విషమంగా అన్భళగన్‌ ఆరోగ్యం!

9 Jun, 2020 07:33 IST|Sakshi

సాక్షి, చెన్నై : డీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్‌ ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్‌ రేల ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ మెడికల్‌ సెంటర్‌ ప్రకటించింది. చెన్నై చేపాక్కం –ట్రిప్లికేన్‌ నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే అన్భళగన్‌. కరోనా నివారణ, సహాయక పనుల్లో ఈయన ఉరకలు తీసిన విషయం తెలిసిందే. ఈనెల రెండో తేదీన ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. పరీక్షించగా కరోనా నిర్ధారణ అయ్యింది. ఆయనకు క్రోంపేటలోని రేల ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ మెడికల్‌ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఐసీయూకు తరలించారు.

సమాచారం తెలుసుకున్న సీఎం పళనిస్వామి ఆస్పత్రి వర్గాలతో మాట్లాడారు. ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్‌ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఆ మరుసటి రోజు ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో.. అన్భళగన్‌ ఆరోగ్యం కుదట పడ్డట్టేనని సర్వత్రా భావించారు. సోమవారం రాత్రి మరోసారి ఆయన ఆరోగ్యం క్షీణించింది. 90 శాతం మేరకు వెంటిలేటర్‌ ద్వారా ఆయనకు శ్వాస అందిస్తున్నారు. ఆయనకు ఇది వరకు బీపీ, కిడ్నీ సమస్యలుండడంతో ప్రస్తుతం 24 గంటల అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆయన ఆరోగ్యం కుదుట పడేందుకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కాగా, ఆయన కుటుంబంలోని  ఐదుగురు సభ్యులు సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు