పక్క జిల్లాకూ పాకిన టీడీపీ జగడం

9 Mar, 2014 03:28 IST|Sakshi
పక్క జిల్లాకూ పాకిన టీడీపీ జగడం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :జిల్లాలో కింజరాపు, కళా వర్గాల ఆధిపత్య పోరు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శత్రుచర్ల విజయరామరాజుకు కలసివచ్చింది. తన రాజకీయ పూర్వవైభవానికి అడ్డంకిగా మారిన కింజరాపు కుటుంబానికి చెక్ పెట్టాలని భావిస్తున్న కళా వెంకట్రావు కన్ను శత్రుచర్ల మీద పడింది. పాతపట్నం టీడీపీ టిక్కెట్టును ఆశిస్తున్న శత్రుచర్లకు ఆయన తెరవెనుక మద్దతు అందించారు. దీనికి కారణం తన మద్దతుతో నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమితుడైన సుధాకర్ అంతగా రాణించలేకపోవటమే. ఈ వైఫల్యం సాకుతో సుధాకర్‌ను తప్పించేందుకు కింజరాపు వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో కళా వెంకట్రావు శత్రుచర్లను తెరపైకి తెచ్చారు. వీరిద్దరి మధ్య గతంలో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. 1998లో అప్పటి పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎంపీగా శత్రుచర్ల గెలవడానికి కళానే సహకరించారు. ప్రస్తుతం కూడా శత్రుచర్ల ద్వారా పాతపట్నంలో ఆధిపత్యం సాధించి.. ఏకంగా శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో కింజరాపు వర్గానికి చెక్ పెట్టాలని వ్యూహం పన్నారు. అందుకే పార్టీ అధినేత చంద్రబాబు వద్ద శత్రుచర్లకు మద్దతుగా పావులు కదిపారు. అసలే పాతపట్నంలో సరైన అభ్యర్థి లేక సతమతమవుతున్న చంద్రబాబు కూడా వెంటనే కళా ప్రతిపాదనకు సమ్మతించేశారు.
కింజరాపు 
 
స్థానిక నినాదం
పాతపట్నంలో శత్రుచర్ల రాకను అడ్డుకోవడానికి కింజరాపు వర్గం వెం టనే రంగంలోకి దిగింది. స్థానిక నినాదాన్ని లేవనెత్తి శత్రుచర్లకు వ్యతిరేకంగా సంతకాల సేకరణకు చేపట్టింది. గత ఐదేళ్లుగా శత్రుచర్ల తమ కార్యకర్తలను ఎంతగా వేధించిందీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు పార్టీ అధినేతకు సోదాహరణంగా వివరించారు. కానీ చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. శత్రుచర్లే పాతపట్నం అభ్యర్థని తేల్చేశారు. దాంతో నీరుగారిపోయిన కింజరాపు కుటుంబానికి పొరుగు జిల్లా టీడీపీ కీలక నేత అశోక్‌గజపతి అనూహ్యంగా సహాయ    హస్తం అందించారు.
 
శత్రుచర్ల వద్దే..వద్దు 
శత్రుచర్ల విజయరామరాజును పార్టీలో చేర్చుకోవాలన్న ప్రతిపాదనను అశోక్‌గజపతిరాజు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇందుకు శత్రుచర్ల స్వస్థలమైన విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ రాజకీయాలే ప్రధాన కారణం. శత్రుచర్ల తనకు పాతపట్నం టిక్కెట్టు ఇవ్వమని చెప్పడంతోపాటు తన మేనల్లుడు, కురుపాం సిట్టింగ్ ఎమ్మెల్యే జనార్ధన్ థాట్రాజ్‌ను అక్కడి అభ్యర్థిగా ఖరారు చేయాలని పట్టుబడుతున్నారు. కానీ కురుపాంకు చెందిన కేంద్రమంత్రి, అరకు ఎంపీ వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్‌తో అశోక్‌గజపతి కుటుంబానికి సమీప బంధుత్వం ఉంది. శత్రుచర్ల టీడీపీలో చేరితే కిశోర్ చంద్రదేవ్‌కు రాజకీయంగా ఇబ్బంది. అక్కడ ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న నిమ్మక జయరాజ్ కేంద్రమంత్రి కిశోర్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే ఓటు జయరాజ్‌కు, ఎంపీ ఓటు కిశోర్‌కు అన్న ఒప్పందం ప్రకారం టీడీపీ, కాంగ్రెస్ రాజకీయాలు సాగుతున్నాయి. ఈ తరుణంలో శత్రుచర్ల మేనల్లుడు జనార్దన్ థాట్రాజ్ కురుపాం టీడీపీ అభ్యర్థి అయితే ఈ తెరచాటు రాజకీయాలకు కాలం చెల్లుతుంది. దీంతో కేంద్ర మంత్రి కిశోర్ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే ఆదిలోనే శత్రుచర్లను టీడీపీలోకి రాకుండా అడ్డుకోవాలని అశోక్‌గజపతి అడ్డుచక్రం వేస్తున్నారు. అశోక్ ఉద్దేశం ఏమైనప్పటికీ ఆయన వ్యూహం మాత్రం జిల్లాలో కింజరాపు శిబిరానికి కలసివచ్చింది. అశోక్ అండతో పాతపట్నం టిక్కెట్లు శత్రుచర్లకు దక్కకుండా చేయాలని, అనూహ్యంగా అందివచ్చిన అవకాశాన్ని అనుకూలంగా మలచుకోవాలని రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడు భావిస్తున్నారు. దీనిపై కళా, శత్రుచర్ల వర్గాలు మండిపడుతున్నాయి. ఈ పరిణామాలతో శత్రుచర్ల చేరిక వ్యవహారం ఏకంగా రెండు జిల్లాల టీడీపీ కీలక నేతల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. దాంతో పార్టీలో విభేదాల పీటముడి మరింతగా బిగుసుకుంటోంది.
 
మరిన్ని వార్తలు