సడలని సమైక్య పోరు

2 Oct, 2013 02:08 IST|Sakshi
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: అందరిదీ ఒకటే మాటా అదే సమైక్య బాట. రాష్ట్రాన్ని విభజించవద్దంటూ సిక్కోలు జనం ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్రకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు, దీక్షలు, రహదారుల దిగ్బం ధం, వంటావార్పు, మానవహారాలు చేపట్టా రు. జేఏసీ ప్రతినిధులు కేంద్ర సహాయ మంత్రి కిల్లి కృపారాణి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి నిరసనలు తెలిపారు. జిల్లా కేంద్రలో రెవెన్యూ, గృహనిర్మాణ, జిల్లా పరిషత్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జెడ్పీ ఉద్యోగుల రిలేదీక్షా శిబిరం వద్ద దుర్గాదేవి వేషధారణలో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణను హతమారుస్తున్న బాలిక వేషధారణతో నిరసనలు తెలిపారు. అనంతరం  ప్రజలతో పోస్టుకార్డులపై సంతకాలు చేయిం చారు. న్యాయశాఖ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద రేలారే రేలా కార్యక్రమం జరిగింది. కళాకారులు సమైక్యాంధ్ర మద్దతుగా గీతాలు ఆలపించారు.
 
 =  రాజాంలో ఎన్‌జీఓ జేఏసీ దీక్షా శిబిరంలో ఎల్‌ఐసీ ఏజెంట్లు పాల్గొన్నారు. ఉపాధ్యాయ జేఏసీలో పోలీస్‌స్టేషన్ రోడ్డు పాఠశాల ఉపాధ్యాయులు కూర్చొని నిరసన తెలిపారు. టీడీపీ రిలేదీక్షా శిబిరాన్ని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కలిశెట్టి అప్పలనాయుడు ప్రారంభిం చారు. కాంగ్రెస్ రిలేదీక్షా శిబిరం కొనసాగింది. సంతకవిటిలో ఉపాధ్యాయ జేఏసీ నేతలు దీక్షలు కొనసాగించగా, ఉపాధ్యాయినులు ప్రధాన రహదారిపై సమైక్యాంధ్ర ముగ్గులు వేస్తూ నిరసన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కంబాల జోగులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.వంగరలో ఉపాధ్యాయులు రోడ్డుపై శీర్షాసనాలు వేశారు.
 
 =  పాలకొండ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి వద్ద దీక్షలు ఆరంభమై 50 రోజులు పూర్తయిన సందర్భంగా సమైక్యవాదులు రోడ్డుకు అడ్డంగా నిలబడి ట్రాఫిక్‌ను స్తంభింప చేశారు. 50 సం ఖ్యగా ఏర్పడి దీక్షా దక్షత చాటారు. ఉపాధ్యాయ ఉమ్మడి ఐక్యవేదిక వద్దని ఇంగ్లీష్ స్కూ ల్ అసిస్టెంట్లు, హిందీ పండిట్లు దీక్షలో పాల్గొన్నారు.  సీతంపేటలో  ఉద్యానవనశాఖ సిబ్బం ది దీక్ష చేపట్టారు. రోడ్లపై మొక్కలకు అంట్లు కడుతూ నిరసన తెలిపారు. వీరఘట్టం లో భవన నిర్మాణ కార్మికులు, కార్పెంటర్లు ఉపాధ్యాయ శిబిరానికి  సంఘీభావం తెలిపారు.  
 
 =  టెక్కలి రిలే దీక్షల్లో సర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. లింగాలవలస గ్రామంలో వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ సంపతిరావు రాఘవరావు, సర్పంచ్ సంపతిరావు లక్ష్మి ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టారు.
 
 =  ఆమదాలవలస పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై సమైక్యవాదులు పడుకొని నిరసనలు  తెలిపారు. ఊసావానిపేట గ్రామాస్తులు, పొదుపు సంఘాల మహిళలు, విశ్రాంత ఉద్యోగులు భారీ ర్యాలీ, మానవహారం చేపట్టారు. మున్సిపల్ ఉద్యోగులు పాత మున్సిపల్ కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్షలు కొనసాగిస్తూన్నారు. సరుబుజ్జిలిలో సాక్షరభారత్ విద్యావలంటీర్లు, మహిళలు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. పొందూరులో టీడీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. బూర్జ మండలం కొల్లివలస జంక్షన్ వద్ద ఉపాధ్యాయుల శిబిరంలో చిన్నారులు వివిధ రూపాల్లో వేషాధారణలతో ఆకట్టుకున్నారు. ఇదే జంక్షన్ వద్ద జిల్లా అదనపు కలెక్టర్‌ను ఉద్యమకారులు అడ్డుకొని నిరసనలు తెలిపారు.  
 
 = ఇచ్ఛాపురం, సోంపేట మండలాల్లో వైఎస్సార్ సీపీ నిరాహార దీక్షలు కొనసాగాయి. ఇచ్ఛాపురంలో టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఆ పార్టీ  కె.రామ్మోహననాయుడు, చౌదరి బాబ్జి, కిమిడి కళా వెంకటరావు, గౌతు శ్యాంసుందర్ శివాజి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కంచిలిలో కొరడాలతో కొట్టుకొని ఉపాధ్యాయులు వినూత్నంగా నిరసన తెలిపారు.
 
 =  నరసన్నపేటలో  ఆంధ్రా అబ్బాయి...తెలంగాణ అమ్మాయి వేషధారులకు వివాహం సమైక్యవాదులు నిరసన తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.
 
 =  పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో సమైక్యవాదులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. కాశీబుగ్గ బస్టాండ్ వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష 41వ రోజుకు చేరుకుంది. కొత్తవూరు జంక్షన్ సమీపంలో కార్మికులు రోడ్డుపై ఇటుకలు తయారు చేస్తూ నిరసన ప్రకటించారు.  గరుడుఖండిలో వైఎస్‌ఆర్ సీపీ పలాస సమన్వయకర్త వజ్జ బాబూరావు ఆధ్వర్యంలో దుస్తులను ఇస్త్రీ చేసి నిరసన తెలిపారు. మందసలో ఉపాధ్యాయుల దీక్షలు కొనసాగాయి.
 
 =  పాతపట్నంలో నీలమణి దుర్గమ్మ అమ్మవారికి వేలాది మంది మహిళలు ముర్రాటలు సమర్పించి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పూజలు చేశారు.
 
మరిన్ని వార్తలు