టిక

వివరించే వారు లేక దాని విశిష్టత తెలియని వైనం 

సాక్షి, అన్నవరం: హిందువులతో పూజించబడుతున్న ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు. ఆయన లేనిదే మానవ మనుగడ లేదన్నది జగమెరిగిన సత్యం. అటువంటి సూర్యభగవానుడు కొలువైన క్షేత్రాలు అతి తక్కువ. రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన కూడా సూర్యభగవానుడు నిత్యం పూజలందుకుంటున్నాడు. విష్ణు పంచాయతనం కలిగిన సత్యదేవుని ఆలయం దిగువన యంత్రాలయంలో ఆగ్నేయంలో సూర్యభగవానుడు కొలువు తీరారు. అంతే కాదు సూర్యకిరణాల ఆధారంగా కచ్చితమైన సమయం తెలిపే సూర్యగడియారం కూడా రత్నగిరిపై దశాబ్దాల క్రితమే ఏర్పాటు చేశారు. 

సూర్య కిరణాల ఆధారంగా.. 
సత్యదేవుని ఆలయానికి ఈశాన్యభాగాన, స్వామి వారి నిత్య కల్యాణ మండపం వద్ద గల సూర్యగడియారం (సన్‌డయిల్‌)లో సూర్యకాంతి ఆధారంగా కచ్చితమైన సమయం తెలుసుకోవచ్చు. ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి సూర్యగమనం ఆధారం ఈ గడియారాన్ని 1943లో అప్పటి ఆలయ ధర్మకర్త ఇనుగంటి వేంకట రాజగోపాల రామసూర్యప్రకాశరావు కోరిక మేరకు ఖగోళ, జ్యోతిష శాస్త్రాలలో నిష్ణాతుడైన  రాజమహేంద్రవరానికి చెందిన పిడమర్తి కృష్ణమూర్తి శాస్త్రి నిర్మించారు. 

నిర్మాణం ఇలా.. 
12 అడుగుల పొడవు, ఎనిమిది అడుగుల వెడల్పు కలిగిన గ్రానైట్‌ పలకపై త్రికోణం ఆకారంలో తూర్పునకు అభిముఖంగా మరో చిన్న పలక అమర్చారు. సూర్యకాంతి ఆ చిన్న పలక మీద పడి దాని నీడ పెద్ద పలకపై పడుతుంది. అలా నీడ పడే చోట అర్ధచంద్రాకారంగా గడియారంలో ఉన్నట్టుగా అంకెలు ఉంటాయి. ఆ నీడ పడిన అంకెలకు ఆయా నెలలు, తేదీలు అనుసరించి కొంత సమయాన్ని కలపడం లేదా తీసివేయడం చేయాలి. అలా చేయడం వల్ల మనకి కచ్చితమైన సమయం తెలుస్తుంది. ఎప్పుడు కలపాలి, ఎప్పుడు తీసివేయాలనే దానిపై అక్కడ గల సూచనల పట్టికలో వివరంగా లిఖించబడి ఉన్నాయి. ఉదాహరణకు ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం ఆ పలక నీడ 10–20 అంకెల మధ్య పడితే అక్కడ ఉన్న పట్టిక ప్రకారం ఆ తేదీకి పది నిమిషాలు కలపాలి. అంటే అప్పుడు సమయం 10.30 అయినట్టు. విశేషమేమిటంటే ఈ సమయం కచ్చితంగా ఇండియన్‌ స్టాండర్డ్‌ టైమ్‌కు సరిపోతుంది. 

నిర్వహణ పట్టించుకోని దేవస్థానం 
ఎంతో విశిష్టత కలిగిన ఈ సూర్యగడియారం ఆలనా పాలనా లేకపోవడంతో సమయం ఎలా తెలుసుకోవాలో తెలియక భక్తులు ఏదో నిర్మాణాన్ని చూసినట్టు చూసి వెళ్లిపోతున్నారు తప్ప, ఆ గడియారంలో సమయం తెలుసుకునే విధానం తెలుసుకోలేక నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ గడియారంలో సమయం చూసుకునేందుకు అక్కడ పలక మీద వేసిన అంకెలు, సూచనల పట్టికలోని సూచనలు, ప్లస్, మైనస్‌ గుర్తులు అరిగిపోయి స్పష్టంగా కనిపించడం లేదు. దేవస్థానం అధికారులు మళ్లీ స్పష్టంగా రాయించాలి. అదే విదంగా  ఈ సూర్య గడియారం ప్రాముఖ్యతను భక్తులకు  వివరించేందుకు అక్కడొక గైడ్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు