సతివాడ పోస్టాఫీస్‌లో నిధులు మాయం

11 Sep, 2015 01:12 IST|Sakshi

 శ్రీకాకుళం అర్బన్/గార:గార మండలం సతివాడ తపాలా శాఖలో ఉపాధి నిధులు భారీగా మాయమయ్యాయి. ఇక్కడి పోస్టుమాస్టర్ తాళ్ల నారాయణరావు గత ఏడాది జనవరి నుంచి జరుపుతున్న  లావాదేవీల్లో పెద్ద ఎత్తున నిధులు పక్కత్రోవ పట్టించడంతో గార అధికారులు గుర్తించారు. బుధవారం రూ. 2లక్షలు నగదు డ్రాచేయడంతో అనుమానం వచ్చి పరిశీలించిన గార పోస్టల్ బ్రాంచి అధికారి ఆర్.ఎస్.ఎస్.ఎస్.శకుంతల ఉన్నతాధికారికి పిర్యాదు చేయడంతో ఈ బండారం బయటపడింది. దీంతో గురువారం ఉదయం సతివాడ కార్యాలయంలో రికార్డులను సీజ్ చేయడంతో పాటు పోస్టుమాస్టర్ నారాయణరావును శాఖాపరమైన విచారణ కోసం జిల్లా కేంద్రానికి తీసుకువెళ్లారు.
 
 ఉపాధి నిధుల లావాదేవీలు
 గతేడాది జనవరి నుంచి ఈ పోస్టాఫీస్ పరిధిలోని సతివాడ, నిజామాబాద్ పంచాయతీల్లో ఉపాధి పనులు ఊపందుకోవడం, ఉపాధి కూలీల వేతనం చెల్లింపుల కోసం పోస్టుమాస్టర్ నారాయణరావు లక్షలాది రూపాయలు తెచ్చి, మిగులు లెక్కలను కేవలం కాగితంపై చూపిస్తుండేవారు. ఆ మొత్తాలనూ జమచేయకపోవడాన్ని ఆలస్యంగా అధికారులు గుర్తించారు. ఆ నిధులు నారాయణరావు రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో పెట్టినట్టు తెలుస్తోంది. గతేడాది సతివాడతో పాటు మండంలోనూ, జిల్లాలోనూ పలుచోట్ల భాగస్వామ్యులతో కొన్ని చోట్ల స్ధలాలు కొనుగోలు చేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. బుధవారం డ్రాచేసిన రూ. 2 లక్షల్లో మిగులు కింద లక్షా 20 వేలను గుర్తించారు. ఒక్కరోజులోనే ఇంతమేర బయటపడితే 18 నెలలుగా డ్రా చేసిన నగదులో ఎంతమేర గోల్‌మాల్ జరిగిందోనని ఉన్నతాధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మండల ఉపాధి ప్రాజెక్టు అధికారి ఆర్.సత్యవతి వద్ద ప్రస్తావించగా నిజామాబాద్ పంచాయతీలో రూ.లక్షా 50 వేలు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.15వేలే పంచి వెళ్లినట్టు తెలిసిందనీ, దీనిపై వివరణ అడిగామని తెలిపారు.
 
 ఇప్పటికి గుర్తించింది రూ. 1.20లక్షలు:
 జిల్లా తపాలా శాఖ సూపరింటెండెంట్ జనపాల ప్రసాద్‌బాబు గురువారం  సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటివరకు సతివాడ తపాలాశాఖలో జరిగిన విచారణలో రూ. లక్షా 20 వేలు గోల్‌మాల్ జరిగినట్లు గుర్తించామని తెలిపారు. రికార్డుల పరిశీలనతో పాటు విచారణ వేగవంతం చేశామని, శుక్రవారం సాయంత్రానికి పూర్తివివరాలు అందజేస్తామని తెలిపారు. విచారణ కోసం తపాలాశాఖ ఇన్‌స్పెక్టర్‌లు గౌరీశంకర్, ఎల్.ఎస్.కళ్యాణ్‌లను పంపించామన్నారు. గురువారం ఉదయం తాను కూడా వెళ్ళి పరిశీలించాననీ, సతివాడ తపాలాశాఖకు రెండు మిషన్లు ఉండగా ఒక దాంట్లో రూ. 12,237, రెండో దాంట్లో రూ. 18,080 నిధులు కూలీలకు చెల్లించారన్నారు. అంకెల్లో భారీగా తారుమారు  చే సి నగదును స్వాహాచేసినట్లు పోర్టల్ ద్వారా గుర్తించామన్నారు. ఎంత మేర నిధులు దుర్వినియోగం జరిగిందో పూర్తిస్థాయి నివేదిక రాకుండా చెప్పలేమని, శుక్రవారం సాయంత్రానికి పూర్తిస్థాయిలో నివేదిక రావచ్చని తెలిపారు. 1984 నవంబర్‌లో నారాయణరావు చేరారనీ, అప్పటి నుంచి ఇప్పటి వరకూ అతని హయాంలో రికార్డులు పరిశీలిస్తామని వివరించారు.
 

మరిన్ని వార్తలు