అత్యుత్సాహం | Sakshi
Sakshi News home page

అత్యుత్సాహం

Published Wed, Mar 18 2015 3:37 AM

Enthusiasm

మచిలీపట్నం : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అతిగా స్పందించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, నాయకులు, సీఐటీయూ నేతల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడమే గాక వారి రాకపోకలపై నిఘా ఉంచారు. అందుబాటులో లేనివారి ఆచూకీ కోసం వారి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నేరస్తుల మాదిరి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అంగన్‌వాడీలను గుర్తించి నిర్బంధంలోకి తీసుకున్నారు. పోలీసుల తీరుతో అంగన్‌వాడీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జిల్లా వ్యాప్తంగా మంగళవారం ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
 
పోలీసుల అదుపులో 550 మంది...
అంగన్‌వాడీలను సోమవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి 11, 12 గంటల సమయంలో సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మంగళవారం ఉదయమే తిరిగి పోలీస్‌స్టేషన్ వద్ద హాజరవుతామనే హామీ తీసుకుని వారిని విడిచిపెట్టారు. ఓ అడుగు ముందుకేసిన చిల్లకల్లు పోలీసులు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలను గరికపాడు చెక్‌పోస్ట్ వరకు వెంబడించి అక్కడ బస్సును నిలిపివేశారు. అందులో ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలను చిల్లకల్లు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈవిధంగా జిల్లా వ్యాప్తంగా 550 మందికి పైగా అంగన్‌వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం వారిని విడుదల చేశారు.
 
నేరస్తుల మాదిరిగా సెర్చ్...
 అతి తక్కువ జీతంతో నానా ఇబ్బందులు పడుతూనే గొడ్డుచాకిరీ చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అంగన్‌వాడీల సంఘ జిల్లా అధ్యక్షురాలు, గూడూరు వాసి రెజీనారాణిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. రెజీనారాణి ఇంటివద్ద లేకపోవడంతో ఆమె భర్తను, కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. కుమారుడి సెల్‌ఫోన్ ద్వారా ఆమెకు కాల్ చేసి, సెల్ సిగ్నల్స్ ఆధారంగా ఆమె ఎక్కడ ఉన్నదీ గుర్తించారు. బందరు మండలంలోని సీతారామపురంలో అంగన్‌వాడీ కార్యకర్త ఇంటివద్ద ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.
 
అంగన్‌వాడీల రాస్తారోకో
తమతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించకుండా కరుడుగట్టిన నేరస్తుల మాదిరిగా సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అదుపులోకి తీసుకోవటంపై అంగన్‌వాడీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడూరు ప్రధాన సెంటర్‌లోని మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు అతిగా ప్రవర్తించి, తమతో పాటు తమ బంధువులనూ అదుపులోకి తీసుకున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 పలుచోట్ల నిరసనలు, దిష్టిబొమ్మల దహనం
 
మచిలీపట్నం కోనేరుసెంటరులో అంగన్‌వాడీ కార్యకర్తలు మంగళవారం ఆందోళన నిర్వహించారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ తాలుకా పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. సోమవారం రాత్రి తమ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లను ఇచ్చేవరకు ఆందోళన చేశారు.
 
పెడనలో అంగన్‌వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ బంటుమిల్లి సెంటరు నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటరులో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
 
గూడూరు సెంటరులో మచిలీపట్నం - విజయవాడ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
 
బంటుమిల్లి లక్ష్మీపురం సెంటరులో అంగన్‌వాడీలు ధర్నా నిర్వహించారు.
 
గుడివాడ నెహ్రూచౌక్ సెంటరులో అంగన్‌వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సీఐటీయూ గుడివాడ డివిజన్ నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు.
 
చల్లపల్లి ప్రధాన సెంటరులో అంగన్‌వాడీ కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. అవనిగడ్డ తహశీల్దార్ కార్యాలయం వద్ద కూడా ధర్నా నిర్వహించారు.
 
జగ్గయ్యపేటలో అంగన్‌వాడీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. నందిగామలో తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు.  
 
మేమేమైనా తీవ్రవాదులమా? : రెజీనారాణి
గూడూరు : తనతో, తన కుటుంబ సభ్యులతో పోలీసులు దారుణంగా వ్యవహరించి అవమానించారని అంగన్‌వాడీల సంఘ జిల్లా అధ్యక్షురాలు రెజీనారాణి వాపోయారు. గూడూరు పోలీస్‌స్టేషన్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. సోమవారం సాయంత్రం నుంచి తన ఇంటి వద్ద పోలీసులు కాపు కాసి ఆందోళనకు గురిచేశారన్నారు.

తనను హైదరాబాద్‌కు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నంలో తాను కనిపించకపోయేసరికి తన భర్త, కుమారుడిని కూడా స్టేషన్‌కు తరలించి వేధింపులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తన కుమారుడి సెల్‌ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఆధారంగా తన ఆచూకీ కనుగొని అదుపులోకి తీసుకున్నారన్నారు. ఇంతలా వేధింపులకు గురిచేసేంత నేరం తామేమి చేశామని ఆమె ప్రశ్నించారు. తామేమైనా తీవ్రవాదులమా, టైస్టులమా అని నిలదీశారు. సమస్య పరిష్కారం కోసం శాంతియుత మార్గంలో నిరసనలు తెలుపుతున్న మహిళలపై ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా అంటూ మండిపడ్డారు.

Advertisement
Advertisement