సమస్యల పరిష్కారమే లక్ష్యం

9 Apr, 2019 15:19 IST|Sakshi

నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నాను

అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా

‘సాక్షి’తో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌

సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం): పరోక్ష రాజకీయల్లో చిన్నతనం నుంచి చురుకుతనం. 17 ఏళ్లు ప్రత్యక్ష రాజకీయ అనుభవం. పదేళ్లు శాసన సభ్యునిగా పనిచేయడంతో నియోజకవర్గంపై పూర్తి అవగాహన. జనం కోసం నిలబడగలిగే సత్తా, ధైర్యం ఉన్న వ్యక్తి. ప్రతి కార్యకర్త, పార్టీ అభిమాని ఇంట్లో కష్టసుఖాల్లో తానూ ఒకరై ఉన్న వ్యక్తి ధర్మాన కృష్ణదాస్‌. ఎవరైనా దాసన్నా నాకు ఈ కష్టం వచ్చిందని అంటే వెంటనే స్పందించే గుణం ఆయనకే సొంతం. 2004లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన కృష్ణదాస్‌ వరుసగా 2009 సార్వత్రిక, 2012 ఉప ఎన్నికల్లోనూ సునాయాసంగా విజయం సాధించారు.

2014లో కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మళ్లీ ఇప్పుడు ప్రజల ముందుకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా, జగనన్నకు మంచి ఆప్తమిత్రుడిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రజలు మరోసారి అవకాశమిస్తే వారి అభిప్రాయాలు, ఆశలకు వీలుగా పనిచేస్తానని హామీ ఇస్తున్నారు. పలు దీర్ఘకాలిక సమస్యలు నరసన్నపేటను పట్టి పీడిస్తున్నాయి. వాటిని నేను ఎమ్మెల్యే అయితే అనతి కాలంలో పరిష్కారం చేయగలనని అంటున్నారు. ఎమ్మెల్యే అయితే నియోజకవర్గ అభివృద్ధికి ఏమి చేస్తారో అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

ప్రశ్న: నియోజకవర్గంలో ప్రజలతో ఎలా మమేకం అయ్యారు?
జవాబు: ప్రధానంగా నేను రైతు కుటంబానికి చెందిన వాడిని. ప్రజలు, రైతుల కష్టసుఖాలను ప్రత్యక్షంగా చూశాను. 1985లో తమ్ముడు ప్రసాదరావు ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసినçప్పటి నుంచి పరోక్షంగా రాజకీయాల్లో ఉన్నాను. 2003లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. అప్పటి నుంచి అనేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యాను. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనికి వచ్చిన తర్వాత ప్రజలతో మరింతగా మమేకం అయ్యాను. ఆయన పెట్టిన ప్రచార కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యాను.

ప్రశ్న: సాగునీటి పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు?
జవాబు: గతంలో ఓపెన్‌ హెడ్‌ చానళ్ల అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. ఈ పనులు సకాలంలో టీడీపీ ప్రభుత్వం పూర్తి చేయలేక పోయింది. ప్రస్తుతం వీటిపై దృష్టి పెట్టి ఈ పనులు పూర్తి చేయించడంతోపాటు శివారు గ్రామాలకు సాగునీరు అందించేందుకు వీలుగా మడపాం, తలతరియా, రావిపాడులతోపాటు పలుగ్రామాల్లో ఎత్తిపోతల పథకాలకు ప్రతిపాదనలు పంపి వాటిని సకాలంలో పూర్తి చేయిస్తాను.

ప్రశ్న: చెరుకు రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు?
జవాబు: అవును బాగా నష్టాలకు గురి అవుతున్నారు. వీరి కష్టాలు తీరాలంటే ఆమదాలవలసలో సహకార రంగంలో చెరుకు ఫ్యాక్టరీ  పునఃప్రారంభం కావాలి. అప్పుడే ఇక్కడి చెరుకు రైతులకు కొంత ప్రయోజనం కలుగుతుంది. చెరుకు పండించే రైతులకు ప్రత్యేక బోనస్‌ కూడా ఇప్పించాల్సిన అవసరం ఉంది. వై.ఎస్‌.జగన్‌ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన దృష్టికి చెరుకు రైతుల కష్టాలు తీసుకువెళ్లి వారికి న్యాయం జరిగేలా  చూస్తా.

ప్రశ్న: టీడీపీ పాలనలో పలు ఇబ్బందులకు గురైన బాధితులకు మీరెలా న్యాయం చేస్తారు?
జవాబు: చాలా పక్షపాతంగా వారు వ్యవహరించారు. ప్రజాస్వామ్యనికే మచ్చ తెచ్చేలా టీడీపీ పాలన సాగింది. రాజన్న రాజ్యం వచ్చిన వెంటనే ఆయన పాలనలో అందించినట్లే ప్రతి అర్హుడికీ పథకాలు అందించి ప్రజలకు న్యాయం చేస్తాం. రాజకీయ కక్షతో ఇబ్బందులకు గురైన పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాను. పేదరికమే ప్రామాణికంగా పథకాలు ప్రజలకు అందేలా చూస్తాను.

ప్రశ్న: ఎన్నికల్లో విజయం సాధించడానికి మీ వ్యూహం ఏమిటి? 
జవాబు: ప్రత్యేక వ్యూహం అంటూ ఏమీ లేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మాజీ అయినా ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉన్నా. వారి కష్టసుఖాల్లో ఒకడినయ్యాను. నేను ఎంటో అందరికీ తెలుసు. నేను ఓడిపోయిన రోజున నాకంటే నియోజకవర్గ ప్రజలే ఎక్కువ బాధపడ్డారు. ఇప్పుడు నాకంటే వారే కష్టపడుతున్నారు. అలాగే బూత్‌ కమిటీలు పటిష్టంగా ఉన్నాయి. ప్రతీ గ్రామంలో బలమైన కేడర్‌ ఉంది. వారే నాకు బలం. వారి ఆలోచనలే నా వ్యూహం.

ప్రశ్న: నిరుద్యోగ సమస్యపై మీ స్పందన?
జవాబు: ఇతర నియోజకవర్గాలతో పోల్చితే నరసన్నపేటలో విద్యావంతులు అధికంగా ఉన్నారు. నిరుద్యోగ సమస్య కూడా అధికంగానే ఉంది. నరసన్నపేటలోని నాలుగు మండలాలు వ్యవసాయకంగా ప్రధాన్యం ఉన్నవి. దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి అటు రైతులకు, ఇటు నిరుద్యోగులకు అండగా ఉండాలని భావిస్తున్నా.

ప్రశ్న: నరసన్నపేట మేజర్‌ పంచాయతీలో సమస్యలపై ఏం చేస్తారు?
జవాబు: పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య ఉంది. మురుగు కాలవులు, ఖాళీ స్థలాల్లో నీరు చేరి ఇబ్బంది పడుతున్నారు. శివారు వీధులకు రోడ్డు సమస్యలున్నాయి. వీటిని గుర్తించాను. రానున్న ఐదేళ్లో పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. పాత జాతీయ రహదారిపై సెంటర్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నా.. వ్యాపారులకు ఇబ్బంది లేకుండా నరసన్నపేట అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటా.

ప్రశ్న: నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రత్యేక సమస్యలు ఏమిటి?
జవాబు: పదేళ్లు ఎమ్మెల్యేగా, ఐదేళ్లు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక సమస్యలు తెలుసుకున్నాను. దీంట్లో ప్రధానమైనవి సాగునీరు, తాగు నీరు. వరద కట్టలు నిర్మాణం. అలాగే వంశధార నధికి ఆనుకుని ఉన్న గ్రామాలు నీటి ఉధృతికి కోతకు గురి అవుతున్నాయి. ఇవి ప్రధాన సమస్యలు. వీటి పరిష్కారానికి గతంలో నా వంతు ప్రయత్నం చేశాను. నిధులు కూడా తీసుకువచ్చాను. గడిచిన ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం వీటిని పక్కన పెట్టింది.   ఇండోర్‌ స్టేడియం ఈసారి ఎలాగైనా పూర్తి చేయాలి. 

మరిన్ని వార్తలు