పోలీసుల నిర్లక్ష్యానికి వృద్ధుడి బలి | Sakshi
Sakshi News home page

పోలీసుల నిర్లక్ష్యానికి వృద్ధుడి బలి

Published Sun, Feb 16 2014 1:49 AM

Rural police station in accordance with the presence of a suicide

 ఏలూరు (టూటౌన్), న్యూస్‌లైన్ : ఆస్తి విషయంలో భార్య, కుమారుడు, బంధువులు తనను వేధిస్తున్నారని.. తనను కొట్టారని.. తనకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ చుట్టూ ఐదు రోజులపాటు తిరిగిన ఓ వృద్ధుడు చివరకు ఆ స్టేషన్ ఎదుటే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉన్న దర్గా వద్ద శని వారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు విచారణలో ఎస్సై నిర్లక్ష్యమే ఆత్మహత్యకు కారణమని అతని పెద్దకుమార్తె, అల్లుడు ఆరోపిస్తున్నారు. మృతుడి పెద్ద కుమార్తె, అల్లుడు తెలిపిన వివరాల ప్రకారం..
 
 ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రుకు చెందిన జయమంగళ బంగార్రాజు (70) రైతు. అతనికి భార్య వెంకటేశ్వరమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె సీతారామలక్ష్మికి మాజీ సర్పంచ్ ఘంటసాల దుర్గరావుతో వివాహం చేశాడు. ఏడు నెలల క్రితం బంగార్రాజుకు భార్యతో విభేదాలు రావడంతో అతను పెద్దకుమార్తె ఇంటికి వెళ్లి ఉంటున్నాడు. అతనికి గల ఎకరం 60 సెంట్ల భూమిని గతంలోనే నాలుగు వాటాలు వేసి కుమారుడు, ఇద్దరు కుమార్తెలకు 40 సెంట్ల చొప్పున రాశాడు. మిగిలిన 40 సెంట్లు తన పేరున అట్టేపెట్టుకున్నాడు. ఇటీవలే అతను ఆ 40 సెంట్ల భూమిని పెద్దల్లుడు, కుమార్తె పేరిట రాశాడు. ఆ భూమిని తమకు చెప్పకుండా వారికి ఎందుకు రాశావని భార్య , కుమారుడితోపాటు బంధువులు వేధిస్తున్నారు.
 
 ఈ నేపథ్యంలో అతడిని కొట్టడంతో  ఈనెల 10న ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో బంగార్రాజు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు స్పందించ లేదు. ప్రతిరోజు అతను స్టేషన్‌కు వస్తున్నాడు. శనివారం ఉదయం కూడా స్టేషన్‌కు వచ్చాడు. స్టేషన్‌లో సిబ్బంది మొత్తం కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు పర్యటన సందర్భంగా బందోబస్తుకు వెళ్లారు. ఐదు రోజులుగా స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్నారేకానీ స్పందించటం లేదని మనస్తాపం చెం దిన బంగార్రాజు శనివారం ఉదయం సుమారు 10 గంటలకు రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న దర్గా వద్ద కూర్చుని పురుగు మందు తాగి అక్కడే పడుకుండిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే 108కి సమాచారం అందిచారు. వారు వచ్చే సరికే అతను మృతిచెందడంతో పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
 బంగార్రాజు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం : రూరల్ ఎస్సై
 బంగార్రాజు ఫిర్యాదు మేరకు శ్రీపర్రు గ్రామంలో విచారణ చేపట్టామని రూరల్ స్టేషన్ ఎస్సై జి.ఫణీంద్ర తెలిపారు. శుక్రవారం రాత్రి సీఐ ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారని చెప్పారు. బంగార్రాజు ఫిర్యాదు మేరకు అతని భార్య  వెంకటేశ్వరమ్మ, కుమారుడు దుర్గారావు, బంధువులు జయమంగళ రాంబాబు, ఆయన భార్య అంజలి, సీతారామాంజనేయులు, లక్ష్మి, మరొకరిపై కేసు నమోదు చేశామని రూరల్ సీఐ శుభాకర్ తెలిపారు. కేసు విచారణ విషయంలో ఎస్సై నిర్లక్ష్యమే బంగార్రాజు మృతికి కారణమని అతని పెద్దకుమార్తె, అల్లుడు ఆరోపిస్తున్నారు.
 

Advertisement
Advertisement