‘రియల్' ఎగవేతపై విజిలెన్స్

18 Mar, 2015 03:45 IST|Sakshi

విజయవాడ సిటీ : జిల్లాలో నాలా పన్ను చెల్లించని రియల్ ఎస్టేట్ వెంచర్లపై విజిలెన్స్ అధికారులు దృష్టిసారించారు. ఇప్పటివరకు సంబంధిత శాఖల అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లు వేయడం ద్వారా ఒక్క నూజివీడు డివిజన్‌లోనే ప్రభుత్వానికి రూ.40 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నాలా పన్ను చెల్లించకుండా రియల్ ఎస్టేట్ సంస్థలు వెంచర్లు వేసి ప్లాట్ల విక్రయం జరపడం వెనుక రెవెన్యూ అధికారుల పాత్రపై కూడా విజిలెన్స్ అధికారులు దృష్టిసారించినట్టు సమాచారం. జిల్లాలో 130 వరకు అనధికారిక లే అవుట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు నూజివీడు డివిజన్‌లోని పలు రియల్ ఎస్టేట్ వెంచర్లను పరిశీలించగా.. మెజారిటీ వెంచర్లు అనుమతులు లేనివేనని తేలింది.
 
ఎలాంటి అనుమతులూ లేకుండానే వ్యవసాయ భూములను ప్లాట్లుగా వేసి సొమ్ము చేసుకున్నట్టు గుర్తించారు. తొలుత నూజివీడు ప్రాంతంలో రాజధాని వస్తుందని ప్రచారం జరగడంతో అక్కడ వేసిన వెంచర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో అనుమతులు చూసుకోకుండానే పలువురు ప్లాట్లు కొనుగోలు చేశారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాలు అంటూ హనుమాన్‌జంక్షన్ సమీపంలోనూ పలు వెంచర్లు వేసి ప్లాట్ల విక్రయం జరిపారు.
 
అనుమతులు తప్పనిసరి
రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే ముందు ఉడా లేదా డీటీసీపీ అనుమతి విధిగా తీసుకోవాలి. 2006 నాలా చట్టం ప్రకారం వ్యవసాయ భూములను ప్లాట్లుగా వేసి విక్రయించాలంటే గామీణ ప్రాంతాల్లో భూమికి ప్రభుత్వం ప్రకటించిన విలువ ఆధారంగా ఆరు నుంచి తొమ్మిది శాతం వరకు, పట్టణ ప్రాంతాల్లో ఐదు శాతం నాలా ఫీజును రెవెన్యూకు చెల్లించాలి. వందల సంఖ్యలో రియల్ వెంచర్లలో నాలా ఫీజు చెల్లించకుండానే వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చేశారు.

70 శాతం రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించి నాలా ఫీజు చెల్లించకుండానే వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయించినట్టు అధికారులు గుర్తించారు. ఒక్క నూజివీడు డివిజన్‌లోనే రూ.40 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందంటే, జిల్లాలోని మిగిలిన ప్రాంతాల పరిస్థితిని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. విజయవాడ డివిజన్‌లోని కంకిపాడు, పెనమలూరు, కంచికచర్ల, నందిగామ పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. వీటిపై కూడా దృష్టిసారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
 
అక్రమ వెంచర్లలో రెవెన్యూ పాత్ర
రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే సమయంలో గ్రామ కార్యదర్శులు విధిగా అనుమతులు పరిశీలించాలి. తగిన అనుమతులు లేని పక్షంలో సంబంధిత తహశీల్దారు ద్వారా నోటీసులు జారీ చేసి నాలా పన్ను వసూలు చేయాలి. లేని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఆయా సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ఉంది. కొందరు గ్రామ కార్యదర్శుల అవినీతి కారణంగా ఇబ్బడిముబ్బడిగా అనుమతులు లేని వెంచర్లు వెలిసినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఆయా వెంచర్ల విషయంలో వీరి పాత్రపై కూడా ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు