విద్యార్థులతో ఆటలా

29 Aug, 2018 11:51 IST|Sakshi
పలమనేరు: గ్రామంలోని చెరువులో ఆటలాడుతున్న పెంగరగుంట, సముద్రపల్లె విద్యార్థులు

స్కూళ్లకు ఆటవస్తువులు కరువు

వ్యాయమ ఉపాధ్యాయుల కొరత

ఆటలకు నోచుకోని     విద్యార్థులు

అవకాశాలు కోల్పోతున్న     జిల్లా క్రీడాకారులు

పట్టించుకోని ప్రభుత్వం,     జిల్లా యంత్రాంగం

నేడు జాతీయ క్రీడా దినోత్సవం

ఆరోగ్యకరమైన దేశం కావాలంటే యువకులు, విద్యార్థులు క్రీడలపై దృష్టి సారించాల ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిస్తున్నా ఆ దిశగా క్రీడాభివృద్ధి కోసం ఆశించిన స్థాయిలో నిధులను మంజూరు చేయకపోవడం శాపంగా పరిణమించింది. ఫలితంగా     క్రీడల్లో ఆసక్తి ఉన్నా మౌలిక వసతులు లేని మైదానాలు, తగిన ప్రోత్సాహం, శిక్షణ లేక ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలల విద్యార్థులు ఆటలకు దూరమవుతున్నారు. పదో తరగతి వరకు కాస్తోకూస్తో నేర్చుకున్న ఆటలకు ఇంటర్మీడియెట్‌కు వచ్చేసరికి గుడ్‌బై చెప్పాల్సి వస్తోంది. జూనియర్‌ కళాశాలల్లో పీఈటీలు, పీడీలను ప్రభుత్వం నియమించకపోవడం, వివిధ ఆట వస్తువులు లేకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. క్రీడలను అభివృద్ధి చేస్తామని, క్రీడాకారులను ప్రోత్సహిస్తామని ప్రభుత్వం చెబుతున్నా దానికనుగుణంగా ప్రణాళికల రూపకల్పన చేయడం లేదనే విమర్శలొస్తున్నాయి. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా క్రీడల పరిస్థితిపై సాక్షి ప్రత్యేక కథనం.

చిత్తూరు ఎడ్యుకేషన్‌: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో క్రీడల అభివృద్ధికి 2015–16లో రూ.60 లక్షలు మంజూరు చేసింది. ఈ అరకొర నిధులు క్రీడల అభివృద్ధి ఏమాత్రం సరిపోతాయో ముఖ్యమంత్రికే ఎరుక. ఒక క్రీడలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరచి జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికైన జట్టుకు క్రీడాదుస్తులు, రవాణా చార్జీలు మొదలైనవి కలిపి  రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. జిల్లా పరిధిలో క్రీడాపోటీల నిర్వహణకు రూ. 2.50 లక్షల వరకు, అధికారిక ఖర్చులు, మరో రూ. 50 వేలు మొత్తం కలిపి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే జట్లను ఎంపిక చేసేందుకు రూ. 3 లక్షల వరకు వెచ్చించాలి. వీటిని నిధుల వ్యయం భారమనే భావనతో ప్రభుత్వం క్రీడాపోటీల నిర్వహణ జోలికి వెళ్లడం లేదు. గత నాలుగేళ్లలో ఇప్పటివరకు రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ సాయంతో రాజీవగాంధీ ఖేల్‌ అభియాన్, ఖేలో ఇండియా  పోటీలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించిన పోటీలంటూ లేకపోవడం గమనార్హం! క్రీడలు అభివృద్ధి చెందాలంటే  గ్రామీణ స్థాయిలో క్రీడా మైదానాలు లేవు. ఇక, జిల్లా క్రీడామైదానంలో క్రీడలకు కోచింగ్‌ ఇవ్వడానికి రెగ్యులర్‌ కోచ్‌లు లేరు.  నాలుగేళ్లుగా  కోచ్‌లను నియమించకపోవడం చూస్తే ప్రభుత్వానికి క్రీడలపై ఏపాటి నిబద్ధత ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

