ఆశల ఉప్పుసాగు

10 Feb, 2020 08:18 IST|Sakshi

ఉప్పు ఉత్పత్తిదారుల కష్టాలను తెలుసుకుని ఆదుకున్న మహానేత వైఎస్సార్‌.

ఉప్పు సత్యాగ్రహంలో బ్రిటిష్‌ వారినే గజగజలాడించిన ఉప్పు రైతులు గత ప్రభుత్వ విధానాల వల్ల దయనీయ స్థితితో అల్లాడిపోయారు. అకాల వర్షాలు, వాతావరణంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల కారణంగా తీరంలోని ఉప్పు ఉత్పత్తిదారులు తీవ్రనష్టాలను చవిచూశారు. గత ఐదు సంవత్సరాల నుంచి పడుతున్న కష్టాల నుంచి ఇంకా కోలుకోని ఉప్పు రైతులు ఈ ఏడాది కూడా గిట్టుబాటు కాదని తెలిసినా ఉప్పు ఉత్పత్తికి సిద్ధమయ్యారు. 

సాక్షి,విడవలూరు: ఎప్పటికైనా మంచి రోజులు రాకపోతాయా అని జిల్లాలోని విడవలూరు, అల్లూరు, ముత్తుకూరు తీర ప్రాంతంలో ఉప్పు ఉత్పత్తికి సిద్ధమవుతున్న రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉప్పు ఉత్పత్తికి ఇదే అనుకూల సమయంగా భావించే రైతులు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. విడవలూరు మండలంలోని రామతీర్థం, అల్లూరు మండలంలోని ఇస్కపల్లి, గోగులపల్లి, ముత్తుకూరు మండలాల్లో సుమారు 4,000 ఎకరాల్లో సొసైటీల ద్వారా ఉప్పు ఉత్పత్తి చేస్తుంటారు. వ్యవసాయాధారిత ప్రాంతాలైన ఈ మూడు తీర ప్రాంత మండలాల్లో ఉప్పు ఉత్పత్తిది రెండో స్థానంగా నిలుస్తోంది. ప్రస్తుతం రైతులు ఉప్పు మడులను 10 అడుగుల చదరపు ఆకారంలో సిద్ధం చేసుకున్నారు. ఆ మడులలో నాణ్యమైన ఉప్పును ఉత్పత్తి చేసేందుకు ఇసుకను చల్లి మహిళా కూలీలతో మడులను తొక్కించడం జరుగుతోంది. మడులు సిద్ధం చేసిన తరువాత మోటర్ల సాయంతో నీటిని నింపి వారం తరువాత ఉప్పును బయటకు తీస్తారు.

మడులను సిద్ధం చేస్తున్న మహిళలు 

గత మూడు సంవత్సరాలుగా వాతావరణంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల కారణంగా ఉప్పు ఉత్పత్తి అంతంతమాత్రంగానే చేశారు. దీనికితోడు ఉప్పునకు గిట్టుబాటు ధర లేకపోవడంతో వారి పరిస్థితి దారుణంగా మారింది. ఉప్పు ఉత్పత్తి ఆశాజనకంగా సాగుతున్న తరుణంలో అకాల వర్షాల కారణంగా సాగు చేసిన ఉప్పు నీటిపాలయ్యేది. అప్పులు చేసి ఉత్పత్తి చేసిన ఉప్పంతా కళ్లేదుటే కొట్టుకుపోవడంతో ఆవేదన చెందారు. దీనికితోడు గత ప్రభుత్వం విధించిన అదనపు విద్యుత్‌ చార్జీలు వారి పాలిట శాపంగా మారాయి.   

ఉప్పు ఉత్పత్తి చేసే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తరుణంలో వారికి కొంత మేలు చేయాలన్న సంకల్పంతో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అప్పట్లో రైతులు చెల్లిస్తున్న విద్యుత్‌ చార్జీలను భారీగా తగ్గించారు. ఒక యూనిట్‌కు రూ.4 చెల్లిస్తున్న తరుణంలో రైతులకు ఖర్చులు భారీగా పెరిగి ఉప్పు ఉత్పత్తి చేయడం మానుకునే తరుణంలో వైఎస్సార్‌ వారి కష్టాలను తెలుసుకున్నారు. 2008వ సంవత్సరం మార్చి 23వ తేదీన ఉప్పు రైతులకు విద్యుత్‌ యూనిట్‌ రూ.4 నుంచి  కేవలం ఒక రూపాయికి తగ్గించారు. అయితే ఇది కొంత కాలమే ఉప్పు రైతులకు వరంగా మారింది. వైఎస్సార్‌ మరణాంతరం ఉప్పు రైతులను పట్టించుకునే నాథుడే కరువైనాడు. దీంతో మళ్లీ విద్యుత్‌ చార్జీలు యథావిధిగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉప్పునకు గిట్టుబాటు ధర లేని కారణంగా వైఎస్సారే బతికి ఉంటే గిట్టుబాటు ధర కలి్పంచేవారని రైతులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా తమ కష్టాలను గుర్తించి తమకు అండగా నిలవాలని ఉప్పు రైతులు కోరుతున్నారు.  

ఉప్పు రైతుల కష్టాలు తీర్చిన మహానేత 
ఉప్పు ఉత్పత్తిదారుల కష్టాలను తెలుసుకుని ఆదుకున్న మహానేత వైఎస్సార్‌. ఆయన కాలంలోనే మేమంతా ఆనందంగా ఉన్నాం. ఆయనే జీవించి ఉంటే ఉప్పునకు కూడా గిట్టుబాటు ధర కలి్పంచేవారు. ప్రస్తుతం పెరిగిన విద్యుత్‌ చార్జీలు, తగ్గిన ఉప్పు ధరలతో సతమతమవుతున్నాం.  – చెంచురత్నం, రైతు

మరిన్ని వార్తలు