అనంతపై 'సత్య' బాణం

9 Jun, 2020 07:22 IST|Sakshi

ఫ్యాక్షన్, దందాలు, అక్రమాలపై ఉక్కుపాదం 

తప్పుచేస్తే కటకటాల వెనక్కే.. 

పీడీ యాక్ట్‌లతో సంచలనం 

ఎస్పీగా సత్యయేసుబాబు బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది 

ఫ్యాక్షన్‌పై ఉక్కుపాదం... నకిలీ 
దందాలకు చెక్‌ ... మిస్టరీ కేసుల ఛేదింపు... ఏళ్లుగా పాతుకుపోయిన సిబ్బంది బదిలీ..  సవాళ్లు ఎదురైనా చట్టాల అమలు... ఖాకీల సంక్షే మానికి పెద్దపీట.. ఇలా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు జిల్లా ఎస్పీ బీ సత్యయేసుబాబు. జిల్లా ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టి నేటితో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 
– అనంతపురం క్రైం: 

9 మందిపై పీడీ యాక్ట్‌.. 
‘అనంత’ ఫ్యాక్షన్‌ ప్రభావిత ప్రాంతమనేది ఒకప్పటి మాట. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్షన్‌ను అణగదొక్కడానికి చట్టాలను పక్కాగా అమలు చేయాలని జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రభుత్వ ఆదేశాలను ఎస్పీ సత్యయేసుబాబు తూచా తప్పకుండా అమలు చేశారు. ఇందులో భాగంగానే జిల్లాలో ఫ్యాక్షన్, దందాలకు పాల్పడిన 9 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు. 539 మట్కా కేసులు నమోదు చేసి రూ.45,56,327 స్వాధీనం చేసుకున్నారు. 9485 గ్యాంబ్లింగ్‌ కేసులు నమోదు చేసి రూ.1,63,53,130 స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌లో 11 కేసులు నమోదు చేసి 51 మందిని అరెస్టు చేశారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో 1439 మందిని అరెస్టు చేశారు.అలాగే జిల్లాలో 1887 కార్డెన్, సెర్చ్‌ ఆపరేషన్లు, 5999 పల్లె నిద్రలు, 67,939 సార్లు గ్రామ పర్యటనలు, 12,379 గ్రామ సభలు, 23,327 వాహనల తనిఖీలు చేపట్టారు. 18,474 మందిని బైండోవర్‌ చేశారు. 20,257 విజుబుల్‌ పోలీసింగ్‌ నిర్వహించేలా చర్యలు చేపట్టారు.  

గ్లెన్‌ అక్రమాలకు చెక్‌.. 
గత ముప్పై ఏళ్లుగా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించడంతో పాటు ఫ్యాక్షనిస్టులను అందులో భాగస్వామ్యులను చేసుకుని అక్రమాలకు పాల్పడ్డాడు గుంతకల్లుకు చెందిన గ్లెన్‌బ్రిక్స్‌. అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలోని ఇతనిపై 15కు పైగా కేసులున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా తిరుగుతున్న గ్లెన్‌ను ఓ హత్య కేసులో అరెస్టు చేసి లోతుగా విచారణ చేయగా నకిలీ సర్టిఫికెట్ల బాగోతం వెలుగు చూసింది. ఈ ఏడాది జనవరి 2న గ్లెన్‌తో పాటు మరో ఐదుగురుని అరెస్టు చేశారు. చివరికి గ్లెన్‌పై పీడీయాక్ట్‌ నమోదు చేసి కటకటాల వెనక్కు పంపారు. చదవండి: భరత్‌ అనే నేను..

మిస్టరీల చేధింపు.. 
జిల్లాలో సంచలనం రేపిన మిస్టరీ హత్యల చేధింపునకు ఎస్పీ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా కదిరి కొర్తికోట ట్రిపుల్‌ మర్డర్‌ కేసు చేధింపు ఓ మైలురాయి అని చెప్పాలి. గతేడాది తనకల్లు మండలం కొర్తికోట శివాలయంలో గుప్తనిధుల కోసం ముగ్గురిని కిరాతకంగా చంపిన కేసు, అలాగే తాడిపత్రిలో భారీ మొత్తంలో జరిగిన బంగారం దోపిడీ కేసునూ చేధించారు. 

