కస్సు‘బస్సు’

5 Nov, 2013 00:31 IST|Sakshi

 కర్నూలు(రాజ్‌విహార్), న్యూస్‌లైన్:  ప్రయాణికులపై మరో పిడుగు పడింది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు రెండు నెలల పాటు సమ్మె చేసినందున నష్టాలు వచ్చాయనే కారణంతో రోడ్డు రవాణా సంస్థ అధికారలు చార్టీల పెంపునకు పెట్టిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. తద్వారా ముఖ్యమంత్రి  కిరణ్‌కుమార్‌రెడ్డి పేద, సామాన్య ప్రజల నడ్డి విరిచారు. పెంచిన చార్జీలతో జిల్లా ప్రజలపై ఏటా రూ.28.80కోట్లకు పైగా భారం పడనుంది. సెప్టెంబర్ 24, 2012న చార్జీలు పెంచిన సమయంలో ఏటా రూ.1.32 కోట్ల భారం పడగా.. ఈ సారి ఆ మొత్తం రూ.28.80 కోట్లకు చేరుకోవడం ప్రభుత్వం చార్జీల మోత మోగించిన తీరుకు నిదర్శనం. మంగళవారం అర్ధరాత్రి నుంచి పెంచిన చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఇంద్ర ఏసీ సర్వీసులతో పాటు సూపర్ లగ్జరీ(హైటెక్), డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు(ఆర్డీనరీ) బస్సు చార్జీలనూ పెంచేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో బస్ చార్జీలను పెంచకుండా, ఆర్టీసీ నష్టాన్ని ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవడం తెలిసిందే.


ఆయన మరణానంతరం జనవరి 6, 2010న రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రోశయ్య సర్కారు బస్ చార్జీలను పెంచేసింది. జూలై 16, 2011న, సెప్టెంబర్ 24, 2012న కిరణ్‌కుమార్‌రెడ్డి చార్జీలు పెంచారు. పల్లె వెలుగు కనీస చార్జీ పెంచకపోయినా.. ఆ తర్వాత వాతలు తప్పనట్లే. కొత్త చార్జీలు అమలైతే కర్నూలు రీజియన్‌కు అదనంగా రోజుకు దాదాపు రూ.8లక్షల ఆదాయం సమకూరనుందని డిప్యూటి చీఫ్ ట్రాఫిక్ మేనేజరు టి.వి.రామం వెల్లడించారు. హైదరాబాద్‌కు ప్రస్తుతం సూపర్ లగ్జరీ(హైటెక్) చార్జీ రూ.200 కాగా కొత్త చార్జీలతో రూ.223లకు చేరుకుంది. మూడు టోల్ ప్లాజా చార్జీలు కలిపి ఒక్కో ప్రయాణికుడు రూ.238 చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ చేసుకుంటే ఈ టిక్కెట్ చార్జీకి రూ.10 అదనంగా వసూలు చేయనున్నారు. ఇక తిరుపతిలో వెంకన్నను దర్శిం చుకోవాలంటే సూపర్ లగ్జరీ బస్సుకు రూ.400, ఇంద్రకు రూ. 499 చెల్లించాలి. ఈ లెక్కన రానుపోను రూ.1000లు లేనిది దర్శనం కష్టమే మరి.

మరిన్ని వార్తలు