టీటీడీ ఈవోగా సాంబశివరావు

12 Dec, 2014 03:21 IST|Sakshi
టీటీడీ ఈవోగా సాంబశివరావు

ఎంజీ గోపాల్ తెలంగాణకు బదిలీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కార్యనిర్వహణ అధికారి ఎంజీ.గోపాల్‌ను ప్రభుత్వం తెలంగాణకు బదిలీ చేసింది. పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.సాంబశివరావును టీటీడీ ఈవోగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్.కృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఎంజీ.గోపాల్ టీటీడీ ఈవోగా జూలై 6, 2013న నియమితులయ్యారు. ఏడాదిన్నరపాటు ఈవోగా పనిచేసిన ఆయన టీటీడీలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు.

శ్రీవారి దర్శనంలో సమూలమైన మార్పు లుతెచ్చారు. దర్శనంలో మూడు వరుసల విధానాన్ని ప్రవేశపెట్టారు. రూ.300ల ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించే విధానానికి శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడంలో కీలకభూమిక పోషించారు. ఐఏ ఎస్‌ల విభజనలో ప్రత్యూష కమిటీ ఎంజీ.గోపాల్‌ను తెలంగాణకు కేటాయిం చింది. ఆయన్ను తెలంగాణ కేడర్‌కు కేటాయించడంతో ప్రభుత్వం బదిలీ చేసింది. గిరిధర్‌ను తెలంగాణకు కేటాయించినప్పటి నుంచి  టీటీడీ ఈవో పదవిని దక్కించుకోవడానికి పలువురు ఐఏఎస్‌లు తీవ్రంగా ప్రయత్నించారు.

సీఎంవో కార్యదర్శిగా పనిచేస్తోన్న 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎ.గిరిధర్‌ను టీటీడీ ఈవోగా నియమిస్తారని అప్పట్లో అధికారవర్గాలు వెల్లడించాయి. కానీ.. పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డి.సాంబశివరావును టీటీడీ ఈవోగా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం. 1986 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన డి.సాంబశివరావుకు సమర్థవంతమైన అధికారిగా పేరుంది. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరించే సాంబ శివరావుకు గాడితప్పిన టీటీడీని గాడిలో పెట్టే సత్తా ఉందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరిన్ని వార్తలు