ఆంటోనీ కమిటీని కలవనున్న ఆర్టీసీ ఎన్ఎంయూ నేతలు

26 Aug, 2013 11:14 IST|Sakshi

హైదరాబాద్ : ఆర్టీసీ ఎన్ఎంయూ నేతలు ఆంటోనీ కమిటీకి తమ వాదనను వినిపించేందుకు నేడు ఢిల్లీకి పయనం అయ్యారు.  రాష్ట్ర విభజన వద్దని... అలాగే రూ.5వేల కోట్ల ఆర్టీసీ అప్పులు మాఫీ చేయాలని వారు ఈ సందర్భంగా ఆంటోనీ కమిటీకి విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే సీమాంధ్ర ఆర్టీసీకి రూ.2వేల కోట్ల నిధులు మంజూరు చేయాలని ఎన్ఎంయూ నేతలు కోరనున్నారు.

విభజన సెగల దెబ్బ ఆర్టీసీని నష్టాల్లో ముంచింది. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో గత 20 రోజులుగా ఆర్టీసీకి 200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దాదాపు 120కు పైగా డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. దాదాపు 60 వేలమంది సిబ్బంది సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్నారు.

విభజనకు అనుకూలంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఉరిమి ఉరిమి మంగలం మీద పడినట్టు అంతంత మాత్రంగా నడుస్తున్న ఆర్టీసీని కృంగదీసింది. అవసరమైతే ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేసుకుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేసినా, ప్రభుత్వ రంగ సంస్థలనే ప్రైవేట్ సంస్థలకు బేరం పెట్టేస్తున్న తరుణంలో ప్రభుత్వ ఆజమాయిషీ అయ్యేపనికాదని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.


 

మరిన్ని వార్తలు