ఢిల్లీకి ‘సమైక్య’ రైళ్లు

16 Feb, 2014 01:51 IST|Sakshi
ఢిల్లీకి ‘సమైక్య’ రైళ్లు

సాక్షి, నెట్‌వర్క్: తెలుగుజాతికి జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీ పాలకులకు తెలియజేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. అడ్డగోలు విభజనను వ్యతిరేకిస్తూ, యూపీఏ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టి, వారికి కనువిప్పు కలిగేలా చేసేందుకు పార్టీ శ్రేణులు ఢిల్లీకి బయలుదేరాయి. ఈ నెల 17న జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన చేపట్టనున్న ‘సమైక్య ధర్నా’కు రాష్ట్రం నుంచి రెండు ప్రత్యేక రైళ్లలో బయలుదేరి వెళ్లాయి. మొదటి రైలు శనివారం ఉదయం 10.15 గంటలకు చిత్తూరు జిల్లా రేణిగుంట నుంచి బయలుదేరింది.

 

పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామి, చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి జెండా ఊపి రైలును సాగనంపారు. ఈ రైలులో నెల్లూరు, చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లా, అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు.
 
 మొదటి రైలుకు ఇన్‌చార్జిగా వైఎస్సార్ సీపీ సేవాదళం రాష్ట్ర కన్వీనర్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రెండో రైలు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి సాయంత్రం 4.45గంటలకు బయలుదేరింది. పార్టీ మహిళా కార్యకర్తలు హారతులు పట్టగా, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి జెండా ఊపి రైలును సాగనంపారు. ఈ రైలులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. రెండో రైలుకు ఇన్‌చార్జిగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండు ప్రత్యేక రైళ్లు 36 గంటలపాటు ప్రయాణించి 17న ఢిల్లీకి చేరనున్నాయి.
 
 వైఎస్సార్ సీపీ ధర్నాకు సీమాంధ్ర విద్యార్థి జేఏసీ మద్దతు: విభజనను వ్యతిరేకిస్తూ సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన భారీ ధర్నాకు సీమాంధ్ర విద్యార్థి జేఏసీ మద్దతు ప్రకటించింది. విద్యార్థి జేఏసీ కన్వీనర్ అడారి కిశోర్ ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదలచేశారు. ఆయనతో పాటే సీమాంధ్ర మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ సైతం ధర్నాకు మద్దతు తెలిపారు.
 

మరిన్ని వార్తలు