ఎవరికివారే.... రికవరీ ఎలా...!

7 Apr, 2018 12:53 IST|Sakshi
ఆర్‌ఈసీఎస్‌ ప్రధాన కార్యాలయం

అధికారులపై సస్పెన్షన్‌కు సిద్ధమవుతున్న ఎండీ

మరో నలుగురు అధికారులకు మెమోలు జారీ

ఆంధ్రా బ్యాంకులో రూ.8 కోట్ల డిపాజిట్లు వెనక్కి తీసుకునే యోచన

రూ.1.79 కోట్లు రికవరీలో చర్యలు శూన్యం  

చీపురుపల్లి: ఆర్‌ఈసీఎస్‌ నిర్లక్ష్యం పుణ్యమాని రూ.1.79 కోట్లు డబ్బు పక్కదోవ పట్టింది. దీనిపై వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. ఇదంతా జరిగి ఐదారు రోజులు గడుస్తోంది. కాని పక్కదోవ పట్టిన రూ.1.79 కోట్లు నిధులు రికవరీకు సంబంధించిన ఎలాంటి ముందడుగు చర్యలు ఇంతవరకు ప్రారంభమైనట్టు కనిపించడం లేదు. ఆంధ్రా బ్యాంకు వైపు నుంచి ప్రాథమిక నివేదిక ఉన్నత అధికారులకు సమర్పించామని చెబుతుంటే ఆర్‌ఈసీఎస్‌ వైపు నుంచేమో వోచర్లు మా దగ్గర ఉన్నాయి...డబ్బు మొత్తానికి బ్యాంకుదే బాధ్యత అంటూ స్పష్టం చేస్తున్నారు. ఇలా ఆంధ్రా బ్యాంకు, ఆర్‌ఈసీఎస్‌ ఎవరికి వారే మాటలే చెబుతున్నారు తప్ప డబ్బు రికవరికీ సంబంధించిన ఎలాంటి విచారణలు ఇంతవరకు ప్రారంభమైన దాఖలాలు కనిపించడం లేదు.

ఇందులో తమదేమీ తప్పులేదన్నట్టు ఆర్‌ఈసీఎస్‌లో ఇప్పటికే ముగ్గురు అధికారులకు ఈ నెల 3న షోకాజ్‌ నోటీసులు ఇవ్వగా, తాజాగా మరో నలుగురు అధికారులకు మెమోలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 3న షోకాజ్‌ నోటీసులు ఇచ్చిన వారిని సస్పెండ్‌ చేసేందుకు కూడా ఎండీ సిద్ధమైనట్టు సమాచారం. ఈ చర్యలతో ఆర్‌ఈసీఎస్‌ ఉద్యోగుల్లో కలవరం మొదలైంది. అంతేకాకుండా శాఖల వారీగా వారిలో అంతర్యుద్ధం కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. తమకు సంబంధం లేకపోయినా చర్యలు ఎందుకు తీసుకుంటున్నారంటూ ఉద్యోగులు ఎదురు తిరుగుతున్నట్టు తెలిసింది. దీంతో రూ.1.79 కోట్లు పక్కదోవ పట్టడంలో నిర్లక్ష్యం వహించిన ప్రతీ ఉద్యోగిపైనా చర్యలు తీసుకుంటే మంచిదన్న అభిప్రాయానికి ఎండీ రమేష్‌ వచ్చినట్టు సమాచారం. ఉద్యోగులపై చర్యలు సరే...డబ్బు సంగతి ఏంటంటే మళ్లీ పాత పాటే పాడుతున్నారు.
డిపాజిట్లు వెనక్కి తీసుకునే

యోచనలో...
ఇదిలా ఉండగా ఆంధ్రా బ్యాంకులో ఆర్‌ఈసీఎస్‌కు చెందిన రూ.8 కోట్లు వరకు డిపాజిట్లు ఉన్నాయి. తాజాగా రూ.1.79 కోట్లు ఆర్‌ఈసీఎస్‌ డబ్బు పక్కదోవ పట్టడంలో ఆంధ్రాబ్యాంకుదే ప్రధాన పాత్ర అంటూ ఐదారు రోజులుగా ఆర్‌ఈసీఎస్‌ ఎండీ, పాలకవర్గం స్పష్టం చేస్తూనే ఉన్నాయి. ఈ విషయంలో ఆంధ్రా బ్యాంకు నుంచి స్పష్టమైన ప్రకటనలు లేవు. దీంతో ఆ బ్యాంకులో ఉన్న రూ.8 కోట్లు డిపాజిట్లు వెనక్కి తీసుకుని వేరే బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని అధికారులు, పాలకవర్గం భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు డిపాజిట్లు వెనక్కి తీసుకునేందుకు లిఖిత పూర్వకంగా బ్యాంకును ఒకటి, రెండు రోజుల్లో కోరనున్నట్టు తెలుస్తోంది.

రికవరీ చర్యలు శూన్యం...
ఇదిలా ఉండగా రూ.1.79 కోట్లు ఆర్‌ఈసీఎస్‌ డబ్బు రికవరీలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. సరిగ్గా ఈ నెల 1న నిధులు గల్లంతు విషయం బయిటపడింది. అప్పటికే మూడు రోజులు ముందు నుంచి అధికారులు ఈ విషయంలో మల్లగుల్లాలు పడుతున్నప్పటికీ ఏప్రిల్‌ 1న నియోజకవర్గంలో బాహాటంగా చర్చకు వచ్చింది. దీంతో ఈ నెల 2న పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఇంతవరకు డబ్బు రికవరీకి సంబంధించి బ్యాంకులో ఎలాంటి విచారణ ప్రారంభమైనట్టు కనిపించడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రాబ్యాంకు, ఆర్‌ఈసీఎస్‌ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం తప్ప డబ్బు రికవరీ చర్యలు మాత్రం కనిపించడం లేదు.

ఆర్‌ఈసీఎస్‌లో రూ.కోట్ల కుంభకోణం విషయంలో ఇటు ఆర్‌ఈసీఎస్‌ అధికారులు, అటు ఆంధ్రాబ్యాంకు అధికారులు ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. తమ తప్పిదం లేదన్నట్టు వీరు వ్యవహరిస్తుండడంతో అసలు కుంభకోణం విషయం సంగతేంటన్నది వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది.

మరిన్ని వార్తలు