దడ పుట్టించిన రవాణా శాఖ

7 Jul, 2018 13:33 IST|Sakshi
ఆటోల తనిఖీల్లో పాల్గొన్న డీటీసీ వెంకటేశ్వరరావు

తొలి రోజు 52 ఆటోల సీజ్‌

9 ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు

మర్రిపాలెం(విశాఖ పశ్చిమ): నిబంధనలు పాటించని ఆటోలను రవాణా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పరిమితికి మించిన ప్రయాణికులతో ప్రయాణాలు, రాంగ్‌ రూట్‌లో రాకపోకలతో పట్టుబడిన 52 ఆటోలను సీజ్‌ చేశారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఆటోల తనిఖీల కోసం జిల్లా వ్యాప్తంగా 9 ప్రత్యేక బృందాలను ఉప రవాణా కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వరరావు నియమించారు. ఈ బృంద సభ్యులు శుక్రవారం నగరంతో పాటు గాజువాక, అనకాపల్లి, నర్సీపట్నం రవాణా కార్యాలయాల పరిధిలో తనిఖీలు చేపట్టారు.

రాకపోకలు సాగిస్తున్న ప్రతీ ఆటోను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని 52 ఆటోలను సీజ్‌ చేశారు. ఉప రవాణా కమిషనర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వరరావు స్వయంగా తనిఖీల్లో పాల్గొని కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోల్లో ప్రయాణికుల రక్షణ, భద్రతకు ప్రాధాన్యమిచ్చేందుకు తనిఖీలు జరుపుతున్నామని డీటీసీ స్పష్టం చేశారు. పరిమితికి మించి ప్రయాణికులతో ఆటోలు రాకపోకలు చేయడం చట్టరీత్యా విరుద్ధమన్నారు. మోటార్‌ వాహనాల చట్టంలోని నిబంధనలు పాటించని ఆటో డ్రైవర్ల మీద చర్యలు ఉంటాయన్నారు. వాహనానికి రిజిస్ట్రేషన్‌ పత్రం, ఫిట్‌నెస్, పర్మిట్, బీమా, పొల్యూషన్, ఆటోడ్రైవర్‌కు బ్యాడ్జి నంబర్‌ తప్పక కలిగి ఉండాలన్నారు. తనిఖీలు మరింత ముమ్మరం చేయనున్నట్టు ప్రకటించారు.

మరిన్ని వార్తలు