కోర్టులు తప్ప మమ్మల్నెవరూ ఆదేశించలేరు!: రమాకాంత్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

కోర్టులు తప్ప మమ్మల్నెవరూ ఆదేశించలేరు!: రమాకాంత్‌రెడ్డి

Published Sun, Mar 9 2014 3:30 AM

కోర్టులు తప్ప మమ్మల్నెవరూ ఆదేశించలేరు!: రమాకాంత్‌రెడ్డి

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి
స్థానిక ఎన్నికల జాప్యానికి బాధ్యులెవరు?
పలుమార్లు అడిగినా సర్కారు పంచాయతీ రిజర్వేషన్లు ఇవ్వలేదు
ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి మేలో ఎన్నికలంటే చట్టం అంగీకరించదు

 
 సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నిర్వహణ విషయంలో న్యాయస్థానాలు మినహా తమను ఎవరూ ఆదేశించలేరని, కోర్టుల ఆదేశాలు మాత్రమే తాము పాటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ అని.. కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాజ్యాంగం వేర్వేరుగా అధికారాలు కల్పించిందని పేర్కొన్నారు. ఆయన శనివారమిక్కడ ‘సాక్షి’తో మాట్లాడారు. సాధారణ ఎన్నికల ముందు స్థానిక సంస్థల ఎన్నికలు రావడం రాజకీయ పార్టీలకు ఇబ్బంది కలిగించే అంశమే అయినా.. అందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు.
 
  పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రిజర్వేషన్లు ఇవ్వాలని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినప్పటికీ, స్పందించలేదని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ముగిసి ఎనిమిది నెలలవుతున్న విషయాన్ని  ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం (కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు) చేసిన తప్పిదం వల్లే ఇప్పుడు గందరగోళ పరిస్థితుల మధ్య ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.  ఒకేసారి నాలుగు ఎన్నికలు నిర్వహించడం అంటే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, కమిషనర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది, పంచాయతీ అధికారులు, పోలింగ్ సిబ్బందితోపాటు ఓటర్లు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందనే విషయం తమకు కూడా తెలుసన్నారు. కానీ ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వమే కదా అని వ్యాఖ్యానించారు.
 
 అందుకు చట్టం ఒప్పుకోదు..
 పంచాయతీ సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి మేలో ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయని, అలాగే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారని, కానీ ఇందుకు చట్టం ఒప్పుకోదని రమాకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నాలుగు నుంచి పది రోజుల్లోగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావాలన్నారు. ఆ తర్వాత మూడు రోజులపాటు నామినేషన్ల ఉపసంహరణ, ప్రచారానికి వారం రోజులు గడువు, పోలింగ్, ఓట్ల లెక్కింపు, పరోక్ష పద్ధతిలో చైర్‌పర్సన్‌ల ఎన్నిక కార్యక్రమాలన్నింటినీ నోటిఫికేషన్‌లోనే ఏయే సమయంలో ఏమేమి చేయాలన్న తేదీలతో సహా ప్రకటించాల్సి ఉంటుందని చెప్పారు. ఒకసారి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక ఫలితాలు నిలుపుదల చేయడానికి కూడా వీల్లేదన్నారు. ఎన్నికల ఫలితాలు ఆపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తమను ఆదేశించడం లేదా సూచించడానికీ వీల్లేదని స్పష్టం చేశారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమకు అలాంటి ఆదేశాలు ఇవ్వలేవని పేర్కొన్నారు. కేవలం న్యాయస్థానాలకు మాత్రమే తమను ఆదేశించడానికి అధికారం ఉందని వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికలను 28 రాష్ట్రాల్లో నిర్వహిస్తుందని.. ఒక్కో రాష్ట్రానికి ఒక్కోసారి నోటిఫికేషన్ జారీ చేస్తుందని, కానీ తమకు అలాంటి పరిస్థితి ఉండదన్నారు. రాష్ట్రం మొత్తానికి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement