అమాత్యా.. పరాభవం తప్పదా..?

4 Apr, 2019 12:17 IST|Sakshi
కళా వెంకటరావు, అచ్చెన్నాయుడు

టీడీపీ కార్యకర్తల లబ్ధి కోసం రేషన్‌ డీలర్ల తొలగింపు

న్యాయస్థాన ఆదేశాలను తొక్కిపెట్టిన మంత్రి అచ్చెన్న

మంత్రి కళా వెంకటరావుకు ఇంటిపోరు

బలవంతుడను నాకేమని విర్రవీగిన వారికి పరాభవం తప్పనట్టు ఇన్నాళ్లూ అరాచకాలు, అణచివేతలతో జిల్లాను పాలించిన ఇద్దరు మంత్రులకూ ఓటమి భయం వెంటాడుతోంది. నీరు– చెట్టు పనులు, ఉచిత ఇసుక పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దిగమింగి.. తనతోపాటు అనుచరగణం కోసం బరితెగించిన అచ్చెన్నాయుడికి ఈసారి గుణపాఠం చెప్పడానికి ప్రజానీకం ఎదురుచూస్తోంది. మరోపక్క తన ఎదుగుదల కోసం ఎదుటివారిని అణగదొక్కి పబ్బం గడుపుకునే కళా వెంకటరావుకు బుద్ధి చెప్పడానికి వ్యతిరేక వర్గం కంకణం కట్టుకుంది. ఈ దఫా ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదన్న భయంతో ఇద్దరు మంత్రులకు నిద్ర కరువైంది.  

సాక్షి, టెక్కలి (శ్రీకాకుళం): సుమారు పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉంటూ ఒక్కసారిగా అధికారం రాగానే మంత్రి అచ్చెన్నాయుడు కక్షసాధింపు చర్యల్లో రేషన్‌ డీలర్లు బలైపోయారు. 22 మంది రేషన్‌ డీలర్లను అకారణంగా తొలగించి, పందికొక్కుల్లా రేషన్‌ సరుకులు తింటున్నారు. స్వయం శక్తి సంఘాల ముసుగులో టీడీపీ కార్యకర్తలకు రేషన్‌ డీలర్‌ బాధ్యతలు అప్పగించి ఇష్టారాజ్యంగా పేదల సరుకులను బొక్కేస్తున్నారు. కొంత మంది హైకోర్టు ఉత్తుర్వులు తెచ్చుకున్నా మంత్రి పెత్తనం ముందు దిగదుడుపుగా మారాయి. ఈ నేపథ్యంలో ఈ నెల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామం టూ బాధిత డీలర్లు బాహాటంగానే హెచ్చరిస్తున్నారు.

మంత్రి కక్షసాధింపునకు బలి
టెక్కలి నియోజకవర్గంలో టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి మండలాల్లో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కక్షసాధింపు చర్యలకు మొత్తం 22 మంది రేషన్‌ డీలర్లు బలైపోయారు. టెక్కలి మండలంలో సీతాపురం, తిర్లంగి, బొరిగిపేట, పోలవరం, భగవాన్‌పురం, బన్నువాడ, బూరగాం, పాతనౌపడ, నందిగాం మండలంలో నందిగాం, హరిదాసుపురం, నౌగాం, దేవుపురం, రాంపురం, దిమిలాడ, నరేంద్రపురం, పెద్దతామరాపల్లి, కోటబొమ్మాళి మండలంలో సరియాపల్లి, కొత్తపల్లి, చీపుర్లపాడు, కోటబొమ్మాళి, కురుడు, దంత తదితర గ్రామాల్లో రేషన్‌ డీలర్లపై అడ్డగోలుగా దాడులు చేయించి వారిని విధుల నుంచి తప్పించారు. అనంతరం ఆయా గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ ఇష్టారాజ్యంగా దోపిడీ పర్వానికి తెర తీశారు. 

ఎచ్చెర్ల క్యాంపస్‌: రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావుకు అసమ్మతి సెగ వెంటాడుతోంది. టీడీపీలో కీలక నాయకులు ఏకమైన వ్యూహాత్మకంగా ఈయన్ను ఓడించే ప్రయత్నం చేస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయాలు, పార్టీ అంతర్గత విభేదాలు ప్రస్తుతం కళాకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. రాష్ట్రంలో కీలక నాయకుడు కావటం వల్ల ఎన్నికల్లో విజయావకాశాలు ప్రభావం చూపుతాయని అనుకున్నారు. అయితే పరిస్థితులు ఒక్కసారిగా ప్రతికూలంగా మారాయి.

వ్యతిరేక వర్గమంతా ఏకమై...
 సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేస్తున్న మాజీ స్పీకర్‌ కావలి ప్రతిభాభారతికి ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కకుండా చేశారు. అవకాశవాది, తన రాజకీయ ప్రత్యర్థి కోండ్రు మురళీ మోహన్‌కు టీడీపీ రాజాం టిక్కెట్‌ ఇవ్వటం ఈమె జీర్ణించుకోలేకపోతున్నారు. 1983 నుంచి 1999 వరకు సుదీర్ఘకాలం ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో రాజాంలో తన ఓటమికి కళా కారణం అన్న అంశం సైతం ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రధాన కారణంగా మారుతోంది. మరోవైపు కళా వెంకటరావు తనకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, పట్టుబట్టి మరీ మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడుని పార్టీలో చేర్చుకున్నారు. దీంతో జి.సిగడాం మండలంలో ఆ పార్టీ నాయకులు లోలోన రగిలిపోతున్నారు. ఇదే కారణంతో ఓట్లు ప్రభావితం చేయగల టీడీపీ నాయకులు వాండ్రంగి మాజీ సర్పంచి బూరాడ వెంకటరమణ, జాడ మాజీ సర్పంచి కోరాడ అచ్చారావు, కొప్పరాం మాజీ సర్పంచ్‌ ఎర్రబోలు సింహాచలం, ఏవీఆర్‌పురం నాయకుడు మీసాల గోవిందరావు పార్టీ వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌ వర్గం కూడా
మరోవైపు జెడ్పీ చైర్‌పర్సన్‌ చౌదిరి ధనలక్ష్మి వర్గానికి కళాకు ఎప్పట్నుంచో శత్రుత్వం ఉంది. వీరిని పార్టీలో ఎదగకుండా కళా అణిచివేతకు ప్రయత్నించారు. మరోవైపు ఆర్థిక ప్రగతిని దెబ్బతీసేలా వీరికి కాంట్రాక్టు వచ్చిన ఇసుక రీచ్‌ రద్దు చేశారు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మద్దతుతో వీరు నెగ్గుకు వస్తున్నారు. వీరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్న కళా వ్యతిరేక పోస్టర్లు ప్రదర్శన సైతం ఏడాది క్రితం కలకలం రేపింది. కళా ప్రోత్సాహంతో ఒక పోలీస్‌ అధికారి దర్యాప్తు చేయగా టీడీపీ నాయకుల ప్రమేయంతో పోస్టర్లు అతికించినట్లు బయటపడింది. పోస్టర్లు అంటించిన వారిని పోలీస్‌ స్టేషన్ల చుట్టూ వారం రోజులపాటు తిప్పి చివరకు విడిచి పెట్టారు. అదేవిధంగా 2009 టీడీపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే అభ్యర్థి నాయని సూర్యనారాయణరెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరి కళా ఓటమి కోసం అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం కళా అసమ్మతి పద్మవ్యూహంలో చిక్కుకున్నారన్నది రాజకీయ విశ్లేషకులి మాట!

మా కుటుంబాన్ని రోడ్డున పడేశారు
మా గ్రామంలో టీడీపీ కార్యకర్తలకు రేషన్‌ డీలర్‌షిప్‌ ఇవ్వడానికి అన్యాయంగా నన్ను తొలగించారు. బలవంతంగా సెలవు పెట్టించారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ మంత్రి అచ్చెన్నాయుడుకు భయపడి నాకు డీలర్‌ షిప్‌ ఇవ్వలేదు. ఐదేళ్లుగా మా కుటుంబం నడిరోడ్డున పడింది. 
– రేగు గాసయ్య, బాధిత రేషన్‌ డీలర్, బూరగాం, టెక్కలి మండలం

రాజకీయ కక్షతో తొలగించారు
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అచ్చెన్నాయుడు రాజకీయకక్షతో నా డీలర్‌షిప్‌ను  తొలగించారు. నేను 1991 నుంచి దేవుపురంలో డీలర్‌గా పనిచేస్తున్నాను. నాపై ఎలాంటి ఆరోపణలు  లేకపోయినా తొలగించడం మంత్రి అధికార దుర్వినియోగానికి నిదర్శనం.
– కంచరాన కృష్ణమూర్తి, దేవుపురం, నందిగాం మండలం 

అన్యాయంగా డీలర్‌షిప్‌ తొలగించారు
టీడీపీ అధికారంలోకి రాగానే అన్యాయంగా నా రేషన్‌ దుకాణంపై దాడులు చేయించి డీలర్‌ షిప్‌ను తొలగించారు. దీనిపై హైకోర్టు మాకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ డీలర్‌ షిప్‌ ఇవ్వలేదు. ఆ తర్వాత జేసీ కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన మంత్రి అడ్డుకుంటున్నారు.
– నడుపూరు అమ్మాలు, బాధిత డీలర్, తిర్లంగి, టెక్కలి మండలం

మరిన్ని వార్తలు