సమైక్య శంఖారావం సభకు తరలిరండి

22 Oct, 2013 02:14 IST|Sakshi
నెల్లూరు (దర్గామిట్ట), న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన నియోజకవర్గ  సమన్వయకర్తలు, జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఎంపీ మేకపాటి మాట్లాడుతూ శంఖారావం సభపై ప్రజల నుంచి ఇప్పటికే విశేష స్పందన లభిస్తోందన్నారు. పార్టీలకతీతంగా ప్రజలతో పాటు వివిధ సంఘాల నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు భారీగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు సభకు వచ్చేలా కృషి చేయాలని నేతలకు సూచించారు.
 
 శంఖారావం సభకు సంబంధించి తాను వైఎస్సార్, నెల్లూరు జిల్లాల బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని చెప్పారు. రాయలసీమలోని నాలుగుజిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి సభకు భారీగా జనం తరలిరానున్నారన్నారు. తెలుగు ప్రజల సమైక్యతను ఢిల్లీ పెద్దలకు చాటిచెప్పేలా సభ సాగుతుందన్నారు. రాజకీయ కారణాలతోనే రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. తెలంగాణలో 10 సీట్లు సాధించాలనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని ముక్కలు చేయడం సరికాదన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉందని, ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే ఒప్పుకునేది లేదంటూ తమ పార్టీ ఇచ్చిన లేఖలో స్పష్టం చేశామన్నారు. 
 
 రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ కాదని, ఆయన రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, పార్టీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ బండ్లమూడి అనిత, మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు కిలివేటి సంజీవయ్య, దబ్బల రాజారెడ్డి, నెలవల సుబ్రహ్మణ్యం, పాశం సునీల్‌కుమార్, డాక్టర్ బాలచెన్నయ్య, డాక్టర్ పి.అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, నాయకులు డాక్టర్ బాలకొండయ్య, గోపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
 శంఖారావం వాణిని ఢిల్లీకి వినిపించాలి
 రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న సమైక్య శంఖారావం వాణిని ఢిల్లీకి వినిపించాలని వైఎస్సార్‌సీపీ పొలిటికల్ ఎఫైర్స్‌కమిటీ సభ్యుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. నగరంలోని తన అతిథిగృహంలో సోమవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. శంఖారావం సభకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా జరిగే సభకు సమైక్యవాదులంతా తరలిరావాలన్నారు. రాష్ర్టం సమైక్యంగా ఉంటేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. వైఎస్సార్‌సీపీ తరపున విభజనపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్టు ఆయన వెల్లడించారు.
 
 రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించాలని కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. హేతుబద్ధత లేకుండా తెలుగు ప్రజలను విభజించాలనుకోవడం అన్యాయమన్నారు. కేంద్రానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని చంద్రబాబు కోరడం దారుణమన్నారు. పాలకులు కేవలం హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, మిగిలిన ప్రాంతాలపై శీతకన్ను వేశారని మేకపాటి మండిపడ్డారు. సమైక్య శంఖారావం సభను తెలంగాణవాదులు అడ్డుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలని సూచించారు. 
 
 
మరిన్ని వార్తలు