పుట్టగొడుగుల్లా గుర్తింపు లేనిక్రీడా అసోసియేషన్లు!
ఇదిలా ఉంటే పుట్టగొడుగుల్లా పలు క్రీడా అసోసియేషన్లు పుట్టుకొచ్చి ప్రాధాన్యత లేని క్రీడలను ఆడిస్తున్నాయి. నాలుక కూడా గీసుకోవడానికి అవి ఇచ్చే సర్టిఫికెట్లు పనికిరావు. మరోవైపు– కరాటే క్రీడను వచ్చే ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టనుండటం, ఈ క్రీడకూ గుర్తింపునివ్వడంతో దీనిపై పలువురు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ గుర్తింపు లేని పుట్టగొడుగుల్లా ఉన్న వివిధ కరాటే అసోసియేషన్లు అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. కరాటే పోటీలు, బెల్ట్‌ టెస్టులు (వైట్, ఎల్లో, ఆరెంజ్, బ్రౌన్‌ బెల్ట్‌ మొదలు బ్లాక్‌ బెల్ట్‌ వరకూ) ఒక్కో దానికి ఒక్కొక్క రేటు ఫిక్స్‌ చేసి వేలాది రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి గుంజుతున్నాయి.  బ్లాక్‌బెల్ట్‌కు అయితే ఏకంగా రూ.20వేల నుంచి రూ.25వేలు దండుకుంటు న్నారు. ఒకసారి జిల్లా స్థాయి కరాటే పోటీలు అంటే ఎంతతక్కువ లేదన్నా 150–200మంది పైచిలుకు వివిధ కేటగిరీల్లో తలపడుతుంటారు. ఇవన్నీనూ ప్రైవేటు టోర్నీలే కావడం గమనార్హం! దీనిని బట్టి లెక్కవేసుకోవచ్చు ఎంతగా దండుకుంటున్నారో. అంతేకాకుండా గుర్తింపు లేని ఈ అసోసియేషన్లు తాము ఇచ్చే సర్టిఫికెట్లు అటు విద్య, ఉద్యోగాలకు ఏమాత్రమూ ఉపయోగపడవనే విషయం దాచి విద్యార్థులకు తల్లిదండ్రుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాయి. అంతేకాకుండా రాష్ట్రేతర ప్రాంతాల్లో జరిగే జాతీయస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీలకు తమ అసోసియేషన్ల తరఫున జిల్లా నుంచి తీసుకెళ్లే క్రీడాకారుల నుంచి నిర్వాహకుల  దోపిడీ మరిం త ఎక్కువగా ఉంటోంది. గుర్తింపు లేని క్రీడా అసోసియేషన్లు, ఈ  దోపిడీకి చెక్‌ పెట్టాల్సిన జిల్లా యంత్రాంగం దీనిపై దృష్టి సారించిన పాపానపోలేదు. వాస్తవానికి ప్రభుత్వ యాజమాన్యంలోని స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఇప్పటివరకూ కరాటే పోటీలు నిర్వహించిన దాఖలాలు లేవు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ అయినా వీటిని నిర్వహించే దిశగా ప్రభుత్వం దృష్టి సారిస్తే కొంతవరకైనా జిల్లాలో ప్రతిభావంతులైన కరాటే క్రీడాకారులకు ప్రోత్సాహమిచ్చినట్లవుతుంది.

విద్యాశాఖపై చిన్నచూపే....
క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ ఫెడరేషన్‌ క్రీడలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి రూ.10 చొప్పున వసూలు చేస్తుంది. ఆ నిధుల్లో రూ. 2 ను స్థానిక పోటీలకు, తక్కిన రూ. 8 జిల్లా స్థాయి పోటీలు నిర్వహించేందుకు వినియోగించాల్సి ఉంది. ప్రతి ఏడాది స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ద్వారా సెక్రటరీలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి క్రీడలను నిర్వహించాల్సిన దుస్థితి వస్తోంది.  మండల, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహించే స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌కు నిధులను విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ఫలితంగా ప్రతి ఏటా మండల, జోనల్, ఇంటర్‌ జోనల్, జిల్లా స్థాయి క్రీడలకు నిధుల లేమి పీడిస్తూండటంతో దాతల సాయం కోసం దేబిరించాల్సి వస్తోందని వ్యాయామోపాధ్యాయులు వాపోతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌కు కూడా నిధులు కేటాయించాని కోరుతున్నారు.

స్టేడియం నిర్మాణం కోసం ఆకాశం కేసి చూస్తున్న పిల్లర్లు
మదనపల్లెటౌన్‌: మదనపల్లె డివిజన్‌లో రూ.1. 20లక్షల మంది విద్యార్థులు చదువుతున్నా సరైన క్రీడామైదానాలు లేవు. సగానికి పైగా స్కూళ్లలో క్రీడామైదానాలు లేవు. అరకొర మైదానాల్లోనే ప్రాక్టీస్‌ చేస్తూ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన వారూ ఉన్నారు. క్రీడామైదానాలను ఏర్పాటు చేసి, మౌలిక వసతులు కల్పిస్తే ప్రతిభకు సానపెట్టేందుకు అవకాశం ఉంటుంది. మదనపల్లె డివిజన్‌లో జెడ్పీ 113, జీహెచ్‌ఎస్‌ 5, ఎయిడెడ్‌ 6, ఏపీఎంస్‌ 9, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ 4, కేజీబీవీ 10,ఏపీఆర్‌ఎస్‌1, ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్‌ఎస్‌ 1 చొ ప్పున మొత్తం 156 స్కూళ్లు ఉన్నాయి. వీటిలో  70 శాతం స్కూళ్లకు క్రీడామైదానాలు లేవు. కొన్ని ప్రభుత్వ స్కూళ్లలో వ్యాయామోపాధ్యాయులు కూడా లేకపోవడంతో క్రీడలపై ఆసక్తి ఉన్నా విద్యార్థులకు శిక్షణ ఇచ్చే వారు లేరు. వాస్తవానికి  మండలంలోని ప్రభుత్వ, ప్రైవే టు ఉన్నత పాఠశాలల్లో 2000 చదరపు మీటర్లతో, అదే పట్టణ, మున్సిపాలిటీల్లో అయితే వెయ్యి చదరపు మీటర్లతో ప్రతి స్కూలు క్రీడామైదానం తప్పనిసరిగా ఉండాలనే నిబంధనలు ఉన్నా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. ఇక, బీటీ కళాశాలలో మినీ ఇండోర్‌ స్టేడియం నిర్మాణం పిల్ల్లర్లకే పరిమితమై, పిచ్చిమొక్కలతో దర్శనమిస్తోంది.

