పక్కాగా ‘పరిషత్’

30 Jun, 2014 02:41 IST|Sakshi
పక్కాగా ‘పరిషత్’
  •      జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్
  •      ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
  •  విశాఖ రూరల్: మండల, జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికలను జూలై 4,5 తేదీల్లో సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ  జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినందుకు అధికారులను అభినందించారు.

    అదే విధంగా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు కూడా అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఏమైనా సందేహాలు, సమస్యలు వస్తే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం కో-ఆప్టెడ్ సభ్యుల ఎన్నికలు, ఆ తరువాత అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు జరపాలన్నారు.

    సమావేశానికి ఓటు హక్కు కలిగిన సభ్యుల్లో సగం మంది హాజరైనప్పుడు మాత్రమే కోరం సరిపోయినట్టు భావించి సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను కూడా ఆహ్వానించాలన్నారు. జెడ్పీ సీఈవో మహేశ్వరరెడ్డి, డీడీ శ్రీనివాసన్ పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు