సారా మాఫియాకు అడ్డాగా రాజమండ్రి

6 Apr, 2015 02:39 IST|Sakshi

రాజమండ్రి క్రైం : రాజమండ్రి సారా మాఫియాకు అడ్డాగా ఉందని, పుష్కరాల నాటికి ఈ ప్రాంతంలో సారాను నిర్మూలిస్తామని  ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టర్ జనరల్ ఇ.దామోదర్ అన్నారు. రాజమండ్రి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను రోజూ 13 జిల్లాల వార్తలూ చదువుతానని,  ఎక్కువగా రాజమండ్రిలో సారా వ్యాపారం గురించే వార్తలు వస్తున్నాయని, ఎక్కడాలేనంతగా ఈ నగరంలో భారీగా సారా వ్యాపారం జరుగుతోందని అంచనాకు వచ్చామని పేర్కొన్నారు.  రాజమండ్రిపై ప్రత్యేక నిఘా పెట్టామని,  ఇక్కడ మాఫియా ఉన్నట్టు గుర్తించామని పేర్కొన్నారు. నిత్యం దాడులు చేసి కేసులు పెడుతున్నా.. దీనిని అరికట్టలేకపోతున్నామని, అదుపులోకి తీసుకున్నవారిపై సక్రమంగా కేసులు పెట్టకపోవడమే దీనికి కారణమని, ఇందులో తమశాఖాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉందని పేర్కొన్నారు. తమ సిబ్బంది మామూళ్లకు కక్కుర్తిపడి బడా తయారీదారులను వదిలేస్తున్నట్టు కూడా తమ వద్ద సమాచారం ఉందన్నారు.  
 
 500 మందితో 20 బృందాలు
 ఈ నెల 3న జిల్లాకు వచ్చిన తాను మూడు రోజుల పాటు పర్యవేక్షించి.. ఈ ప్రాంతంలో సారా ఎక్కడ నుంచి వస్తుంది... ఏ విధానంలో  అమ్మకందారులకు చేరుతోందన్న అంశాలను పరిశీలించినట్టు చెప్పారు. దీనికోసం అంకితభావంతో పనిచేసే ఇద్దరు కానిస్టేబుళ్లు ఇచ్చిన వివరాల ఆధారంగా  ఆదివారం తెల్లవారు జామున రాజమండ్రి ఎక్సైజ్ డివిజన్ పరిధిలో దాడులు చేశామని, దీని కోసం పశ్చిమ గోదావరి జిల్లా, విశాఖ జిల్లాల ఎక్సైజ్ సిబ్బందిని రప్పించామని పేర్కొన్నారు. అలాగే పోలీసు, ఇంటిలిజెన్స్ సహకారం కూడా తీసుకున్నట్టు వివరించారు. మొత్తం 500 మందితో 25 మంది చొప్పు 20 బృందాలుగా విడిపోయి డివిజన్ పరిధిలోని 25 ప్రధాన ప్రాంతాల్లో దాడులు చేసినట్టు వెల్లడించారు.
 
  30 మందిని అరెస్టు చేసి, 9 వాహనాలు, 552 లీటర్ల నాటు సారా, 70 కిలోల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నామని, 5,500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామని తెలిపారు. 40 మంది పరారీలో ఉన్నారని చెప్పారు. ఇందుకు తమ సిబ్బందే కారణమని, తాము దాడులకు వస్తున్నట్టు తమ సిబ్బంది మాఫియా లీడర్లకు ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చారని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, వారి ఫోన్ నంబర్ల డేటా ఆధారంగా సిబ్బందిపై చర్యలుంటాయని హెచ్చరించారు. రాజమండ్రిలో గతంలో సారా మాఫియా కోటిలింగాలపేటలో ఇద్దరు కానిస్టేబుళ్లను చంపిన కేసు నీరు గారిపోవడానికి, అలాగే ఒక ఎక్సైజ్ సూపరింటెండెంట్‌పై ఒక మహిళ ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టేందుకు కూడా తమ శాఖలోని సిబ్బందే సహకరించారని గుర్తుచేశారు.
 
 పుష్కరమ్ స్పెషల్ ఆఫీసర్స్ గ్రూప్
 పుష్కరాల నాటికి సారాను సమూలంగా నిర్మూలించేందుకు ‘పుష్కరమ్ స్పెషల్ ఆఫీసర్స్ గ్రూప్’ను సిద్ధం చేస్తున్నట్టు దామోదర్ తెలిపారు. ఈ గ్రూప్‌లో ఎవరు ఉండాలనే విషయంపై జాబితా తయారు చేస్తున్నట్టు వెల్లడించారు. సారా నిర్మూలించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ,  కలెక్టర్, ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించినట్టు వివరించారు.
 
 చైన్ లింక్‌డ్ కేసులు
 సారా కేసుల నమోదులో ఇకపై భిన్నంగా వ్యవహరించనున్నట్టు వివరించారు. గ్రామాల్లో విక్రయదారులు, వారికి రవాణా చేసేవారు, తయారీదారులు, ముడిసరకు విక్రయించే వారందరిపైనా  లింక్ కేసులు నమోదు చేస్తామన్నారు. కేసుల నమోదులో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. కేసులు ఎలా పెట్టాలో తమ సిబ్బందికి హైదరాబాద్‌లో రెండు వారాలపాటు శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఇక సారా మహమ్మారి గురించి అవగాహన కల్పించడంతోపాటు రిహాబిటేషన్ ప్యాకేజీలు ప్రకటించనున్నట్టు తెలిపారు. ఇదంతా కేవలం ఆరంభం మాత్రమేనన్నారు. అనంతరం తనకు సహకరించిన జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డి, లా అండ్ ఆర్డర్ మధ్య మండల డీఎస్పీ జె. కులశేఖర్‌ను అభినందించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ.అనిల్‌కుమార్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు