సర్వేపల్లి.. విలక్షణం!

25 Mar, 2019 14:28 IST|Sakshi

విజ్ఞులైన ఓటర్ల తీర్పే కీలకం

అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుసార్లు కాంగ్రెస్‌ పార్టీ గెలుపు

రాజకీయ చైతన్యానికి సర్వేపల్లి నియోజకవర్గం పెట్టింది పేరు. విజ్ఞులైన ఓటర్లు ప్రతి ఎన్నికల్లో విలక్షణమైన తీర్పునిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కృష్ణపట్నం ఓడరేవు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యుత్‌ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి ప్రత్యేకత సంతరించుకున్న నియోజకవర్గంలో వచ్చే నెల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారోనని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సాక్షి, ముత్తుకూరు: తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే సర్వేపల్లి నియోజకవర్గం(జనరల్‌)లో ఐదు మండలాలున్నాయి. మొదటిసారిగా 1955 సంవత్సరంలో సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి బెజవాడ గోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 14 సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. నాలుగుసార్లు టీడీపీ, ఒకసారి కమ్యూనిస్టుపార్టీ, ఒకసారి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందారు. ముగ్గురు అభ్యర్థులు మాత్రం రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కొత్త సెంటుమెంటు సృష్టించారు. సర్వేపల్లి నుంచి పోటీ చేసిన అభ్యర్థుల వివరాలిలా ఉన్నాయి.


1967లో ఎస్సీ రిజర్వ్‌డ్‌
డాక్టర్‌ బెజవాడ గోపాల్‌రెడ్డి 1955 ఎన్నికల్లో ఆత్మకూరు, సర్వేపల్లి నుంచి పోటీ చేసి, గెలుపొందారు. అనంతరం సర్వేపల్లికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో జరిగిన ఉప ఎన్నికల్లో మంత్రి సోమిరెడ్డి పెద్దనాన్న సోమిరెడ్డి ఆదినారాయణరెడ్డిపై తోటపల్లిగూడూరుకు చెందిన వంగల్లు కోదండరామరెడ్డి ఏడు వేల ఓట్ల మెజారీతో గెలుపొందారు. 1962 ఎన్నికల్లో తోటపల్లిగూడూరు మండలంలోని పాపిరెడ్డిపాళేనికి చెందిన వేమారెడ్డి వెంకురెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సిటింగ్‌ ఎమ్మెల్యే కోదండరామరెడ్డిపై 86 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంతకుముందు ఈయన నరుకూరు గ్రామానికి మునసబుగా పనిచేశారు. 1967లో సర్వేపల్లి ఎస్సీలకు రిజర్వ్‌ అయ్యింది. ఇందుకూరుపేట మండలంలోని పల్లెపాడు గ్రామానికి చెందిన స్వర్ణా వేమయ్య కమ్యూనిస్టు యోధుడైన పుచ్చలపల్లి సుందరయ్యకు సన్నిహితుడు. కీలక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన వేమయ్య ఇండిపెండెంట్‌ అభ్యర్థి జోగి శంకరరావుపై 266 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1972 ఎన్నికల్లో అల్లూరు మండలం ఇస్కపల్లికి చెందిన మంగళగిరి నానాదాసు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. 23 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో స్వర్ణా వేమయ్యపై గెలుపొందారు.


