బతుకుదెరువు కోసం వెళ్లి సౌదీలో మృతి | Sakshi
Sakshi News home page

బతుకుదెరువు కోసం వెళ్లి సౌదీలో మృతి

Published Fri, Dec 12 2014 3:20 AM

బతుకుదెరువు కోసం వెళ్లి సౌదీలో మృతి

ఖమ్మం : ఏళ్లతరబడి ఇంటికి దూరంగా ఉన్నా డు.. దేశంకాని దేశానికి వెళ్లి రెక్కలుముక్కలు చేసుకున్నాడు. కుటుంబాన్ని సుఖంగా ఉంచాలనే ధృడ సంకల్పంతో తన సౌఖ్యాన్ని త్యాజిం చాడు. ఒక్కగానొక్క కూతురు భవిష్యత్తు కోసం పరితపించాడు. అష్టకష్టపడి నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్న క్రమంలోనే అతడిని విధి వంచించింది. మృత్యువు రూపంలో కుటుంబం నుంచి శాశ్వతంగా దూరం చేసింది.

బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన వ్యక్తి.. మరో 15 రోజుల్లో సొంతగడ్డకు తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో గుండెపోటుతో మృతిచెందిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా దేశాయిపేట రోడ్డుకు చెందిన నసీర్‌ఖాన్(40) 18 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలోని రియాద్ నగరానికి బతుకుదెరువు కో సం వెళ్లాడు. ఖమ్మానికి చెందిన జరీనాతో పదేళ్ల క్రితం అతడికి వి వాహమైంది. వీరికి కుమార్తె అరీబా(9) ఉంది. భార్య, కూతురు ఖమ్మంలోని అ జీజ్‌గల్లీలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు.

రెండు, మూడేళ్లకోసారి నసీర్ ఖమ్మానికి వచ్చి పోతుండే వాడు. ఈనెల 23న మళ్లీ రావడానికి సిద్ధమై విమానం టిక్కెట్ రిజర్వేషన్ చేయించుకున్నాడు. ఇతర ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు. తాను వస్తున్నట్లు భార్యకు ఫోన్‌ద్వారా శుభవార్త తెలిపాడు. ఇంతలోనే అతడిని మృత్యు కబళించింది. బుధవారం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో నసీర్ ఖాన్ తుదిశ్వాస విడిచాడు. నసీర్ ఇక లేడనే దుర్వార్తను రియాద్‌లోని అతడి బంధువులు ఖమ్మంలోని భార్య జరీనా, మామ జియావుద్దీన్‌కు ఫోన్ ద్వారా తెలిపారు.

ఈ క్రమంలో మృతదేహాన్ని ఖమ్మానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు సన్నాహాలు చేస్తున్నారు. రియాద్‌లో శుక్ర, శనివారాలు సెలవు దినాలు కావడంతో ఆదివారం అక్కడి ప్రభుత్వంతో అనుమతి తీసుకుని మృతదేహాన్ని ఖమ్మం తరలించే అవకాశం ఉందని మృతుడి మామ తెలిపారు. మరికొన్ని రోజుల్లో తిరిగి వస్తాడనుకున్న నసీర్ కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ ఇంటిల్లిపాది విషాదంలో మునిగిపోయింది.

Advertisement
Advertisement