తెలంగాణలోనూ ‘సమైక్య’ సభలు: అశోక్‌బాబు

14 Sep, 2013 02:19 IST|Sakshi
తెలంగాణలోనూ ‘సమైక్య’ సభలు: అశోక్‌బాబు

సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్‌కు మద్దతుగా రాష్ర్టంలోని పలు ప్రాంతాల్లో బహిరంగసభలను నిర్వహించేందుకు ఏపీఎన్జీవో నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గన్‌ఫౌంఢ్రీలోని ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అశోక్‌బాబు వివరాలను వెల్లడించారు. ఈనెల 20న విజయవాడ, 21న విశాఖపట్నం, 23న హిందూపురం, 24న కడప జిల్లాల్లో బహిరంగసభలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ బహిరంగసభ తర్వాత తెలంగాణ ప్రాంతంలోని సమైక్యవాదులు మరికొన్ని సభలు నిర్వహించాలని తమకు సూచించినట్లు చెప్పారు. ఆ మేరకు తెలంగాణ ప్రాంతంలోని పలు జిల్లాల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా పలు బహిరంగ సభలు పెట్టే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.
 
  విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం సీమాంధ్రతోపాటు తెలంగాణ జిల్లాల్లోనూ ఉందన్నారు. జోన్-1, 2 పరిధిలో వందలాది గ్రామాలు అంధకారంలో నిలిచిపోయాయని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు 72 గంటలు సమ్మె చేస్తేనే పరిస్థితి ఇలా ఉంటే నిరవధికంగా చేస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామాలు సరికాదంటూ కొందరు ప్రజాప్రతినిధులు మాట్లాడడం బాధాకరమని, కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు ప్రజా ప్రతినిధుల రాజీనామాలే సరైన మార్గమని చెప్పారు. సీమాంధ్రలోని ఎంపీలు, సీమాంధ్ర కేంద్రమంతులతో కలిసి ఢిల్లీకి వెళ్లి జాతీయ నాయకులను మరోసారి కలుస్తామని తెలిపారు. ఏపీఎన్జీవోస్ కార్యాలయానికి భద్రత కల్పిస్తామని పోలీసులు చెబుతున్నా, తమకు ఎలాంటి భద్రత అవసరం లేదని చెప్పారు.

మరిన్ని వార్తలు