ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదు

16 Mar, 2016 00:58 IST|Sakshi
ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదు

ఉద్యోగాల కల్పనపై రివర్స్ గేర్
అసెంబ్లీ సాక్షిగా ప్లేటు ఫిరాయించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ
ఇంటికో ఉద్యోగం ఇస్తామనలేదంటూ మాట మార్పు
నిరుద్యోగుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం

 
మద్దిరాల గ్రామంలో స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణలో ఉన్న రాజధాని ప్రాంత నిరుద్యోగ యువతతో  మాట్లాడుతున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (ఫైల్)
 
విజయవాడ బ్యూరో : రాజధాని యువతకు బోలెడు ఉద్యోగాలిప్పిస్తామని ఊదరగొట్టిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇప్పుడు ప్లేటు ఫిరాయించారు. భూ సమీకరణ సమయంలో ఇంటింటికీ తిరిగి నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పిస్తామన్న ఆయన ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము చెప్పలేదని సోమవారం నిండు శాసనసభలో చేతులెత్తేశారు. ప్రపంచస్థాయి శిక్షణ అంటూ మాటలు కోటలు దాటేలా ప్రకటనలు చేశారు. నైపుణ్య శిక్షణ, జాబ్‌మేళాల పేరుతో హడావుడి చేశారు.

ఇదంతా నిజమేనని నమ్మి ఉన్న ఉద్యోగాలు కూడా వదిలేసుకుని వచ్చిన కొందరు ఇప్పుడు ఏదీ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల నుంచి రాజధాని నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ సూచనల మేరకు పనిచేసిన సీఆర్‌డీఏ అధికారులు నిరుద్యోగులకు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నారు. సీఆర్‌డీఏను నడిపించే అమాత్యుడు అసెంబ్లీలో చేసిన బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలు నిరుద్యోగుల్లో మరింత ఆగ్రహాన్ని రగిల్చాయి.
 
 

మరిన్ని వార్తలు