ప్రియాంక గంగా యాత్రపై విమర్శలు చేసిన గడ్కరీ

25 Mar, 2019 14:36 IST|Sakshi

ముంబై : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా(యూపీ తూర్పు విభాగం) బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఆమె విమర్శలను బీజేపీ కూడా అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ప్రియాంక గంగా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర యూపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని ప్రశ్నించగా.. ఆయన ఎలాంటి ప్రభావం ఉండబోదన్నారు. అలానే బీజేపీపై ప్రియాంక ప్రభావం గురించి ప్రశ్నించగా.. ఆమె కాంగ్రెస్ తరఫున ప్రచరం చేయడం వల్ల మా పార్టీకి ఎటువంటి నష్టం జరగదని చెప్పుకొచ్చారు.

అంతేకాక ‘ఒక వేళ నేను గనక అలహాబాద్‌ - వారణాశిల మధ్య వాటర్‌ వే మార్గాన్ని పూర్తి చేయకపోతే.. ఈ రోజు ఆమె ఈ గంగాయాత్ర చేయగలిగేదా. ప్రియాంక గంగా జలాన్ని కూడా తాగారు. అదే ఒక వేళ యూపీఏ హాయాంలో ఆమె గంగా నదిలో పర్యటిస్తే.. ఆ నీటిని తాగగలిగే వారా? ప్రస్తుతం మా ప్రభుత్వం గంగా నదిని శుద్ది చేసే కార్యక్రమాన్ని పార్రంభించింది. 2020 నాటికి గంగా నది నూటికి నూరు శాతం స్వచ్ఛంగా మారుతుంద’ని గడ్కరీ తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక ఇటీవల ప్రయాగ్‌రాజ్‌ నుంచి వారణాశిలోని అస్సీ ఘాట్‌ వరకు గంగా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ప్రియాంక ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక పూజలు చేసి గంగా నదికి హారతి ఇచ్చారు. అనంతరం గంగా జలాన్ని తాగారు.

మరిన్ని వార్తలు