ఇసుక విక్రయాలు పునఃప్రారంభం

20 May, 2020 04:26 IST|Sakshi

ఆన్‌లైన్‌లో మొదలైన బుకింగ్స్‌  

రాష్ట్రంలో ఇసుక విక్రయాలు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో మార్చి 23 నుంచి ఇసుక సరఫరా నిలిచిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌పై సడలింపులివ్వడంతో ఏపీఎండీసీ ఇసుక ఆన్‌లైన్‌ బుకింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని డబ్బులు చెల్లించిన వారికి డోర్‌ డెలివరీ చేస్తుంది.   

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక విక్రయాలను ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) పునఃప్రారంభించింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మార్చి 23వతేదీ నుంచి ఇసుక సరఫరా నిలిచిపోయింది. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌పై సడలింపులిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఏపీఎండీసీ వెబ్‌సైట్‌ ద్వారా ఇసుక బుకింగ్‌ను తిరిగి అందుబాటులోకి తెచ్చింది. ఇసుకను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని డబ్బులు చెల్లించిన వారికి డోర్‌ డెలివరీ చేస్తుంది. 

నిల్వ పెంచేందుకు చకచకా ఏర్పాట్లు..
► వచ్చే వర్షాకాల సీజన్‌లో అవసరాల కోసం 70 లక్షల టన్నుల ఇసుకను స్టాక్‌ యార్డుల్లో నిల్వ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించగా ఏపీఎండీసీ ఇప్పటివరకు 35 లక్షల టన్నుల ఇసుకను స్టాక్‌ యార్డుల్లో నిల్వ చేసింది. 
కరోనా, లాక్‌డౌన్‌వల్ల స్టాక్‌ యార్డులకు ఇసుక తరలింపులో కొంత సమస్య ఏర్పడింది. 
► తాజాగా సడలింపుల నేపథ్యంలో ఇసుక నిల్వలను పెంచేందుకు ఏపీఎండీసీ అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు.  

1.06 కోట్ల టన్నులు సరఫరా...
ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడం, ప్రజలకు సరసమైన ధరలకు పారదర్శకంగా సరఫరా లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరు 5న కొత్త పాలసీని అమల్లోకి తెచ్చిన విషయం విదితమే. అప్పటి నుంచి మార్చి 31వతేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలకు ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ 1,06,79,907 టన్నుల ఇసుక సరఫరా చేసింది. 

మరిన్ని వార్తలు