ఉద్దండులపై సీవీ శేషారెడ్డి విజయం
1978లో సామాన్య రైతు కుటుంబం నుంచి చిత్తూరు వెంకటశేషారెడ్డి రంగంలోకి దిగారు. మడమనూరు, పంటపాళెం సర్పంచ్‌గా పనిచేశారు. ఈయన ఇందిరా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. రాజకీయ గురువైన ఆనం భక్తవత్సలరెడ్డి, ఉద్దండుడైన గునుపాటి రామచంద్రారెడ్డితో తలపడ్డారు. 21,962 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1983లో రాష్ట్రమంతటా ఎన్టీయార్‌ ప్రభంజనం రాజ్యమేలింది. తోటపల్లిగూడూరు మండలంలోని రావూరువారికండ్రిగకు చెందిన న్యాయవాది చెన్నారెడ్డి పెంచలరెడ్డి టీడీపీ అభ్యర్థిగా సర్వేపల్లి బరిలో నిలిచారు. 15,277 ఓట్ల మెజార్టీతో సీవీ శేషారెడ్డిపై విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో ముత్తుకూరుకు చెందిన వ్యవసాయ పట్టభద్రుడు ఈదూరు రామకృష్ణారెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి, కాంగ్రెస్‌ అభ్యర్థి కోటంరెడ్డి విజయకుమార్‌రెడ్డిపై 21,566 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1989 ఎన్నికల్లో ఆయన తిరిగి పోటీ చేయలేదు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన సీవీ శేషారెడ్డి టీడీపీ అభ్యర్థి పూండ్ల దశరథరామిరెడ్డిపై 13,148 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రభుత్వ విప్‌ పదవి చేపట్టి సర్వేపల్లిలో అభివృద్ధి పనులు పరుగులు తీయించారు. అల్లీపురానికి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సారా వ్యతిరేక ఉద్యమం ద్వారా సర్వేపల్లిలోకి ప్రవేశించారు. 1994 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి సీవీ శేషారెడ్డిపై సోమిరెడ్డి 33,775 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో కూడా సోమిరెడ్డి రెండోసారి సీవీ శేషారెడ్డిపై పోటీ చేసి, 16,902 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆదాల ప్రభాకరరెడ్డి 2004లో సోమిరెడ్డి దూకుడుకు కళ్లెం వేశారు. 2004 ఎన్నికల్లో సోమిరెడ్డిపై 7,599 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

మూడుసార్లు ఓడిన సోమిరెడ్డి

2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి రెండో సారి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డిపై 10,256 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నెల్లూరు జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి సర్వేపల్లి బరిలోకి దిగారు. పొదలకూరు మండలంలోని తోడేరు గ్రామానికి చెందిన గోవర్ధన్‌రెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసి, సోమిరెడ్డిపై 5,451 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తొలిసారిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. సర్వేపల్లిలో వరుసగా మూడు సార్లు పరాజయం పాలైన సోమిరెడ్డి టీడీపీ పాలనలో ఎమ్మెల్సీ పదవి చేజిక్కించుకున్నారు. దీని ద్వారా వ్యవసాయ మంత్రి పదవి పొందారు. నాల్గోసారి టీడీపీ అభ్యర్థిగా 2019 ఎన్నికల బరిలో నిలిచారు. వైఎస్సార్‌సీపీ తరపున రెండోసారి పోటీలో నిలి చిన కాకాణి గోవర్ధన్‌రెడ్డితో తలపడుతున్నారు.


వైఎస్సార్‌సీపీలో నూతనోత్సాహం

ప్రజా సంకల్ప యాత్ర ద్వారా సుదీర్ఘ పాదయాత్ర సాగించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పెరిగిన ప్రజాభిమానం,  చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనతో మూటకట్టుకున్న టీడీపీ అప్రతిష్ట వల్ల సర్వత్రా ఫ్యాన్‌ హవా కొనసాగుతోంది. నియోజకవర్గంలోని పొదలకూరులో పాదయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలకమైన సమస్యలు ప్రస్తావించారు. నిమ్మ రైతులు, ఆక్వా రైతులు, ప్రాజెక్ట్‌ల్లో స్థానికులకు ఉద్యోగాలపై ఇచ్చిన వాగ్దానాలు, వేట విరామంలో మత్స్యకారులకు పెంచిన పరిహారం మొత్తం, ముత్తుకూరు మండలంలోని ప్రాజెక్ట్‌ల ప్రభావిత గ్రామాలకు మత్స్యకారేతర ప్యాకేజీ పంపిణీ హామీ ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించింది. వైఎస్సార్‌సీపీలో నూతనోత్సాహం నింపింది. నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు అధికశాతం మంది టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరడం ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కలిసొచ్చింది. దీనికి తోడు సర్వేపల్లిలో మంత్రి హోదాలో సోమిరెడ్డి ముఖ్యమైన సమస్యలు పరిష్కరించలేకపోవడంతో ఆయనపై తీవ్ర అసంతృప్తి నెలకొందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు..

సర్వేపల్లి నియోజకవర్గం


మండలాలు : ముత్తుకూరు, పొదలకూరు, 


వెంకటాచలం, మనుబోలు, తోటపల్లిగూడూరు

పోలింగ్‌ కేంద్రాల సంఖ్య:     282 

మొత్తం పంచాయతీలు 116
మొత్తం ఓటర్లు  2,18,120
పురుషులు  1,07,258
మహిళలు  1,10,846


 

         

మరిన్ని వార్తలు