రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం

18 Jul, 2019 03:24 IST|Sakshi

ఒకే విడతలో గ్రామాలు, వార్డుల్లో 1,33,867 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం

నేడు కేబినెట్‌ ముందుకు రానున్న ఫైల్‌కు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌

50 రోజుల పాలనలోనే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం

మొత్తం గ్రామ, వార్డు సచివాలయాలు 14,900

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌ మేరకు పెద్దపీట 

గ్రామ, వార్డు సచివాలయాల్లో కొలువులన్నీ పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలే 

శాఖల వారీగా నియామకాలకు వారం పది రోజుల్లో నోటిఫికేషన్లు

గ్రామీణ ప్రాంతంలో సచివాలయాలు 11,114 అందులో కొత్త ఉద్యోగాలు 99,144

పట్టణ ప్రాంతంలో సచివాలయాలు 3,786

అందులో కొత్త ఉద్యోగాలు 34,723

సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఒకే విడత 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి సంబంధించిన ఫైలు గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముందుకు రానుంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా పూర్తి కాకుండానే ఒక చరిత్రను సృష్టించబోతోంది. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 14,900 గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేసేందుకు మొత్తం 1,33,867 కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించి మంత్రివర్గ సమావేశంలో పెట్టాల్సిన ఫైలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ బుధవారం ఆమోద ముద్ర వేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 13,065 గ్రామ పంచాయతీలకు గాను ప్రభుత్వం 11,114 గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చింది. వీటిలో పని చేసేందుకు 99,144 మందిని కొత్తగా నియమించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాల ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. వార్డు సచివాలయాల్లో పని చేసేందుకు 34,723 మంది ఉద్యోగులను నియమిస్తారు. గ్రామ సచివాలయాల్లో పది మంది ఉద్యోగుల నుంచి 12 మంది దాకా పని చేసేలా నిర్ణయించగా, వార్డు సచివాలయాల్లో పదేసి మంది చొప్పున ఉద్యోగులు పని చేస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే వారు పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం విదితమే.  
 
వారం తర్వాత నోటిఫికేషన్లు 
కొత్తగా 1,33,867 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై గురువారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత వీటి భర్తీకి కేవలం వారం పది రోజుల వ్యవధిలో శాఖల వారీగా నోటిఫికేషన్లు వెలువడుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నోటిఫికేషన్‌ సమయంలోనే ఏ ఉద్యోగానికి ఏ విద్యార్హత అన్న వివరాలను ఆ శాఖలు వెల్లడించనున్నాయి. నోటిఫికేషన్లలో శాఖల వారీగా వెలువరించిన ఉద్యోగాలను జిల్లాల వారీగా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ప్రత్యేక కమిటీ (డీఎస్‌సీ)లు రాత పరీక్ష నిర్వహించడం ద్వారా భర్తీ చేస్తాయి. ఈ ఉద్యోగాల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు రిజర్వేషన్ల మేరకు ఎక్కువగా లబ్ధి పొందే అవకాశం ఉంది.   

వార్డు సచివాలయాల్లోకొత్తగా నియమించే ఉద్యోగులు – వారి విధులు   

మరిన్ని వార్తలు