సంక్షేమానికి పెద్దపీట.. 
పోలీసు సంక్షేమానికి ఎస్పీ పెద్దపీట వేశారు. 55 ఏళ్లు పైబడిన వారిని కోవిడ్‌ విధుల నుంచి తొలగించారు. దాదాపుగా 450 మంది పోలీసులకు కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించడంతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది మాస్క్‌లు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు అందించారు. మృతి చెందిన 11 మంది హోంగార్డుల స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా 7551 పిటిషన్లు స్వీకరించి 6,909 కేసులను పరిష్కరించి 593 మందిపై కేసులు నమోదు చేశారు.
 
అవినీతికి పాల్పడితే వేటే.. 
లాక్‌డౌన్‌ సమయంలో ఎస్పీ దాదాపుగా ఐదుగురిపై వేటు వేశారు. హిందూపురం, గుంతకల్లులో ఏఆర్‌ కానిస్టేబుళ్లు, గుత్తిలో ఓ హెడ్‌కానిస్టేబుల్, సోమందేపల్లిలో కానిస్టేబుల్, శెట్టురులో మద్యం తరలిస్తూ పట్టుబడ్డ ఓ కానిస్టేబుల్‌పై ఎస్పీ వేటు వేశారు. ఈ నెల 7న గుత్తిలో లంచం తీసుకున్న ఓ హెడ్‌కానిస్టేబుల్‌ను జైలుకు పంపారు. 

డీజీపీ మన్ననలు.. 
రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కాంట్రాక్ట్‌ ట్రేసింగ్‌ చేసి కోవిడ్‌ నియంత్రణకు కృషి చేశారని, అందులో ఎస్పీ బీ సత్యయేసు బాబు ముఖ్య పాత్ర పోషించారని డీజీపీ గౌతం సవాంగ్‌ ఎస్పీ సత్యయేసు బాబును విలేకరుల సమావేశంలో అభినందించారు. కోవిడ్‌ నియంత్రణలో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఎస్పీ వందల సంఖ్యలో పర్యటనలు చేశారు. దాదాపుగా 15 వేల కిలోమీటర్లు ఆయన ప్రయాణం చేయడంతో ఇదే విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. 

800 మంది బదిలీ.. 
ఒకప్పుడు జిల్లా వ్యాప్తంగా మట్కా జరిగేది. దీని ద్వారా లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి. అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి, హిందూపురం కేంద్రాల్లోని మట్కా కంపెనీ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారణ చేయగా కొందరు పోలీసుల సహకారం ఉందని తేలడంతో ఏళ్లుగా పాతుకు పోయిన 800 మంది పోలీసు సిబ్బందిని బదిలీ చేశారు. అదే విధంగా గుట్కా విక్రయాలు జరగకుండా అధిక సంఖ్యలో కేసులు నమోదు చేసి జైలుకు పంపారు.  

తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించం 
‘శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టిసారించాం. ప్రజలు ప్రశాంత జీవనం సాగించడానికి నేరాలు అదుపులోకి రావడానికి చట్టాలను కఠినంగా అమలు చేశాం. కిందిస్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు అవినీతి తావు లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. ఫ్యాక్షన్, దందాలు, అక్రమాలు, మట్కా , గుట్కా నియంత్రణకు కృషి చేశాం. తప్పు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. కోవిడ్‌ నేపథ్యంలో పోలీసులు తమవంతు బాధ్యతను నిర్వర్తించేలా చర్యలు తీసుకున్నాం.  – బీ సత్యయేసుబాబు, జిల్లా ఎస్పీ 

మరిన్ని వార్తలు