చెరువులో ఆటలు!
పలమనేరు: పలమనేరు నియోకవర్గంలో 513 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 45వేల మందికిపైగా విద్యార్థినీ విద్యార్థులు చదువుతున్నారు.ఈ స్కూ ళ్లలో సగానికి పైగా బడులకు క్రీడామైదానాలు లేవు. కొన్ని చోట్ల ఉన్నా అవి అంతంతమాత్రమే. మరికొన్ని పాఠశాలల్లో చెరువుల్లోనూ, బీడుగా ఉన్న చేలల్లోనూ పిల్లలు ఆటలాడుకోవాల్సి వ స్తోంది. పాఠశాలలకు క్రీడా పరికరాలు కూడా ఇవ్వడం లేదు. దీంతో దాతలు స్పందించి ఏదైనా సాయం చేయాల్సిందే. బైరెడ్డిపల్లె ఉన్నత పా ఠశాల విద్యార్థులు వాలీబాల్‌ కోసం ఆందోళన చేశారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే బోధపడుతుంది. ఇక, ప్రతి పాఠశాలలోనూ క్రీడా మైదానాల అభివృద్ధికి రెండేళ్ల క్రితం  రూ.5లక్షల చొప్పున ఉపాధి నిధులను ప్రభుత్వం కేటాయించింది. అయితే ఏమండలంలో నూ ఈ పనుల ఊసేలేదు. దీంతో పలు పాఠశాలల్లో మైదానాలు తక్కువ విస్తీర్ణంలో ఉన్నప్పటికీ  పిచ్చిమొక్కలు, ఎత్తుపల్లాలతో ఉన్నాయి.

క్రీడాకారులకు ప్రోత్సాహం శూన్యం
చిత్తూరు రూరల్‌: చిత్తూరు నియోజకవర్గంలో  27ఉన్నత,  ప్రాథమికోన్నత 18, ప్రాథమిక పాఠశాలలు 148ఉన్నాయి. వీటిలో వేలమంది విద్యార్థులు చదువుతున్నారు.  వీరిలో కొందరు క్రీడల్లో రాణిస్తున్నా తగినప్రోత్సాహం లభించడం లేదు. నియోజకవర్గంలో వ్యాయోమాధ్యాయుల కొరత సైతం వేధిస్తోంది. ప్రధానంగా పాఠశాలలకు ఆటస్థలాలులేవు. నియోజకవర్గవ్యాప్తంగా మొ త్తం 92 పాఠశాలకు ఆటస్థలాలు లేవని విద్యాశా ఖ అధికారులు గుర్తించారు. ఈకారణంగా చాలా మందివిద్యార్థులుక్రీడలకు దూరమవుతున్నారు.

స్టేడియం నిర్మాణం మరిచారు
పీలేరు: పీలేరు నియోజకవర్గంలో 27 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలున్నాయి. ఇందులో సగం పాఠశాలల్లో క్రీడామైదానాలు లేవు.  ఐదు గురుకుల పాఠశాలల్లో నాలుగు పాఠశాలల్లో ఎలాంటి ప్లేగ్రౌండ్‌ లేదు.  పీలేరుతోపాటు నియోజకవర్గంలో నాలుగు ఇండోర్‌ స్టేడియంల నిర్మాణం శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పీలేరు, కలికిరి, గుర్రంకొండ, వాల్మీకిపురం మండలాలకు ఇండోర్‌ స్టేడియంలు మం జూరు చేశారు. వాటి  నిర్మాణానికి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో 2011 జూలై 22న శిలాఫలకం వేశారు.  నిర్మాణానికి రూ. 8.40 కోట్లు మంజూరు చేశారు. అయితే, ఏడేళ్లుగా గడచినా వాటి నిర్మాణం ఊసే లేదు.

మరిన్ని వార్తలు