Sakshi News home page

టర్మ్ పాలసీలపై ఐసీఐసీఐ దృష్టి

Published Wed, Mar 16 2016 12:53 AM

టర్మ్ పాలసీలపై ఐసీఐసీఐ దృష్టి

టర్మ్ పాలసీల నుంచి ఏటా రెట్టింపు ప్రీమియం ఆదాయ లక్ష ్యం
సంప్రదాయ ఎండోమెంట్, మనీ బ్యాక్ పాలసీలకు తగ్గుతున్న డిమాండ్
ఇన్వెస్ట్‌మెంట్ కోసం యులిప్‌ల వైపు చూస్తున్న ఇన్వెస్టర్లు
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సందీప్ బాత్ర

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాలసీదారుల ఆలోచనలో మార్పువస్తోందని, సంప్రదాయ ఎండోమెంట్ పాలసీల కంటే అధిక బీమా రక్షణ ఇచ్చే టర్మ్ పాలసీలకే మొగ్గు చూపుతున్నట్లు ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ అంటోంది. గతంలో వలే బీమాను ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడకుండా ఆర్థిక రక్షణ కల్పించే సాధనంగా చూడటంతో టర్మ్ ఇన్సూరెన్స్‌కి డిమాండ్ పెరుగుతున్నట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సందీప్ బాత్ర తెలిపారు. ప్రస్తుతం మొత్తం బీమా వ్యాపారంలో టర్మ్ ఇన్సూరెన్స్ వాటా రెండు శాతంగానే ఉందని, కానీ ఈ విభాగం వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా బాత్ర ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. 2014లో ఐఆర్‌డీఏ 37 కొత్త టర్మ్ పాలసీలకు అనుమతిస్తే, ఈ సంఖ్య 2015 నాటికి 97కి చేరిందన్నారు. ఐసీఐసీఐ ఈ మధ్యనే విడుదల చేసిన ఐ ప్రోటక్ట్ స్మార్ట్‌కు మంచి స్పందన వస్తోందన్నారు.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ. 49 కోట్ల నుంచి రూ. 78 కోట్లకు పెరిగిందని వచ్చే ఏడాది ఈ మొత్తం రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. హోమ్‌లోన్ వంటి దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న వారు వాటితో పాటు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవడం కూడా డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా చెపుతున్నారు. గతంతో పోలిస్తే అనేక ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలు అందుబాటులోకి రావడంతో బీమాను ఇన్వెస్ట్‌మెంట్‌గా చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందన్నారు. ట్యాక్స్ ప్రయోజనాలు దృష్ట్యా రిటైర్మెంట్ పాలసీలు కూడా అంత ఆకర్షణీయంగా లేకపోవడంతో రిటైర్మెంట్ పాలసీల అమ్మకాలు కూడా తగ్గుతున్నాయన్నారు.

కానీ రిస్క్ చేసే సామర్థ్యం ఉన్న వారు మాత్రం యులిప్‌ల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ విషయానికి వస్తే 2013లో  మొత్తం అమ్మకాల్లో 45.5 శాతంగా ఉన్న సంప్రదాయ బీమా పాలసీల వాటా ఇప్పుడు 15.4 శాతానికి పడిపోయిందని, ఇదే సమయంలో యులిప్ అమ్మకాలు 54.5 శాతం నుంచి 84.6 శాతానికి చేరిందన్నారు. స్టాక్ మార్కెట్లు పెరగడం కూడా యులిప్స్ అమ్మకాలు పెరగడానికి ఒక కారణంగా ఆయన పేర్కొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement